18న విద్యార్థుల శత శాతం హాజరుకు ఆదేశం
eenadu telugu news
Published : 17/10/2021 02:09 IST

18న విద్యార్థుల శత శాతం హాజరుకు ఆదేశం

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు దసరా సెలవులు 16న ముగియగా, 17న ఆదివారం కావడంతో సెలవు కొనసాగింది. 18న విద్యా సంస్థలు తెరచుకోనున్నాయి. దాంతో ఏపీ సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యార్థులు 18వ తేదీ శత శాతం హాజరయ్యేలా చూడాలని ఆ సంస్థ ఉన్నతాధికారులు శనివారం ఆదేశించారు. జగనన్న అమ్మఒడి పథకం వర్తింప జేసేందుకు 75 శాతం హాజరు నిబంధనను అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల ఆదేశించారు. దాంతో గురుకులాల్లో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ విద్యార్థులను సోమవారం ఉదయం 9 గంటల లోపు ఆయా గురుకులాల్లో హాజరయ్యేలా చూడాలని ప్రిన్సిపల్స్‌కు ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు అందిన వెంటనే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని 35 గురుకులాల ప్రిన్సిపల్స్‌ ఆయా తరగతుల ఉపాధ్యాయులతో విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేయించి 18న గురుకులాలకు పిల్లలను తీసుకు రావాలని మాట్లాడిస్తున్నారు. ఇప్పటికే గురుకులాల్లో విద్యార్థుల హాజరు శాతం తక్కువుగా ఉండటంతో వారి తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొని ఉంది. 75 శాతం హాజరు లేకుంటే అమ్మఒడిలో అందజేసే రూ.15 వేలు అందకుండా పోయే పరిస్థితి ఉంది. అప్పుడు ఉపాధ్యాయులను ప్రశ్నించే అవకాశం ఉండటంతో పాఠశాలలు తెరవనున్న 18న విద్యార్థినీ, విద్యార్థులు హాజరవ్వాలని సూచిస్తున్నారు. హాజరు కారణంతో అమ్మఒడి దూరమైతే తాము బాధ్యత వహించమని ముందుగానే స్పష్టం చేస్తున్నారు. దాంతో తల్లిదండ్రులు తమ పిల్లలను సోమవారం గురుకులాలకు తీసుకొస్తామని చెబుతున్నట్లు సమాచారం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని