‘రైతు ఉద్యమం రక్తపాతంగా మార్చేందుకు కుట్ర’
eenadu telugu news
Published : 17/10/2021 02:09 IST

‘రైతు ఉద్యమం రక్తపాతంగా మార్చేందుకు కుట్ర’


మాట్లాడుతున్న పీవోడబ్ల్యూ జాతీయ కన్వీనర్‌ సంధ్య

వినుకొండ, న్యూస్‌టుడే: రైతు ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు భాజపా కుట్ర పన్నిందని అందులో భాగంగానే ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరిలో రైతులను కేంద్రమంత్రి కుమారుడు అశిష్‌ మిశ్రా కారుతో తొక్కించి రక్తపాతం సృష్టించాడని ప్రగతిశీల మహిళా సంఘం(పీవోడబ్ల్యూ) జాతీయ కన్వీనర్‌ సంధ్య ఆరోపించారు. వినుకొండలో ఇండియన్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కమిటీ సభ్యుడు సీహెచ్‌ఎల్‌ఎన్‌ మూర్తి కార్యాలయంలో శనివారం సంధ్య మాట్లాడుతూ హరియాణా సీఎం ఖట్టర్‌, కేంద్రమంత్రి మిశ్రా బహిరంగ సభల్లో అంతకుముందు రైతులకు మా తడాఖా చూపిస్తామని ఎదురొస్తే కార్లతో తొక్కిస్తామని రెచ్చగొట్టే ప్రంసంగాలు చేశారన్నారు. దాని ఫలితంగానే లఖింపూర్‌ హింసాయుత ఘటనలు చోటు చేసుకున్నట్లు చెప్పారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని 500 రైతు సంఘాలు ఉద్యమంలో పాల్గొంటున్నాయని ఇది మరో జాతీ విముక్తి పోరాటంగా ఆమె అభివర్ణించారు. రెండు తెలుగు రాష్ట్రాలు నూతన చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేసి తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్‌ చేశారు. పల్నాడుకు చెందిన మావోయిస్టు నాయకుడు ఆర్కే నాలుగు దశాబ్దాలు తన జీవితం ఉద్యమాలకు అంకితం చేశారని పేర్కొన్నారు. సమావేశంలో సీపీఐ, సీపీఎం నియోజకవర్గ బాధ్యులు మారుతీవరప్రసాద్‌, హనుమంతరెడ్డి, న్యాయవాది మూర్తి, సీఐటీయూ నేత ఏసు తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని