అనిశా వలలో వీఆర్వో
eenadu telugu news
Published : 17/10/2021 02:09 IST

అనిశా వలలో వీఆర్వో

రూ.55 వేలు లంచం తీసుకుంటూ చిక్కిన వైనం


పట్టుబడిన నగదుతో వీఆర్వో వెంకటశివరావు

మాచర్ల గ్రామీణ, న్యూస్‌టుడే: తమ పొలానికి పాసుపుస్తకం కోసం ఓ రైతు అధికారిని వేడుకున్నారు. నగదు ఇవ్వాల్సిందేనని చెప్పడంతో గత్యంతరం లేక సదరు రైతు అవినీతి నిరోధక దళం (అనిశా)ను ఆశ్రయించాడు. అనిశా అధికారులు వల విసరడంతో సదరు వీఆర్వో లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. అనిశా డీఎస్పీ పీవీవీ ప్రతాప్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం... మాచర్ల మండలం కంభంపాడు గ్రామానికి చెందిన పిట్టల నర్సయ్య తండ్రి పెదనాగయ్యకు ఎకరా 67 సెంట్ల డీకే పట్టా పొలం ఉంది. వీటికి సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌లో నమోదుచేశారు. ఇంతవరకు పాసు పుస్తకం లేదు. గత నెల 21న పాసుపుస్తకం కోసం నర్సయ్య అర్జీ పెట్టుకున్నారు. నివేదిక తహశీల్దారుకు అనుకూలంగా ఇవ్వాలంటే రూ. 65 వేలు ఇవ్వాలని కంభంపాడు-1 వీఆర్వో కలేటి వెంకటశివరావు డిమాండ్‌ చేశాడు. నర్సయ్య తాను అంత ఇచ్చుకోలేనని ప్రాధేయపడటంతో రూ.55 వేలకు వీఆర్వో తగ్గించాడు. శనివారం నర్సయ్య కంభంపాడు శివారు గ్రామమైన జింకలబోడులోని వాళ్ల అమ్మమ్మ ఇంటి వద్దకు వీఆర్వోను డబ్బులు తీసుకునేందుకు రావాలని చెప్పడంతో వీఆర్వో అక్కడికి వచ్చారు. సమాచారం అందుకున్న అనిశా అధికారులు వీఆర్వో వెంకటశివరావు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. పాలువాయి సచివాలయం, మాచర్ల తహశీల్దారు కార్యాలయంలో వీఆర్వోను విచారించారు. అనంతరం ఆయన్ను గుంటూరుకు తరలించారు. అనిశా దాడుల్లో డీఎస్పీతోపాటు సీఐలు రవిబాబు, నాగరాజు, శ్రీధర్, మన్మథరావు, అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని