కృష్ణానదిపై సమాంతర వంతెనలు!
eenadu telugu news
Published : 17/10/2021 02:09 IST

కృష్ణానదిపై సమాంతర వంతెనలు!


వెంకటాయపాలెం వద్ద నిర్మాణ పనులు

ఈనాడు, అమరావతి విజయవాడ బైపాస్‌ రోడ్డు నాలుగో ప్యాకేజీ పనులకు అడ్డంకులు తొలగిపోయాయి. రాజధాని రైతుల నుంచి అభ్యంతరాలు రావడంతో గత కొన్ని నెలలుగా పనులు ప్రారంభించని విషయం తెలిసిందే. న్యాయస్థానం నుంచి స్పష్టత రావడంతో గుత్త సంస్థలు పనులు ప్రారంభించాయి. ఈ ప్యాకేజీలో కృష్ణా నదిపై వంతెనను వినూత్నంగా నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. 
పనులు ఇలా...
ప్రస్తుతం జులై నుంచి ప్రాథమికంగా పనులు ప్రారంభించారు. గొల్లపూడిలో కాస్టింగ్‌ యార్డు ఏర్పాటు చేశారు. 5 శాతం వరకు పనులు జరిగాయి. తుళ్లూరు మండలం వెంకటాయపాలెం వద్ద రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మంగళగిరి వద్ద పైవంతెన పనులు జరుగుతున్నాయి. హాయ్‌ల్యాండ్‌ సమీపంలో పైవంతెన పనులు 80శాతం పూర్తయినట్లు కంపెనీ ప్రతినిధి చెప్పారు. నాలుగో ప్యాకేజీకి రాజధాని రైతులు మెలిక పెట్టారు. రాజధాని భూముల తరహాలోనే తమకు పూలింగ్‌(సమీకరణ) కింద భూములు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బైపాస్‌ నిర్మాణానికి 2014కు ముందే భూసేకరణ జరిగింది. పరిహారం కూడా చెల్లించారు. మంగళగిరి మండలంలోని రైతులు పరిహారం తీసుకున్నారు. తుళ్లూరు మండలం పరిధిలోని గ్రామాల రైతులు పరిహారం సరిపోదని ఆర్భిట్రేషన్‌కు వెళ్లారు. ఈ సమస్య ప్రస్తుతం పరిష్కారమైనట్లు జాతీయ రహదారుల సంస్థ అధికారులు చెప్పారు. 
* జాతీయ రహదారి-16 విస్తరణలో భాగంగా విజయవాడ బైపాస్‌ నిర్మాణం చేస్తున్నారు. గుంటూరు జిల్లా చినకాకాని వద్ద ఉన్న ఉన్నత పాఠశాల నుంచి కృష్ణా జిల్లా సూరాయపాలెం(గొల్లపూడి) వరకు 17.820 కిలోమీటర్ల దూరం ఆరు వరసలు రహదారిగా విస్తరిస్తారు. ఈ ప్యాకేజీలో భాగంగా కృష్ణా నదిపై వంతెన నిర్మాణం చేయాల్సి ఉంది. 30 నెలల సమయంలో దీన్ని పూర్తి చేయాల్సి ఉంది. ప్రస్తుతం పనులు ప్రారంభించిన తేదీ నుంచి 2023 జులై నాటికి నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. కృష్ణా నదిపై వంతెనతో పాటురెండు ప్రధాన వంతెనల నిర్మాణం చేయాల్సి ఉంది. పాలవాగుపై 90 మీటర్ల దూరం, కొండవీటి వాగుపై 360 మీటర్ల దూరం ఆరు వరసల వంతెనలను నిర్మాణం చేస్తారు.
అయిదు పైవంతెనలు: హాయ్‌ల్యాండ్‌ సమీపంలో, 39 కి.మీ వద్ద, 37 కిలోమీటరు, మంగళగిరి-తుళ్లూరు మార్గంలో కృష్ణాయపాలెం, సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు మీద ఒకటి చొప్పున పైవంతెనలు నిర్మాణం చేయాల్సి ఉంది. ఇప్పటికే హాయ్‌ల్యాండ్‌ వద్ద 80శాతం పూర్తయింది.

కృష్ణా నదిపై వంతెన..!
వాస్తవానికి కృష్ణా నదిపై ఈ ప్యాకేజీలో కలిపి ఐకానిక్‌ వంతెన నిర్మాణం చేయాలని గత ప్రభుత్వం ఆలోచన చేసింది. కొన్ని ఆకృతులను ఖరారు చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అదనంగా రూ.350కోట్లు వెచ్చించాల్సి వస్తోందని  ఆప్రతిపాదన విరమించారు. ప్రస్తుతం ప్యాకేజీలో భాగంగా ఆరువరుసల వంతెన నిర్మాణం చేయాల్సి ఉంది. దీన్ని రెండు వంతెనలు సమాంతరంగా నిర్మాణం చేస్తారు. 

గడువులోగా నిర్మాణం
కొవిడ్, వర్షాలు వల్ల కొంత ఆలస్యం అయింది. ఆదాని సంస్థతో సంయుక్తంగా చేపడుతున్నాం. గొల్లపూడి వద్ద కాస్టింగ్‌ యార్డు ఏర్పాటు చేశాం. న్యాయపరమైన చిక్కులు తొలగిపోయాయి. రెండు సమాంతర వంతెనలు మూడు వరుసల చొప్పున నిర్మాణం చేయనున్నాం. విస్తరణకు అవకాశం ఉండే విధంగా ఆకృతులు రూపొందించాం. 
- అనిల్‌కుమార్, వైస్‌ప్రెసిడెంట్, నవయుగ సంస్థ 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని