మోసగాళ్లున్నారు.. జాగ్రత్త !
eenadu telugu news
Published : 17/10/2021 02:15 IST

మోసగాళ్లున్నారు.. జాగ్రత్త !

తక్కువ ధరకు బంగారం పేరుతో టోకరా
అత్యాశకు పోయి ర్యాప్‌ గ్యాంగు వలలో చిక్కుకుంటున్న బాధితులు

టీ దుకాణాలు.. బస్సుల్లో అపరిచిత వ్యక్తుల్లా మాటలు కలుపుతారు. స్టూవర్టుపురంలో తక్కువ ధరకే బంగారం విక్రయిస్తారని నమ్మకంగా చెబుతారు. ఫలానా వ్యక్తులను కలవండి అంటూ ఫోన్‌ నంబర్‌ కూడా ఇస్తారు. కొందరు వ్యాపారులు, ఉద్యోగులు వారి మాయమాటలు నమ్మి వలలో చిక్కుకొంటున్నారు. బంగారు బిస్కెట్లు కొనుగోలు చేద్దామని ఆశకు పోయి రూ.లక్షల నగదుతో వచ్చి.. ర్యాప్‌ గ్యాంగ్‌ చేతిలో మోసపోతూ లబోదిబోమంటున్నారు.

బాపట్ల, న్యూస్‌టుడే ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన విశ్రాంత సైనికుడు నల్లమోతు రవికిరణ్‌కు తక్కువ ధరకు బంగారం విక్రయిస్తామని ఓ మధ్యవర్తి ద్వారా చీరాల ఆదినారాయణ పురానికి చెందిన ప్రతాప్‌ నమ్మించాడు. రూ.7 లక్షలకే 200 గ్రాముల బంగారు బిస్కెట్లు ఇస్తామని ఆశపెట్టాడు. ఈ మాటలు నమ్మిన రవికిరణ్‌ స్నేహితుడు జనార్దన్‌తో కలిసి గతనెల 28న కారులో ఈపూరుపాలెం వద్దకు వచ్చాడు. అక్కడ కారులో ఎక్కిన ప్రతాప్‌ వారిని బాపట్ల తీసుకొచ్చి కంకటపాలెం మీదగా మురుకుండపాడు- వెదుళ్లపల్లి రోడ్డులోకి తీసుకెళ్లాడు. మురుకుండపాడు ఉత్తర మురుగు కాలువ వంతెన సమీపంలో కారు ఆపాడు. అక్కడికి మూడు వాహనాల్లో ప్రతాప్‌ మనుషులు వచ్చారు. రవికిరణ్‌ వద్ద రూ.6.10 లక్షల నగదు తీసుకుని బంగారు గొలుసు ఇచ్చారు. తనకు గొలుసు వద్దని, బంగారు బిస్కెట్లే కావాలని విశ్రాంత సైనికుడు కోరాడు. వాహనాల్లో వచ్చిన ఆరుగురు వ్యక్తులు తాము విజిలెన్స్‌ పోలీసులమని చెప్పి రవికిరణ్, జనార్దన్‌ను కొట్టి రూ.6.10 లక్షల నగదు తీసుకుని పరారయ్యారు. బాధితులు లబోదిబోమంటూ వెదుళ్లపల్లి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. మోసానికి పాల్పడిన ప్రతాప్, బుద్ధుడు, మరో ఐదుగురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. 
రెండు రాష్ట్రాల్లోనూ ముఠాలు..
బాపట్ల మండలం స్టూవర్టుపురం, ప్రకాశం జిల్లా చీరాల కేంద్రంగా తక్కువ ధరకు బంగారం విక్రయిస్తామని నమ్మించి నగదు తీసుకుని మోసం చేసే వారు ర్యాప్‌ గ్యాంగులుగా పేరుబడ్డారు. వారికి సంబంధించిన వ్యక్తులు రెండు రాష్ట్రాల్లో ఉన్నారు. వారి మాయమాటలు నమ్మి గతంలో హైదరాబాద్, ప్రొద్దుటూరు, మహబూబ్‌నగర్, అనంతపురం, ఖమ్మం, నరసరావుపేటకు చెందిన వ్యక్తులు రూ.50 లక్షల నగదుతో స్టూవర్టుపురం వచ్చారు. తొలుత నమ్మకం కలిగించటానికి ముఠా సభ్యులు వారికి కొంత బంగారం చూపించారు. నిర్మానుష్య ప్రాంతానికి కొనుగోలుదారులను నగదుతో రప్పించి ముఠా సభ్యులే కొందరు పోలీసుల వేషంలో వచ్చి బెదరగొట్టి సొమ్ములు తీసుకుని స్టేషన్‌కు రమ్మని చెప్పి ఉడాయించారు. కొన్ని గంటల తర్వాత పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాకగాని బాధితులకు తాము మోసపోయినట్లు తెలియలేదు. బాధితుల ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితులను పట్టుకోవటానికి నెలల సమయం పడుతోంది. రూ.లక్షల నగదు కొట్టేసిన ముఠాలు గోవా, ముంబయి, కేరళ వెళ్లి జల్సాలు చేస్తున్నారు. పోయిన నగదులో 60 నుంచి 70 శాతమే పోలీసులు రికవరీ చేయగలుగుతున్నారు.

అపరిచితుల మాటలు నమ్మి మోసపోకండి
ఎవరైనా అపరిచిత వ్యక్తులు మాటలు కలిపి స్టూవర్టుపురం, చీరాల ప్రాంతంలో తక్కువ ధరకు బంగారం విక్రయిస్తారని చెబితే నమ్మొద్దు. మార్కెట్ ధర కన్నా తక్కువకు ఇక్కడ ఎవరూ పసిడి విక్రయించరన్న విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. ర్యాప్‌ గ్యాంగుల వలలో చిక్కుకుని రూ.లక్షలు పోగొట్టుకోవద్దు. ఒంగోలుకు చెందిన విశ్రాంత సైనికుడు రవికిరణ్‌ను మోసం చేసిన ముఠాను త్వరలో పట్టుకుని అరెస్టు చేసి జైలుకు పంపిస్తాం. బాధితుడు పోగొట్టుకున్న నగదు రికవరీ చేస్తాం.
- శ్రీనివాసరెడ్డి, బాపట్ల గ్రామీణ సీఐ 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని