నైపుణ్యానికి  సాన
eenadu telugu news
Updated : 19/10/2021 05:31 IST

నైపుణ్యానికి  సాన

మైక్రోసాఫ్ట్‌ కోర్సుల అభ్యాసనంలో డిగ్రీ విద్యార్థులు


నరసరావుపేట అర్బన్, న్యూస్‌టుడే  ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగ సాధనకు డిగ్రీ పట్టా ఉంటే సరిపోదు.. అవసరాలకు పనికొచ్చే నైపుణ్యాలున్న వారికే సంస్థలు ఉద్యోగ ఎంపికల్లో ప్రాధాన్యం ఇస్తున్నాయి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరి. గతంలో మాదిరి డిగ్రీ పూర్తయిన తరువాత ప్రైవేటు శిక్షణ సంస్థల్లో చేరి ప్రత్యేక తర్ఫీదు పొందడం కాకుండా, ఓవైపు డిగ్రీ చదువుతూనే విద్యార్థులు మరోవైపు నైపుణ్యాలకు సాన పడుతున్నారు. అందుబాటులో ఉన్న అవకాశాలను నవతరం అందిపుచ్చుకుంటున్నారు. 
జిల్లాలో డిగ్రీ విద్యార్థులకు ప్రతిష్టాత్మక మైక్రోసాఫ్ట్‌ సంస్థ పలు కంప్యూటర్‌ కోర్సులు అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రణాళిక అమలు చేస్తున్నారు. నైపుణ్యాభివృద్ధి సంస్థతో భాగస్వాములైన కళాశాలల్లో విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి సాధనకు అనుగుణంగా శిక్షణ తరగతులతో పాటు ధ్రువపత్రాలను అందజేయనుంది. ప్రస్తుతం సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని డిగ్రీ, ఇంజినీరింగ్‌ కళాశాలల్లో శిక్షణ కేంద్రాలు నడుస్తున్నాయి. అందుకు అవసరమైన సామగ్రిని సైతం సంస్థ అందజేసింది. సీఆర్టీ తరగతులను ఇప్పటి వరకూ నిర్వహిస్తున్నారు. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం మైక్రోసాఫ్ట్‌ సంస్థతో చేసుకున్న ఒప్పందం మేరకు జిల్లాలో ఆరు రకాల కోర్సుల్లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. అయితే ముందుగా ప్రాథమిక పరిజ్ఞానాన్ని విద్యార్థులకు అందించిన తర్వాత వారికున్న ఆసక్తి మేరకు శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఎంఎస్‌ ఆఫీస్, క్లౌడ్‌ కంప్యూటింగ్, డేటా అనాలిసిస్, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్, ఎక్సెల్‌ అడ్వాన్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. ప్రాథమిక పరిజ్ఞానంపై 114 గంటల పాటు 800 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. కొవిడ్‌ కారణంగా తక్కువ మంది విద్యార్థులు ప్రాథమిక శిక్షణ పొందారు. 

మరింత మందికి అవకాశం
జిల్లాలో నైపుణ్యాభివృద్ధి సంస్థతో ఒప్పందంలో ఉన్న డిగ్రీ కళాశాలలు 30 వరకు ఉన్నాయి. వీటిల్లో తృతీయ బీఎస్సీ డిగ్రీ విద్యార్థులు 3200 మంది ఉన్నారు. వీరిలో ఇప్పటికి ప్రాథమిక శిక్షణ పొందినవారు 800 మాత్రమే ఉన్నారు. మిగిలినవారికి శిక్షణనిచ్చి తర్వాత వారికి గుర్తించిన కోర్సులో ఆన్‌లైన్‌ ద్వారా మైక్రోసాఫ్ట్‌ నిపుణులు బోధిస్తారు. ఎక్కువ మంది విద్యార్థులకు ప్రయోజనం కల్పించాలన్నా లక్ష్యంతో మరోసారి ప్రాథమిక పరిజ్ఞానం గురించి తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక శిక్షణ ద్వారా బహుళజాతి సంస్థల్లో సాంకేతిక పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యేందుకు తరగతులు దోహదపడనున్నాయి. 

ఇంటర్వ్యూ ఎదుర్కొనేందుకు ఉపయోగం
నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా మైక్రోసాప్ట్‌ కోర్సుకు సంబంధించి ప్రాథమికంగా నిర్వహించిన తరగతులకు హాజరయ్యాను. ఇప్పటి వరకూ థియరీ గురించి మాత్రమే తెలుసు. డిగ్రీ విద్యార్థులకు ఇటువంటి తరగతులు ఎంతో ఉపయోగపడతాయి. బహుళ జాతి పరిశ్రమల్లో ఉద్యోగాలకు ఇంటర్య్యూలకు హాజరైతే టెక్నికల్‌ రౌండ్‌లో శిక్షణ వల్ల ప్రయోజనం ఉంటుంది. 
- కావ్య, వాసవి డిగ్రీ కళాశాల విద్యార్థి 

సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు 
నైపుణ్యాభివృద్ధి సంస్థ నిర్వహించే మైక్రోసాఫ్ట్‌ కోర్సుల తరగతులు బాగా ఉపయోగపడతాయి. సాప్ట్‌వేర్‌ కంపెనీల్లో ఉద్యోగాలు చేయాలంటే సాధారణమైన పరిజ్ఞానంతో పాటు సాంకేతికత తెలిసి ఉండాలి. సాధన కూడా అవసరం. ఇంజినీరింగ్‌ విద్యార్థులతో పోల్చితే డిగ్రీ విద్యార్థులకు అవకాశం తక్కువ. ఏపీఎస్‌ఎస్‌డీసీ తరగతులతో ఆ సమస్య ఉండదు. 
- షేక్‌ షమీముల్లా, తృతీయ బీఎస్సీ

వారంలోగా తరగతులు 
విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపు లక్ష్యంగా మైక్రోసాఫ్ట్‌ సహకారంతో శిక్షణ ఇస్తున్నాం. ప్రాథమిక పరిజ్ఞానం గురించి శిక్షణ తీసుకోని విద్యార్థులకు మరో వారం తర్వాత తరగతులు ప్రారంభిస్తున్నాం. విద్యార్థులు తమ వివరాలను కళాశాల నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వీరిలో 42 రోజుల పాటు శిక్షణ ఇస్తాం. తర్వాత విద్యార్థులు ఆసక్తిని బట్టి ఆన్‌లైన్‌ ద్వారా శిక్షణ ఉంటుంది. ఆన్‌లైన్‌ కోర్సులకు ఎంత కాల వ్యవధి అనేది మైక్రోసాఫ్ట్‌ వారే నిర్ణయిస్తారు. దీంతో సాఫ్ట్‌వేర్‌ రంగంలో విద్యార్థులు ఉద్యోగాలు సాధించేందుకు అవకాశం ఉంటుంది.
- షేక్‌ బాజీబాబు, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని