ఇదేం గందరగోళం
eenadu telugu news
Published : 19/10/2021 02:21 IST

ఇదేం గందరగోళం

ఈనాడు, అమరావతి పాఠశాల విద్యార్థులకు మరో రెండు రోజుల్లో ఫార్మెటివ్‌-1(ఎఫ్‌ఏ-1) పరీక్షలు ప్రారంభం కాబోతున్న తరుణంలో ఒక్కసారిగా రాష్ట్ర విద్య, పరిశోధన శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్టీ) ప్రశ్నపత్రాన్ని తామే రూపొందించి పంపుతామని షాకిచ్చింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను అనుసరించి జిల్లాలో ఇప్పటికే కొన్ని పాఠశాలలు తరగతుల వారీగా పిల్లల సామర్థ్యాలను గ్రేడ్లుగా చేసుకుని వేర్వేరుగా ప్రశ్నపత్రాలు రూపొందించి వాటిని జిరాక్సులు తీసి సిద్ధం చేసుకున్నారు. సగటున ఒక్కో పాఠశాలకు పిల్లల సంఖ్యను బట్టి రూ.2 వేల నుంచి రూ.4వేల దాకా వ్యయాలయ్యాయి. ఇది మొత్తం బూడిదలో పోసిన పన్నీరేనని ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పరీక్ష నిర్వహణకు ఒక గంట ముందు ఎంఈఓలకు వాట్సాప్‌లో ప్రశ్నాపత్రాన్ని పంపేలా సర్క్యులర్‌ జారీ చేసింది. తొలుత ఎంఈఓలకు వారి నుంచి హెచ్‌ఎంలకు పేపరు ఫార్వార్డ్‌ చేస్తారు. ఆ వచ్చిన ప్రశ్నపత్రాన్ని సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులను పిలిచి పిల్లలకు డిక్టేట్‌ చేయించి పరీక్ష నిర్వహించేలా నూతన విధానం ఉంది. ఇలాగైతే పరీక్షలు సక్రమంగా, పారదర్శకంగా జరపడం ఎలా సాధ్యమనే ప్రశ్న ఉదయిస్తోంది.
ఇష్టానుసారం మార్కుల కట్టడికే!
‘పాఠశాలల స్థాయిలో పరీక్షలు నిర్వహించడం వల్ల గుర్తింపు పొందిన కొన్ని ప్రైవేటు పాఠశాలలు తమ పిల్లలకు నూరు శాతం మార్కులు వేసుకుంటున్నాయి. నేరుగా రాష్ట్రం మొత్తానికి ఎస్‌సీఈఆర్టీ పేపరు రూపొందించి పంపితే దీనిని అరికట్టొచ్చని ఈ నిర్ణయం తీసుకున్నట్లు’ ఉన్నతాధికారులు బదులిస్తున్నారు. పరీక్షల కోసం ముందస్తు ప్రణాళిక, ఉపాధ్యాయులతో సంప్రదింపులు ఇలా అనేకం ఉంటాయి. అదేం లేకుండా ఏకపక్షంగా పరీక్షలకు నిర్ణయం తీసుకోవడంతో జిల్లా వ్యాప్తంగా 3560 పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ప్రస్తుతం వాటిని ఎలా జరపాలని తలలు పట్టుకుంటున్నారు. గతంలో ఎఫ్‌ఏ పరీక్షలు స్కూల్‌ స్థాయిలోనే పెట్టుకోవాలని, దానికి జిల్లా కామన్‌ ఎగ్జామినేషన్‌ బోర్డు(డీసీఈబీ) నుంచి కూడా పేపరు తీసుకోవద్దని ఆదేశించింది. వాస్తవంగా ఎఫ్‌ఏ-1 అనేవి పాఠశాల స్థాయిలో ప్రతి టీచర్‌ తాను బోధించిన పాఠ్యాంశాల నుంచి చిన్న, పెద్ద ప్రశ్నలు కలిపి 20 మార్కులకు ప్రశ్నాపత్రం రూపొందించుకుని పరీక్ష పెట్టాలనేది అసలు ఉద్దేశం. అందుకు విరుద్ధంగా పరీక్షలు జరగబోతుండడంతో పిల్లల్లోనూ గందరగోళం ఏర్పడింది. ప్రశ్నపత్రం 20 మార్కులకు, ప్రాజెక్టు వర్క్, రీడింగ్‌ స్కిల్స్, రెస్పాన్స్‌ ఈ మూడు విభాగాలకు కలిపి మరో 30 చొప్పున మొత్తంగా 50 మార్కులకు పరీక్ష ఉంటుంది. 

సిలబస్‌పై  స్పష్టత ఏదీ?
ఈ పరీక్షలకు సంబంధించి సిలబస్‌పై కూడా స్పష్టత లోపించింది. అసలు అకడమిక్‌ క్యాలెండర్‌లో ఇచ్చిన సిలబస్‌ను రెôడుసార్లు మార్పు చేశారు. ఇప్పటివరకు బోధించిన పాఠ్యాంశాల నుంచే కాకుండా ఎస్‌సీఈఆర్టీ పంపిన ‘వారధి’ నుంచి కొన్ని ప్రశ్నలు ఇస్తామని పేర్కొంది. పాఠశాలలు పునః ప్రారంభమైనప్పుడే ఈ పుస్తకాలను పిల్లలకు అందజేశారు. ఇవి కొందరికి అందలేదు. వాటిల్లో నుంచి ప్రశ్నలిస్తే ఎలా రాయగలరని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇంత గందరగోళం నడుమ పరీక్షలు జరగనుండడంపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు.

బొమ్మలు  ఎలా గీయాలి?
పిల్లలకు నేరుగా ప్రశ్నపత్రం ఇవ్వకుండా బోర్డుపై రాసి సమాధానాలు రాయించాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. గణితం, సైన్సు, సోషల్‌ స్టడీస్‌లో కొన్ని డయాగ్రామ్స్‌ ఇచ్చి వాటిని చూసి సమాధానాలు రాయాల్సి ఉంటుందని, ఆ బొమ్మలను బోర్డుపై గీసి సకాలంలో పరీక్ష నిర్వహించడం సాధ్యమేనా అని కొందరు హెచ్‌ఎంలు ప్రశ్నిస్తున్నారు. అవసరమైతే ప్రింట్లు తీసుకోవచ్చని  చెబుతున్నారు. చాలా పాఠశాలల్లో ప్రింటర్లు లేవు. ఒకవేళ అవి ఉన్నా ఆ సయయానికి విద్యుత్తు లేకపోతే పిల్లలకు పేపరు ఎలా అందించాలో తెలియడం లేదని ఉపాధ్యాయులు మొత్తుకుంటున్నారు.

ప్రశ్నపత్రం ఎస్‌సీఈఆర్‌టీ పంపుతుంది

తాజాగా ఎస్‌సీఈఆర్టీ నుంచి ప్రశ్నపత్రం పంపించేలా ఆదేశాలు అందాయి. దీని ప్రకారమే ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఎఫ్‌ఏ-1 పరీక్షలు జరుగుతాయి. రాష్ట్రం మొత్తానికి ఒక్కటే పేపరు. దీన్ని అనుసరించాల్సిందే. ఎంఈఓల నుంచి హెచ్‌ఎంలకు వాట్సాప్‌లో పంపుతాం. దాన్ని వారు ఉపాధ్యాయులకు పంపించి పిల్లలకు పరీక్షలు పెట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించాం. వారధి పుస్తకాలు అందరికి సరఫరా చేశాం. ఎక్కడా కొరత లేదు. ఒకవేళ అందని వారు ఉంటే నాదృష్టికి తేవాలి. - ఆర్‌.ఎస్‌.గంగాభవాని, జిల్లా విద్యాశాఖ అధికారిణి, గుంటూరు 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని