నాటుసారాకు అడ్డుకట్టేది!
eenadu telugu news
Published : 19/10/2021 02:21 IST

నాటుసారాకు అడ్డుకట్టేది!


కొండవీడులో సారా ధ్వంసం చేసిన స్థావరం వద్ద అధికారులు 

న్యూస్‌టుడే, యడ్లపాడు, నరసరావుపేట లీగల్‌  ప్రజలను క్రమంగా మద్యం అలవాటుకు దూరం చేయాలన్న ఉద్దేశంతో మద్యం ధరలు భారీగా పెంచి దుకాణాల సంఖ్యను పరిమితం చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంటోంది. మద్యం బాబులు తక్కువ ధరకు దొరుకుతున్న నాటుసారాను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు తెలంగాణాలో మద్యం ధరలు తక్కువగా ఉండటంతో అక్కడి మద్యాన్ని జిల్లాలోకి అక్రమ రవాణా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. మద్యం అక్రమ రవాణా, నాటుసారా నియంత్రణలో భాగంగా ఎక్సైజ్, పోలీసు అధికారుల నాటుసారా స్థావరాలపై దాడులు చేస్తున్నా అడ్డుకట్ట పడటంలేదు. దీంతో గ్రామాల్లో గుట్టుచప్పుడు కాకుండా తెలంగాణా మద్యం, నాటుసారా విక్రయాలు జోరుగా సాగుతున్నారు. 
దాడులు చేస్తున్నా ఫలితం లేదు
జన సంచారం లేని ప్రాంతాలలో నాటుసారా బట్టీలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలోని కొండవీడు కొండలు, స్టూవర్టుపురం, నిజాంపట్నం, నగరం, మాచర్ల, పల్నాడు, నరసరావుపేట పమిడిపాడు ప్రాంతంలో పెద్దఎత్తున నాటుసారా కాస్తున్నారు. మారుమూల గ్రామాలు, పారిశ్రామికవాడల్లో కూలీలు, మిల్లు కార్మికులను ఎంచుకుని మధ్యవర్తుల ద్వారా నాటుసారాను లీటర్ల లెక్కన విక్రయిస్తున్నారు. ఎక్సైజ్‌ అధికారుల కదలికలను పసిగట్టి క్షేత్రస్థాయిలో సారాబట్టీలపై దాడులు చేసే సమయానికి ముందుగానే పరారవుతున్నారు. చారిత్రక, పర్యాటక కేంద్రంగా ఉన్న కొండవీడును సారా తయారీ కేంద్రంగా మార్చుకున్నారు. కొండవీడు కొండలు కిలోమీటర్ల పొడవునా విశాలంగా వ్యాపించి ఉండటం, దట్టమైన చెట్లలో కొండల పైభాగానికి అధికారులు వెళ్లటానికి సాధ్యపడక పోవటం అక్రమార్కులకు అనుకూలంగా మారింది. ఎక్సైజ్‌ అధికారులు సారాబట్టీలపై పలుసార్లు దాడులు చేసి బెల్లంఊటను ధ్వంసం చేస్తున్నా నాటుసారా తయారీకి అడ్డుకట్ట పడటం లేదు. అక్రమార్కులకు రాజకీయ నాయకుల అండదండలు ఉండటంతో నామమాత్రపు కేసులు నమోదు మినహా కఠిన చర్యలు ఉండడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

పల్లెలను ముంచెత్తుతున్న తెలంగాణ మద్యం 
 కృష్ణానది నుంచి నాటు పడవల ద్వారా తెలంగాణ మద్యాన్ని రాష్ట్రంలోకి తరలిస్తున్నారు. పొందుగల సరిహద్దు, గురజాల, మాచర్ల, మాచవరం, కారంపూడి తదిరత ప్రాంతాల ద్వారా పాలు, కూరగాయలు తదితర నిత్యావసర సరకుల రవాణా ముసుగులో తెలంగాణా మద్యాన్ని ఏపీలోకి తీసుకొస్తున్నారు. మద్యం తరలించే క్రమంలో అక్రమార్కులు అనేక మార్గాలను ఆశ్రయిస్తున్నారు. 

*గతనెల 30న సెబ్‌ అధికారులు రెండు బృందాలుగా విడిపోయి కొండవీడులో కొండల్లో అక్రమంగా నిర్వహిస్తున్న నాటుసారా బట్టీలపై దాడులు చేశారు. 48 డ్రమ్ముల్లో నిల్వ చేసిన 7500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసి 28 లీటర్ల నాటుసారా   స్వాధీనం చేసుకున్నారు. 

*చిలకలూరిపేట మండలం పోతవరం వద్ద జులై 25న పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో తెలంగాణ నుంచి మినీలారీలో తరలిస్తున్న రూ.2,45,355 విలువైన 1971 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా జిల్లా సరిహద్దులో ఉన్న దామరచర్లకు వెళ్లి అక్కడ దుకాణాల్లో మద్యం కొనుగోలు చేసి చిలకలూరిపేటకు తెచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు వెల్లడించారు.

మద్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తాం 
 మద్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తాం. ఇప్పటికే పెద్ద సంఖ్యలో కేసులు నమోదు చేశాం. జిల్లాలోని పలు ప్రాంతాల్లో నాటుసారా బట్టీలను ధ్వంసం చేశాం. వాటిని నియంత్రించేలా చర్యలు తీసుకుంటాం.
 -బిందుమాధవ్, జాయింట్‌ డైరెక్టర్, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో   


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని