ఇంటింటికీ టీకా
eenadu telugu news
Published : 19/10/2021 02:21 IST

ఇంటింటికీ టీకా

తీరప్రాంతంలో ఊపందుకున్న పంపిణీ
 లక్ష్యం చేరుకునేందుకు సిబ్బంది కృషి


యువకునికి టీకా వేస్తున్న ఆరోగ్య సిబ్బంది

రేపల్లె అర్బన్, న్యూస్‌టుడే  తీరప్రాంతంలో కరోనా టీకా పంపిణీ ఎట్టకేలకు ఊపందుకొంది. ఇటీవల జిల్లా వైద్యాధికారిణి యాస్మిన్‌ తీరప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేశారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమం మందకొడిగా సాగడంపై ఆరోగ్య సిబ్బంది, గ్రామ, వార్డు సచివాలయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులందరికీ తప్పనిసరిగా టీకా వేసి వివరాలు ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆదేశించారు. లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో సిబ్బంది ఇంటింటికీ వెళ్లి టీకా పంపిణీ చేస్తున్నారు.
కొవిడ్‌ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టినా.. ముప్పు ఇంకా అలాగే ఉంది. ఇప్పటికీ బాపట్ల, రేపల్లె నియోజకవర్గాల్లో అక్కడక్కడ పాజిటివ్‌ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. కరోనా మహమ్మారి నుంచి టీకా మాత్రమే రక్షణనిస్తుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రెండు డోసులు తీసుకున్న వారిలో కొందరు కొవిడ్‌ బారిన పడినా స్వల్ప చికిత్సతోనే కోలుకుంటున్నారని చెబుతున్నారు. వారిలో మరణాల సంఖ్య అతి తక్కువగా ఉంటుందని పేర్కొంటున్నారు. వైద్యశాలల్లో చేరి వెంటిలేటర్‌ చికిత్స పొందే పరిస్థితులు తలెత్తడంలేదంటున్నారు. ఈ ఏడాది జనవరిలో వైద్యారోగ్య, అంగన్‌వాడీ సిబ్బందికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చేపట్టారు. అనంతరం ఫిబ్రవరిలో ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్‌ శాఖల ఉద్యోగులకు టీకాలు అందజేశారు. మే నెల నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి, అనంతరం 18 నుంచి 44 వయసున్న వారందరికీ టీకా అందజేసే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 


పూర్తిస్థాయిలో దృష్టి..
అర్హులందరికీ టీకా అందజేసేలా ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ఇటీవల కొవిడ్‌ ఉద్ధృతి తగ్గడంతో వైద్య ఆరోగ్య సిబ్బంది టీకా పంపిణీలో కొంత అలసత్వం చూపారు. దీంతోపాటు వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న సమయంలో కొందరు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి టీకా తీసుకున్నారు. దీంతో ఎవరు టీకా వేయించుకున్నారో తెలియక ఆరోగ్య సిబ్బందిలో అయోమయంలో పడ్డారు. ఈ క్రమంలో పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఆశించిన మేరకు జరగలేదు. ఉన్నతాధికారులు మందలించడంతో పట్టణాల్లోని సచివాలయాల్లో, పల్లెల్లో ఆరోగ్య కార్యకర్తలు ప్రస్తుతం ఇంటింటికీ వెళ్లి అర్హులందరికీ టీకా అందజేస్తున్నారు. నాడు టీకా కోసం ప్రజలు కేంద్రాల వద్ద బారులు తీరి అవస్థలు ఎదుర్కొన్నారు. నేడు సిబ్బంది ప్రత్యేకంగా ప్రచారం చేస్తూ అడిగి మరీ టీకా అందజేస్తున్నారు.

90 శాతం పూర్తి
విశ్వేశ్వరం పీహెచ్‌సీ పరిధిలోని 12 గ్రామ సచివాలయాల్లో వ్యాక్సినేషన్‌ నిర్వహిస్తున్నాం. గర్భిణులు, ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు టీకా అందజేసేలా చర్యలు చేపట్టాం. 45 ఏళ్లు పైబడిన వారితోపాటు 18 నుంచి 44 ఏళ్ల వయసున్న వారికి తప్పనిసరిగా అందేలా దృష్టి సారించాం. శివారుల్లోని ఇళ్లకు వెళ్లి ఆరోగ్య కార్యకర్తలు టీకా వేస్తున్నారు. పనులకు వెళ్లే వారు సాయంత్రం వచ్చిన తరువాత అందజేసేలా చొరవ చూపుతున్నాం. ఇప్పటివరకు 90 శాతం మేరకు వ్యాక్సినేషన్‌ పూర్తయింది. మిగిలిన వారికీ అందజేసేందుకు కృషి చేస్తున్నాం. 
- వాసవి, వైద్యాధికారిణి, విశ్వేశ్వరం పీహెచ్‌సీ

సద్వినియోగం చేసుకోండి
కరోనా నివారణకు ప్రభుత్వం అందజేస్తున్న టీకాను అందరూ సద్వినియోగం చేసుకోవాలి. పట్టణంలోని 14 సచివాలయాలతో పాటు అర్బన్‌ ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వైరస్‌ ఉద్ధృతి తగ్గినా రానున్న రోజుల్లో కరోనా బారిన పడకుండా ఉండాలంటే బాధ్యతగా టీకా వేయించుకోవాలి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని తెలుసుకోవాలి. 
- కిరణ్‌కుమార్, రేపల్లె కొవిడ్‌ అధికారి 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని