వరద కట్టడి ఎలా ?
eenadu telugu news
Published : 20/10/2021 01:17 IST

వరద కట్టడి ఎలా ?

కృష్ణా కరకట్టకు కనీస మరమ్మతులు కరవు

బిక్కుబిక్కుమంటున్న నదీ తీర ప్రాంత వాసులు


కరకట్టను ఆనుకొని కొనసాగుతున్న ఆక్వా సాగు

రేపల్లె అర్బన్‌, న్యూస్‌టుడే : ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తుతున్నారంటే కృష్ణా నదీ తీర ప్రాంత వాసులు వణికిపోతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. పన్నేండేళ్ల క్రితం ఓలేరు వద్ద గండిన తాలుకూ అనుభవాలు నేటికీ వెంటాడుతున్నాయి. అప్పట్లోనే కరకట్ట ఆధునికీకరణ పేరుతో పనులు చేపట్టినా పూర్తిస్థాయిలో జరగలేదు. ఓవైపు పనులు జరగకపోగా, మరోవైపు అక్రమార్కుల మట్టి తవ్వకాలతో కరకట్ట బలహీనంగా మారింది. ముంపు ఎక్కడ ముంచుకొస్తుందోనని స్థానికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

కృష్ణానదికి 2009 అక్టోబరులో సంభవించిన వరదలతో జిల్లాలోని మాచర్ల, గురజాల, దాచేపల్లి, మాచవరం, బెల్లంకొండ, అచ్చంపేట, అమరావతి, తుళ్లూరు ప్రాంతాలతో పాటు నదికి దిగువన తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల, కొల్లిపర, కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె మండలాల్లోని 106 గ్రామాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. 20,360 గృహాలు నీటమునిగాయి. 53 వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. భట్టిప్రోలు మండలం ఓలేరు పల్లెపాలెం వద్ద కరకట్టకు గండిపడి రేపల్లె పట్టణంతోపాటు కారుమూరు, పేటేరు, మోర్లవారిపాలెం.. 18 గ్రామాలు మూడు రోజుల పాటు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వందలాది గృహాలు నేలమట్టమయ్యాయి. కరకట్ట బలహీన పడటంతో అప్పటి ప్రభుత్వం గుంటూరు జిల్లా వైపున్న కరకట్టకు రూ.119.5 కోట్లు నిధులు కేటాయించింది. ప్రకాశం బ్యారేజీ నుంచి పెనుమూడి వరకు 60 కిలోమీటర్ల మేరకు కరకట్ట ఆధునికీకరణ, రోడ్డు నిర్మాణం చేపట్టినా నేటి వరకు పెదపులివర్రు, కొల్లూరు, దోనేపూడి వద్ద పలు కారణాల వల్ల అభివృద్ధి పనులు పూర్తి కాలేదు. పెనుమూడి నుంచి లంకెవానిదిబ్బ వరకు కొంత మేరకు పటిష్టపర్చి మిగిలిన భాగాన్ని వదిలేశారు. 60 కిలోమీటర్లకు గాను దాదాపు సగం మేర మేర కట్టకు మరమ్మతులు చేపట్టాల్సి ఉంది.

స్వార్థంతో తూట్లు పొడుస్తున్నారిలా..

అక్రమంగా అమర్చిన పైపు

కరకట్టకు 500 మీటర్లలోపు ఎలాంటి తవ్వకాలు చేపట్టరాదన్న నిబంధనను ఉల్లంఘించి కొందరు అక్రమార్కులు కట్టకు తూట్లు పొడుస్తున్నారు. 50 అడుగుల లోతున గుంతలు తీసి మట్టి అమ్మేస్తున్నారు. కొన్నిచోట్ల కట్టను ఆనుకొని వందల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు. పదుల సంఖ్యలో కట్టను తవ్వేసి పైపులు అమర్చారు. వరద నీటి ఉద్ధృతి పెరిగితే త్వరగా గండి పడే అవకాశం ఉంది. పైపుల నిర్మాణంతో పెనుమూడి నుంచి పిరాట్లంక వరకు కరకట్ట బలహీనపడింది. గతేడాది ప్రకాశం బ్యారేజీ నుంచి 7.50 లక్షల వరద నీరు విడుదల చేయడంతో నదీ ప్రవాహానికి రాజుకాల్వ శివారు ఎత్తిపోతల పథకం వద్ద కరకట్టకు గండి పడింది. పిరాట్లంక సమీపంలో నది నుంచి నీటి ఊట బ్యాంకు కెనాల్‌కు రావడం చూసిన స్థానికులు జలవనరులశాఖ, కరకట్ట పర్యవేక్షణాధికారులకు సమాచారం అందించగా తూతూమంత్రంగా నివారణ చర్యలు చేపట్టారు. బొబ్బర్లంక సమీపంలో ఓ నేత కరకట్టకు ఏకంగా తూములు ఏర్పాటు చేయించడంతో అధికారులు పూడ్చివేయించారు. బ్యారేజీ నుంచి వరద నీరు 8 లక్షల క్యూసెక్కులు దాటితే ఎక్కడ గండి పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. వరద వచ్చిన ప్రతిసారి రెవెన్యూ, కరకట్ట పర్యవేక్షణాధికారులు కట్టపై హడావుడి చేస్తారు. ఆ తరువాత అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఇకనైనా ప్రజాప్రతినిధులు స్పందించి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయాలని కరకట్ట వాసులు కోరుతున్నారు.

ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం

భట్టిప్రోలు మండలం ఓలేరు పల్లెపాలెం నుంచి అడవిపాలెం వరకు కరకట్ట బలహీన పడింది. పెనుమూడి శివారు నుంచి లంకెవానిదిబ్బ వరకు కట్టలు మట్టితో పటిష్టం చేసేందుకు సర్వే చేస్తున్నాం. పెనుమూడి శివారు నుంచి అడవిపాలెం వరకు 6 నుంచి 8 మీటర్ల వెడల్పుతో తారురోడ్డు, అక్కడ నుంచి లంకెవానిదిబ్బ వరకు మెటల్‌ రోడ్డు వేసేలా సన్నాహాలు చేస్తున్నాం. ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపాలని ఇప్పటికే ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు ఆదేశించారు. కరకట్ట పటిష్టపర్చే సమయంలో అక్రమంగా వేసిన పైపులను పూర్తిగా తొలగిస్తాం. నిబంధనలకు విరుద్దంగా పైపులు ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. - నాగేశ్వరనాయక్‌, కృష్ణానది కరకట్ట పర్యవేక్షణ అధికారి

కృష్ణా కరకట్ట పొడవు 60 కి.మీ.(ప్రకాశం బ్యారేజీ నుంచి పెనుమూడి వరకు)

ఆధునికీకరణలోచేపట్టాల్సింది 55 కి.మీ

ప్రస్తుతం మరమ్మతులు చేపట్టాల్సిన ప్రాంతం 25 కి.మీ

వరద ముంపునకు గురైయ్యే గ్రామాలు 5


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని