బాధితులకు రక్షణ కల్పించాలని వినతి
eenadu telugu news
Published : 20/10/2021 01:17 IST

బాధితులకు రక్షణ కల్పించాలని వినతి

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై కొందరు దాడులు చేసి బెదిరింపులకు పాల్పడినా పోలీసులు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేయడం లేదని దళిత బహుజన పరివర్తన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె.శ్రీకాంత్‌, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఈమని చంద్రశేఖర్‌ అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి వచ్చిన రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ ఎం.విక్టర్‌ ప్రసాద్‌, కమిషన్‌ సభ్యులు బసవరావు, ఆనంద్‌ ప్రకాష్‌లను నాయకులు కలిసి మాట్లాడారు. బాధితులకు రక్షణ కల్పించేలా జిల్లా కలెక్టరు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద ఫిర్యాదు చేసిన కేసుల్లోనూ పోలీసులు స్టేషన్‌ బెయిళ్లు ఇస్తున్నారని ఫిర్యాదు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ పథకంలో రుణాలు మంజూరు చేసినా రాష్ట్రంలో అర్హులను ఎంపిక చేయకుండా అధికారులు తాత్సారం చేస్తున్నారన్నారు. ఎస్సీలకు 3 ఎకరాల చొప్పున భూములు కేటాయించాల్సిందిగా ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని వినతిపత్రం అందజేశారు.

అంతకుముందు ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ విక్టర్‌ ప్రసాద్‌ని జేసీ దినేష్‌కుమార్‌, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు మధుసూదనరావు, గుంటూరు ఆర్డీవో భాస్కరరెడ్డి, గుంటూరు తూర్పు మండల తహసీల్దార్‌ శ్రీకాంత్‌ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని