పోలింగ్‌ బూత్‌లపై అభ్యంతరాలుంటే తెలపండి
eenadu telugu news
Published : 20/10/2021 01:17 IST

పోలింగ్‌ బూత్‌లపై అభ్యంతరాలుంటే తెలపండి

న్యూస్‌టుడే, గురజాల : కొత్త నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పోలింగ్‌ బూత్‌లను ఎంపిక చేసి అభ్యంతరాలుంటే ఈనెల 23లోగా తెలపాలని ఆదేశాలు జారీ చేసింది. నగర పంచాయతీ కార్యాలయాల్లో వివరాలు అందరికీ కనిపించేలా ఏర్పాటు చేయాలని చెప్పింది. గురజాల, దాచేపల్లి నగర పంచాయతీ కమిషనర్లు పోలింగ్‌ బూత్‌ల ఎంపిక పనిలో నిమగ్నమయ్యారు. ఎన్నికలు నవంబరు రెండో వారంలో నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌ భావిస్తుండడంతో నూతన పురపాలికల్లో కదలిక వచ్చింది. పల్నాడు ప్రాంతంలోని గురజాల, దాచేపల్లి నూతన నగర పంచాయతీలుగా ఆవిర్భవించాయి. ఏడాది క్రితమే ప్రభుత్వం గురజాల, జంగమహేశ్వరపురాలను కలిపి గురజాల నగర పంచాయతీగా, దాచేపల్లి, నడికూడి జంట గ్రామాలను కలిపి దాచేపల్లి నగర పంచాయతీగా గుర్తించింది. అప్పట్లో జరగాల్సిన పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికలు ఇక్కడ జరగలేదు. అనంతరం పూర్తిస్థాయిలో నగర పంచాయతీలుగా గుర్తించి కమిషనర్లను నియమించింది. పంచాయతీ బోర్డులు కాస్త నగర పంచాయతీలుగా మారిపోయాయి. ప్రస్తుతం పాలకవర్గం లేకుండానే కమిషనర్‌ పర్యవేక్షణలో నగర పంచాయతీ కార్యకలాపాలు చేస్తోంది. ఇప్పటికే వార్డుల విభజన, రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఈ రెండు నగర పంచాయతీలకు ఛైర్మన్లుగా మహిళకు అవకాశం కల్పించారు.

తుది జాబితా సిద్ధం

ఎంపిక చేసిన పోలింగ్‌ బూత్‌ల వివరాలు బుధవారం ప్రకటిస్తాం. ఈనెల 23 వరకు అభ్యంతరాలు స్వీకరించి తుది జాబితా సిద్ధం చేస్తాం. ఎన్నికల కమిషన్‌ ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా అందుకు సిద్ధంగా ఉన్నాం. -వెంకటేశ్వర్లు, నగర పంచాయతీ కమిషనర్‌, గురజాల


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని