చివరికి నీరేదీ..!
eenadu telugu news
Published : 20/10/2021 01:17 IST

చివరికి నీరేదీ..!

 


సింగుపాలెంలో నీరులేక పగుళ్లిచ్చిన పొలం

రేపల్లె అర్బన్‌, న్యూస్‌టుడే : రేపల్లె నియోజకవర్గంలో 85 వేల ఎకరాల ఆయకట్టులో రైతులు వరి సాగు చేస్తున్నారు. రేపల్లె, వెల్లటూరు, పీవిపాలెం, నిజాంపట్నం ప్రధాన ఛానల్‌ ద్వారా సాగునీరు సరఫరా అవుతోంది. వాటికి అనుసంధానంగా ఉన్న పిల్ల కాలువల ద్వారా పొలాలకు నీరు చేరుతోంది. విస్తారంగా వర్షాలు, కాలువల నిండా నీరుంటేనే అన్ని పంట చేలకు అందుతుంది. ఎగువ ప్రాంతాల్లో నాట్లు పూర్తయితే తప్ప శివారు భూములకు నీరు రాదు. దీంతో ఏటా నిజాంపట్నం, నగరం మండలాల్లో వరి సాగులో జాప్యం జరుగుతోంది. ఈ ఏడాది ఆగస్టులో భారీ వర్షాలు కురవడం, కాలువల నిండా నీరు ఉండడంతో రేపల్లె, చెరుకుపల్లి, నగరం మండలాల్లో నాట్లు వేస్తే సెప్టెంబరు నాటికి నిజాంపట్నంలో నాట్లు పూర్తయ్యాయి.

వాడిపోతున్న పైరు..

నియోజకవర్గంలో సుమారు 18 వేల ఎకరాల్లో వరి పైరుకు నీరు సక్రమంగా అందడం లేదు. దీనికితోడు వరుణుడు ముఖం చాటేయడం, మండుతున్న ఎండలతో వాడుతున్న పొలాలను చూసిన రైతులు కలత చెందుతున్నారు. నిజాంపట్నం, కళ్లిఫలం, ప్రజ్ఞం, అడవులదీవి, కూచినపూడి, పూడివాడ, బొర్రావారిపాలెం, గరువుపాలెం, కాసానివారిపాలెం, పడమటపాలెం, తాడివాకవారిపాలెం, మట్లపూడి, సిరిపూడి, మీసాలవారిపాలెం, ఏలేటిపాలెం, ఈదుపల్లి, చిలకావారిపాలెం, నల్లూరుపాలెం, తుమ్మల, పోటుమెరక, సింగుపాలెం, మోళ్లగుంట, ఆరేపల్లి, బలుసులపాలెం శివారు పంట పొలాలకు సాగునీరు రావడం లేదు. కాలువ శివారు భూములకు సజావుగా నీరు చేరాలంటే వంతుల వారీగా ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. కాలువల్లో ప్రవాహం తగ్గడం సాగు నీరు అందకపోవడానికి మరో కారణం.

అసలే కాలువ చివరి భూములు. ఆపై సాగు జాగైంది. రైతులు తమ సాగు భూములకు పెట్టాల్సిన అన్ని పెట్టుబడులు పెట్టారు. ఇక తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని భావించారు. కానీ.. కొన్ని రోజుల నుంచి కాలువ శివారు పంట పొలాలకు చుక్కనీరు రావడంలేదు. అధికారులకు విన్నవించినా ప్రయోజనం లేకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. సమస్య ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటా తమకు తిప్పలు తప్పడంలేదంటున్నారు.

పంట దిగుబడులపై ప్రభావం

రేపల్లె, చెరుకుపల్లి, నగరం, నిజాంపట్నం మండలాల్లో వరి పైరు ముదురు, పిలక, చిరుపొట్ట దశలో ఉన్నాయి. ఈ తరుణంలో వరి పైరుకు నీరు ఎంతో అవసరం. మండే ఎండలకు చేలల్లో ఉన్న కొద్దిపాటి నీటి చెమ్మ ఆవిరై పైరు వాడిపోతోంది. ఈ సమయంలో సాగునీరు అందకుంటే ఆ ప్రభావం పంట దిగుబడులపై గణనీయంగా పడుతోంది. పైరుకు సరిపడినంత నీరందక రావాల్సిన విధంగా పిలకలు రావు. ముదురు, చిరుపొట్టదశలో పాలు పోసుకునే సామర్థ్యం తగ్గి తాలుగింజలు వస్తాయి. దీంతో ఎకరాకు ఐదు బస్తాలకు పైగా దిగుబడి తగ్గే అవకాశం ఉంది. రైతులు పెట్టిన పెట్టుబడి సైతం రాకుండా పోతుంది. శివారు భూములకు సాగునీరు అందడంలేదని రేపల్లె మండలం నల్లూరుపాలెం, సింగుపాలెం రైతులు జలవనరుల శాఖ కార్యాలయం ఎదుట గతనెలలో ఆందోళన చేశారు. అయినా సమస్య అలాగే ఉంది.

సరఫరాలో ఇబ్బంది లేకుండా చర్యలు

శివారు భూములకు సాగునీరు అందేలా దృష్టి సారించాం. ప్రధాన పంట కాలువల్లో నీరు సమృద్ధిగా ప్రవహిస్తోంది. పిల్ల కాలువలకు అడ్డువేయడం, మరికొందరు రైతులు మోటార్లు ఏర్పాటు చేయడంతో సమస్య ఉత్పన్నమవుతోంది. ఎప్పటికప్పుడు అన్ని మండలాల్లోనూ సిబ్బంది పర్యటించి నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారు. - మహబూబ్‌ బాషా, జలవనరుల శాఖ డీఈ, రేపల్లె


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని