ప్రాణాలు పోతున్నాయ్‌!
eenadu telugu news
Published : 20/10/2021 01:17 IST

ప్రాణాలు పోతున్నాయ్‌!

విస్తరణకు నోచుకోని జీబీసీ రహదారి

వరుస ప్రమాదాలతో చోదకుల ఆందోళన


రోడ్డుపై ఏర్పడిన భారీ గోతులు

బాపట్ల, న్యూస్‌టుడే : గుంటూరు- బాపట్ల ఆర్‌అండ్‌బీ రహదారి జిల్లాలో అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో ఒకటి. రహదారి విస్తరణ పనులకు దశాబ్దంగా మోక్షం లభించటం లేదు. ప్రైవేటు భాగస్వామ్యంతో బీవోటీ పద్ధతిలో రోడ్డు అభివృద్ధికి పలుమార్లు టెండర్లు పిలిచినా గుత్తేదారుల నుంచి స్పందన లేదు. నాలుగేళ్ల వ్యవధిలో ఈ మార్గంలో ట్రాఫిక్‌ రద్దీ రెట్టింపు పెరిగింది. విస్తరణ పనులు జరగక.. మరమ్మతులకూ నిధులు లేక రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి.

● జిల్లా కేంద్రం గుంటూరుతో బాపట్లను కలిపే అతి ప్రధాన మార్గం జీబీసీ రోడ్ఢు గుంటూరు నుంచి తెనాలి, పొన్నూరు, రేపల్లె, బాపట్ల, చీరాల పట్టణానికి ఈ మార్గం నుంచి రోజూ పెద్ద సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. రెండేళ్ల నుంచి రహదారి నిర్వహణ విషయంలో నిధుల కొరతతో ఆర్‌అండ్‌బీ శాఖ చేతులెత్తేసింది. రోడ్డు గోతులమయంగా మారి వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రమాదాల సంఖ్య బాగా పెరిగింది. జీబీసీ రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరించాలని రూ.672 కోట్ల వ్యయంతో అధికారులు ప్రతిపాదనలు రూపొందించి ఐదేళ్ల కిత్రమే టెండర్లు పిలిచారు. రహదారి నిర్మాణం పూర్తిచేసిన సంస్థకు టోల్‌ వసూలు చేసుకునే హక్కు కల్పించాలని నిర్ణయించారు. అయితే, ఈ మార్గంలో వాణిజ్య వాహనాల రాకపోకలు తక్కువని రూ.వందల కోట్లు ఖర్చు చేసి నిర్మించినా తగినంత ఆదాయం రాదన్న అనుమానంతో గుత్తేదారులు వెనకడుగు వేశారు.

ఫలించని ప్రతిపాదనలు

గుంటూరు నుంచి నారాకోడూరు- చేబ్రోలు- మునిపల్లె- పొన్నూరు- ములుకుదురు వరకు రూ.60 కోట్ల వ్యయంతో ఏడు మీటర్లు ఉన్న రహదారిని పది మీటర్లకు గత ప్రభుత్వ హయాంలో 34 కి.మీ. పొడవున విస్తరించి అభివృద్ధి చేశారు. బాపట్ల మండలం చుండూరుపల్లి నుంచి పట్టణ శివారు వరకు 16 కి.మీ. పొడవున రోడ్డు విస్తరించాల్సి ఉంది. దీనికోసం రూ.20 కోట్ల నిధులు కావాలని రెండేళ్లుగా ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రతిపాదనలు పంపిస్తున్నా నిధుల కొరతతో ప్రభుత్వం మంజూరు చేయలేదు. వాహనాల రద్దీ విపరీతంగా పెరగటంతో రోడ్డు ప్రమాదాలు బాగా పెరిగాయి. నిత్యం ఏదో ఒక చోట ప్రమాదం సంభవిస్తోంది. వాహనాలు దెబ్బతిని వాహనదారులు మరమ్మతుల కోసం రూ.వేలు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ప్రస్తుతం రహదారిలో రాకపోకలు సాగించేందుకు భయపడుతున్నారు. రాత్రులు, తెల్లవారుజామున రోడ్డుపై గోతులు కనిపించక ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు మరింత దెబ్బతింది. పెద్ద గోతులు ఏర్పడ్డాయి. ఈ మార్గంలో రాకపోకలు సాగించేవారి ఒళ్లు గుల్లవుతోంది.

అనుమతి రాగానే పనులు చేపడతాం బాపట్ల- గుంటూరు రహదారి విస్తరణ కోసం రూ.20 కోట్ల వ్యయంతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరు చేసి అనుమతులు రాగానే విస్తరణ పనులు ప్రారంభిస్తాం. రహదారిపై గోతులు పూడ్చేందుకు చర్యలు చేపట్టాం. -శ్రీనివాసరావు, ఆర్‌అండ్‌బీ ఏఈ

ప్రమాదంలో మృతిచెందిన యువతి (పాతచిత్రం)

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని