ఆందోళనలు..అరెస్టులు 
eenadu telugu news
Updated : 21/10/2021 05:30 IST

ఆందోళనలు..అరెస్టులు 

 ఎక్కడికక్కడే తెదేపా నేతల గృహనిర్బంధాలు

  కార్యకర్తలను అడుగడుగునా అడ్డుకున్న పోలీసులు 

 తెదేపా బంద్‌లో పలుచోట్ల ఉద్రిక్తత

నరసరావుపేట-చిలకలూరిపేట రహదారిపై కార్యకర్తల నిరసన


బాపట్లలో తెదేపా నేతలు నరేంద్రవర్మ, విజేత, జేపీ గౌడ్‌ను లాక్కెళ్తున్న పోలీసులు

ఈనాడు, గుంటూరు తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడికి నిరసనగా ఆ పార్టీ బుధవారం రాష్ట్రబంద్‌కు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా తెదేపా కార్యాలయంపై దాడికి పాల్పడిన దుండగులను ఆరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెదేపా నేతలు, శ్రేణులు బంద్‌ చేయడానికి సిద్ధమవుతున్న క్రమంలో ముఖ్యనేతలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు, మండల అధ్యక్షులను ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేశారు. కార్యకర్తలు రహదారులపైకి వచ్చి ఆందోళనలు, రాస్తారోకోలు చేసి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ఆయా పట్టణాల్లో ఆర్టీసీ బస్టాండ్ల ముందు నిరసన ప్రదర్శన చేసి ఆర్టీసీ బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. గుంటూరు నగరంలో ద్విచక్ర వాహనాలతో కార్యకర్తలు తిరుగుతూ వ్యాపార సముదాయాలు, ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. జిల్లాలోని పలు పట్టణాలు, మండల కేంద్రాల్లో ధర్నాలు, ర్యాలీలు చేశారు. పోలీసులు ఉదయం నుంచి ఎక్కడికక్కడ ఆందోళన చేస్తున్న శ్రేణులను అడ్డుకుని పోలీసుస్టేషన్లకు తరలించారు. కొన్నిచోట్ల శాంతియుతంగా నిరసన చేస్తున్న నేతలను అరెస్టు చేయడంతో నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.


చిలకలూరిపేటలో ఆందోళనకారులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

ర్యాలీలను అడ్డుకున్న పోలీసులు: నరసరావుపేటలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి చదలవాడ ఆరవిందబాబు ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఇందుకు నిరసనగా గుంటూరు-కర్నూలు రహదారిపై కాకాని వద్ద, నరసరావుపేట-హైదరాబాద్‌ రహదారిపై రావిపాడు వద్ద తెదేపా వారు ధర్నా చేశారు. బాపట్లలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి వేగేశన నరేంద్రవర్మ ఆధ్వర్యంలో నిరసన తెలపడంతో స్టేషన్‌కు తరలించారు. పొన్నూరు సెంటర్‌లో మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ను అరెస్టు చేయడంతో పోలీసులతో వాగ్వాదం జరిగింది. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహన కృష్ణ, మాచర్లలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి చలమారెడ్డి తదితరులను గృహనిర్బంధం చేశారు. దాచేపల్లిలో తెదేపా నేత గుంటుపల్లి నాగేశ్వరరావును గృహ నిర్బంధం చేశారు.

పోలీసుల ద్వంద్వ వైఖరి

రహదారులపైకి వచ్చి ఆందోళన చేస్తున్న తెదేపా నేతలను పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు. శాంతియుతంగా నిరసన తెలపడానికి కూడా అనుమతించకుండా అడ్డుకున్నారు. అయితే వైకాపా నిరసనలకు అడ్డుచెప్పని పోలీసులు, తెదేపా నేతల్ని మాత్రం ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు. బయటకొస్తే అరెస్టులు చేసి స్టేషన్లకు తరలించారు. ఈవిషయంలో పోలీసులు ద్వంద్వ వైఖరి కనిపించింది. వైకాపా నేతల ఆందోళనలకు పోలీసులు సహకరించడంపై తెదేపా నేతలు భగ్గుమన్నారు. పోలీసుల సమక్షంలోనే వైకాపా నేతలు తెదేపా జెండాలు తగలబెట్టడం, చంద్రబాబు, పట్టాభి దిష్టిబొమ్మలను దహనం చేయడంపై పార్టీ నేతలు మండిపడ్డారు. వైకాపాకు ఒక చట్టం.. మాకో చట్టమా? అంటూ పోలీసులను నిలదీశారు.

 

వినుకొండ ఆర్టీసీ బస్టాండ్‌ ఎదుట తెదేపా నాయకుల ధర్నా

రహదారులపై రాస్తారోకోలు..

సత్తెనపల్లి, రేపల్లె, వినుకొండలో ఆర్టీసీ బస్టాండ్ల వద్ద ఆందోళన చేసి కొంతసేపు బస్సులను అడ్డుకున్నారు. గుంటూరులో జిల్లా పార్టీ కార్యాలయానికి ఉదయాన్నే వచ్చిన పోలీసులు తాళం వేయించడంతో అక్కడికి చేరుకున్న నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పార్టీ కార్యాలయం నుంచి బంద్‌కు బయలుదేరిన నేతలను అరెస్టు చేశారు. చిలకలూరిపేటలో తెదేపా కార్యకర్తలు రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. నాదెండ్ల మండలం కనపర్రు వద్ద చిలకలూరిపేట-నరసరావుపేట రహదారిపై టైర్లు కాల్చి నిరసన వ్యక్తం చేశారు. మేడికొండూరు మండలం పేరేచర్లలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తెదేపా శ్రేణులపైకి పోలీసు రక్షక్‌ వాహనం దూసుకురావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పిడుగురాళ్లలో శాంతియుతంగా ధర్నాకు అనుమతి ఇవ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. రేపల్లెలో తెదేపా శ్రేణులు ఆందోళన చేశాయి. బంద్‌ చేస్తున్న నేతలను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. వినుకొండ ఆర్టీసీ డిపో వద్ద తెదేపా నేతలు అందోళన చేసి ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. నేతలు, కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గురజాలలో తెదేపా నేతలు పట్టణంలో తిరిగి బంద్‌ చేయించారు. బాపట్ల మండలం అప్పికట్లలో గుంటూరు-బాపట్ల, చీరాల రోడ్డుపై ధర్నా చేశారు. తాడేపల్లిలో తెదేపా కార్యకర్తలు, నాయకులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించడంతో సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వినుకొండ పట్టణంలో బంద్‌లో పాల్గొన్న తెదేపా నేతలను అరెస్టు చేసి ఈపూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో స్టేషన్‌లోనే నిరసన తెలియజేశారు. యడ్లపాడులో ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలు మూసివేయించి గ్రామంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. రొంపిచర్ల మండలం సుబ్బయ్యపాలెం వద్ద రాష్ట్ర రహదారిపై తెదేపా నాయకులు ధర్నా చేశారు.

రేపల్లెలో తెదేపా నేతలను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని