అధికారి అక్రమార్జన బాట
eenadu telugu news
Published : 21/10/2021 03:32 IST

అధికారి అక్రమార్జన బాట

పౌరసరఫరాలశాఖలో ఆయనంటే హడలే..

ఈనాడు, గుంటూరు పౌరసరఫరాలశాఖలో అధికారి ఒకరు ఓ ఉన్నతాధికారి అండదండలు.. ప్రజాప్రతినిధి సహకారంతో అక్రమార్జనకు తెరలేపారు. ఏళ్లుగా వివిధ హోదాల్లో ఒకేచోట పనిచేస్తూ అన్ని పనులు చక్కబెట్టుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో నెలకు రెండుసార్లు బియ్యం పంపిణీ ఆ అధికారికి కాసుల వర్షం కురిపిస్తోంది. ఎండీయూ ఆపరేటర్లుగా తనకు అనుకూలమైన వ్యక్తులను పెట్టుకుని రేషన్‌ బియ్యం దారి మళ్లించి సొమ్ము చేసుకుంటున్నారు. తన వాహనంలోనే ఉన్నతాధికారిని తనిఖీలకు తీసుకెళుతూ తాను చెప్పిందే శాఖలో జరుగుతుందని చెబుతూ అందరినీ బెదిరిస్తున్నాడు. డీలర్లు ఎవరైనా అధికారి మాట వినకపోతే 6ఏ కేసు నమోదు చేసి డీలర్‌షిప్‌ రద్దు చేయిస్తానని హెచ్చరికలు పంపుతున్నారు. వాట్సాప్‌ వాయిస్‌ కాల్‌ మాత్రమే మాట్లాడుతూ తనదైన శైలిలో వ్యవహారాలు చక్కబెడుతున్నారు. నగరంలో ఇద్దరు బినామీలను పెట్టుకుని బియ్యం అక్రమ రవాణా వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. ఆరుగురు డీలర్ల దుకాణాలనే డంపింగ్‌ కేంద్రాలుగా చేసుకుని అక్కడి నుంచి వ్యాపారులకు నేరుగా సరఫరా చేస్తున్నారు. కార్డుదారుల నుంచి కిలో రూ.10లకు డీలర్లు, ఎండీయూ వాహనాల వద్దే సేకరించి నగరంలోని ఆరు డంపింగ్‌ కేంద్రాలకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి రేషన్‌ మాఫియాకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు ఒక ప్రజాప్రతినిధి బంధువు ఒకరిని భాగస్వామిగా చేసుకున్నారు. దీనికితోడు ఏళ్లుగా ఒకేచోట పని చేయడంతో సదరు అధికారి అక్రమాలకు అడ్డంకి లేకుండా పోయింది. నగరంలో రేషన్‌బియ్యం అక్రమంగా ఎక్కడికి తరలించాలన్నా అధికారి కీలకపాత్ర పోషిస్తున్నారు.

చెప్పింది చేయాల్సిందే..

పౌరసరఫరాలశాఖలో ఆ అధికారి చెప్పినట్లు ప్రతి డీలరు వినాల్సిందే. అధికారులు తనిఖీలు చేసి 6ఏ కేసులు నమోదు చేస్తే వాటి నుంచి తప్పించేందుకు అడిగినంత ముట్టజెప్పితే వ్యవహారం సెటిల్‌ చేస్తారు. గుంటూరు నగరంలో డ్వాక్రాసంఘాల ఆధ్వర్యంలో ఒక డీలరుషిప్‌ ఉంది. ఏడాది కిందట నిల్వల్లో తేడాలు ఉన్నాయని 6ఏ కేసు నమోదుచేస్తానని బెదిరించి అప్పటికప్పుడు రూ.25వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. నాలుగు నెలల కిందట నగరంపాలెంలోని ఓ చౌకధరల దుకాణంలో రేషన్‌ బియ్యం నిల్వలు అధికంగా ఉన్నాయని జిల్లా అధికారులకు సమాచారం వస్తే తనిఖీ చేయాలని సదరు అధికారిని పంపారు. అయితే అది సదరు అధికారి బినామీ వ్యక్తిది కావడంతో ఉన్నతాధికారి చెప్పిన దుకాణం కాకుండా సమీపంలో ఉన్న మరో దుకాణంలో తనిఖీలు చేసి అధిక నిల్వలు ఉన్నాయని ఉన్నతాధికారికి తెలియజేశారు. అక్రమాలకు పాల్పడుతున్న డీలరును కేసు నుంచి తప్పించారు. నగరంంలో ఓ డీలరు నెలవారీగా అందరి డీలర్ల నుంచి మామూళ్లు వసూలు చేసి సదరు అధికారికి ముట్టజెప్పుతున్నారు. సస్పెండ్‌ అయిన దుకాణాలు, డీలరు చనిపోయిన దుకాణాలకు ముడుపులు చెల్లించే వారికి సంబంధిత షాపులు కేటాయించడంలో సదరు అధికారి కీలకపాత్ర పోషించారు. ఒక ప్రజాప్రతినిధి పేరు చెప్పి దుకాణాల కేటాయింపులో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. సదరు అధికారి పొరుగునే పని చేస్తున్న అధికారి పదోన్నతిపై వెళ్లడంతో అక్కడ కూడా ఇన్‌ఛార్జిగా పనిచేయడాన్ని వరంగా మార్చుకున్నారు. కరోనాతో పేదలు ఇబ్బంది పడకూడదన్న లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెలలో రెండుసార్లు బియ్యం సరఫరా చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యం ఎండీయూ వాహనాల ద్వారా ఇంటింటికి సరఫరా చేయగా కేంద్రం ఇచ్చే బియ్యం డీలరు వద్దే కార్డుదారులు తీసుకోవాలి. ఇది సదరు అధికారి వరంగా మారింది. కరోనా సైతం సదరు అధికారికి కలిసొచ్చిందన్న చర్చ ఆశాఖ ఉద్యోగుల్లో జోరుగా సాగుతోంది. డీలర్లను వాట్సాప్‌ వాయిస్‌ కాల్‌లో బెదిరింపులకు గురిచేస్తున్నారు. ఒక మహిళా డీలరుపై ఏడాది కిందట తూకాల్లో తేడాలు ఉన్నాయని ఇబ్బంది పెడితే అప్పట్లో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సదరు అధికారి ఉన్నతాధికారులకు దగ్గరగా ఉండటంతో ఫిర్యాదు చేసినా ఉపయోగం ఉండకపోగా తర్వాత కక్ష సాధింపు చర్యలు ఉంటాయన్న భయంతో ఎవరికీ చెప్పుకోలేక పోతున్నామని డీలరు ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని