పల్నాడు రైలు కిటకిట..!
eenadu telugu news
Published : 21/10/2021 03:32 IST

పల్నాడు రైలు కిటకిట..!


మాచర్ల రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులు

మాచర్ల, దాచేపల్లి, న్యూస్‌టుడే కరోనా నేపథ్యంలో పలు కుటుంబాల్లో ఆర్థికంగా పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రతి రూపాయి పొదుపుగా వెచ్చించే పరిస్థితి ఏర్పడింది. ప్రయాణాల విషయంలో ఆచుతూచి అడుగులు వేస్తున్నారు. అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకెళ్లేందుకు ఆలోచిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలు అధికంగా ఉండటంతో కుటుంబ సమేతంగా ఎక్కువ మంది రైలు ప్రయాణాలకు ఆసక్తి చూపుతున్నారు. మాచర్ల నుంచి జిల్లా కేంద్రం గుంటూరుకు 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. మాచర్ల నుంచే ప్రారంభమయ్యే రైలుకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంది. ప్రస్తుతం 12 బోగీల ద్వారా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఒక్కో బోగీలో సీటింగ్‌ ప్రకారం 96 మంది ప్రయాణించవచ్ఛు 12 బోగీల్లో 1152 మంది ప్రయాణానికి అవకాశముంది. ప్రస్తుతం మాచర్లలో రైలు ప్రారంభమై 700 నుంచి 800 మంది దాకా ఎక్కుతున్నారు. సెలవు రోజుల్లో మాచర్లలోనే 12 బోగీలు నిండిపోతున్నాయి. రెంటచింతల, గురజాల స్టేషన్లు ప్రయాణికులు ఎక్కితే కిటకిటలాడుతోంది. ప్రతి రోజూ మాచర్ల నుంచి గుంటూరు దాకా విద్యార్థులు, ఉద్యోగులు, ఆసుపత్రులకు వెళ్లేవారు రాకపోకలు సాగిస్తున్నారు. సీట్లు ఖాళీ లేక చిన్నారులు, వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారు.

రహదారులు అధ్వానంగా ఉండటంతో..

మాచర్ల-గుంటూరు మధ్య ప్రతిరోజూ ఉదయం 5:30కు, సాయంత్రం 4:30 గంటలకు ఎక్సెప్రెస్‌ రైలు గుంటూరుకు బయల్దేరుతుంది. బస్సులో ప్రయాణం చేయాలంటే ఎక్సెప్రెస్‌, లగ్జరీ, సూపర్‌లగ్జరీ పేరుతో రూ.125 నుంచి రూ.150 దాకా వెచ్చించాలి. సీట్లు ఖాళీ లేకుంటే నిల్చొనే ప్రయాణం చేయాల్సి వస్తోంది. రహదారులు అధ్వానంగా ఉన్న నేపథ్యంలో రైలు ప్రయాణానికే ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. రైలు ప్రయాణమైతే రాకపోకలకు రూ.130 సరిపోతుంది. ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రైలుబోగీలు నిండుతున్నాయి. ప్రయాణికుల తాకిడి విపరీతంగా పెరగడంతో అదనంగా అధికారులు నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన రైల్వే ఉన్నతాధికారులకు సమస్య వివరించడంతో రెండు నుంచి మూడు బోగీలు అదనంగా సమకూరుస్తామని హామీ ఇచ్చారు. ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే అదనంగా 300 మంది ప్రయాణించేందుకు అవకాశం ఏర్పడుతుంది. రైల్వేశాఖ పల్నాడు ప్రాంతానికి ప్రాధాన్యమివ్వాలని ప్రయాణికులు కోరుతున్నారు.

మాచర్ల రైల్వేస్టేషన్‌ ప్లాట్‌ఫాం పొడవు 132 మీటర్లు

ప్రస్తుతం అందుబాటులో ఉన్న బోగీలు 12

మాచర్ల స్టేషన్‌ నుంచి బయలుదేరే రైళ్లు 2

(ఉదయం 5.30, సాయంత్రం 4.30)

స్టేషన్‌లో రైలెక్కె ప్రయాణికులు 800

రోజువారీ ఆదాయం రూ.50 వేలు

నడికూడి వెళ్లేలోగా రైలెక్కె ప్రయాణికులు 1300


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని