పర్యటకం.. పరుగులు
eenadu telugu news
Published : 21/10/2021 03:46 IST

పర్యటకం.. పరుగులు

 ప్రైవేటు పెట్టుబడులతో రిసార్టుల నిర్మాణం

 శరవేగంగా మౌలిక వసతుల అభివృద్ధి

 


ముత్తాయపాలెంలో నిర్మించిన రిసార్ట్స్‌

బాపట్ల, న్యూస్‌టుడే సూర్యలంక బీచ్‌కు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు ఉంది. సెలవులు, వారాంతంలో కుటుంబసభ్యులు, స్నేహితులతో సంతోషంగా గడపటానికి వేలసంఖ్య పర్యటకులు తరలిస్తున్నారు. సూర్యలంకలో ప్రభుత్వ, ప్రైవేటు భూములు తక్కువగా ఉన్నాయి. 95 శాతం అటవీ భూములు కావటంతో ప్రైవేటు రంగానికి కేటాయించే అవకాశం లేదు. బీచ్‌లో పర్యటక శాఖ రిసార్ట్స్‌, ఆదర్శనగర్‌ సమీపంలో అటవీ అభివృద్ధి సంస్థ ఎకో టూరిజం ప్రాజెక్టు మాత్రమే ఉన్నాయి. వేలసంఖ్యలో వచ్చే సందర్శకులకు ఇవి ఏ మాత్రం సరిపోవటం లేదు. పర్యటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పట్టా భూములు ఉన్న ముత్తాయపాలెం, రామ్‌నగర్‌లో వ్యాపారవేత్తలు కొని రిసార్ట్స్‌ నిర్మిస్తున్నారు. ఈత కొలనులు, ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేసి సందర్శకులను ఆకర్షిస్తున్నారు.

బాపట్ల మండలంలో అడవి పంచాయతీ పారడురంగాపురం, రామచంద్రాపురం తీరాల్లో పర్యటక రంగం విస్తరిస్తోంది. ఓ ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటికే వంద ఎకరాల్లో రిసార్ట్స్‌ నిర్మించారు. హైదరాబాద్‌, ఉత్తరాది రాష్ట్రాల పర్యటకులు ఏకాంతంగా కుటుంబసభ్యులతో సంతోషంగా గడపటానికి ఈ ప్రాంతానికి వస్తున్నారు. సముద్రపు ఒడ్డునే ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త 250 ఎకరాలు కొన్నారు. ఈ భూముల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఏసీ రిసార్ట్స్‌, కాటేజీలు, విల్లాలు, ఇతర నిర్మాణాలు చేపట్టడానికి ప్రణాళికలు రూపొందించారు. అయితే చిన్నదిగా ఉన్న బాపట్ల- పాండురంగాపురం- కొత్త ఓడరేవు ఆర్‌అండ్‌బీ రహదారిని 60 అడుగుల రోడ్డుగా విస్తరిస్తేనే పర్యటక రంగం వేగంగా అభివృద్ధి చెందుతుంది. పర్యటక శాఖ ఆధ్వర్యంలో ప్రముఖ ప్రైవేటు హోటల్స్‌ గ్రూపు ఆధ్వర్యంలో ఐదు, మూడు నక్షతాల హోటళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.

పర్యటక రంగం అభివృద్ధి చెందటం వల్ల యువతకు ఎక్కువగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. పెద్దగా పరిశ్రమలు లేని బాపట్లలో అతిథ్య రంగం ద్వారా వ్యాపార అవకాశాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం నుంచి పర్యటక రంగానికి పెద్దఎత్తున ప్రోత్సాహం అవసరం. సూర్యలంకలో సముద్రం ఒడ్డునే ఎనిమిదిన్నర ఎకరాల భూమి వృథాగా ఉంది. ఈ భూముల్లో పీపీఈ పద్ధతిలో రిసార్ట్స్‌, హోటళ్ల నిర్మాణం చేపడితే పర్యటకుల సంఖ్య బాగా వృద్ధి చెందుతుంది. ప్రస్తుతం నెలకు రూ.రెండు కోట్ల వరకు జరుగుతున్న వ్యాపారం మూడు రెట్లు పెరిగే అవకాశం ఉంది. తద్వారా ఈ ప్రాంతం ప్రగతిపథంలో పయనిస్తుంది. వ్యాపార అవకాశాలు విస్తృతంగా లభిస్తాయి.

కొవిడ్‌ మహమ్మారి అనంతరం పర్యటక రంగం పుంజుకుంటోంది. తీర ప్రాంతానికి పర్యటకుల రాక గణనీయంగా పెరిగింది. ఇన్నాళ్లూ సూర్యలంక బీచ్‌ వరకే పరిమితమైన పర్యటక రంగాభివృద్ధి పాండురంగాపురం, రామచంద్రాపురం తీరానికి విస్తరిస్తోంది. పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు రూ.కోట్ల పెట్టుబడులు పెట్టి రిసార్ట్స్‌, మౌలిక వసతుల నిర్మాణ పనులు చేపడతున్నారు. బాపట్ల ప్రాంతం ఆతిథ్య, పర్యటక కేంద్రంగా ఎదిగే దిశగా పరుగులు తీస్తోంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని