ఆసుపత్రి ఉన్నా..
eenadu telugu news
Published : 21/10/2021 03:46 IST

ఆసుపత్రి ఉన్నా..


నిజాంపట్నం సామాజిక ఆరోగ్య కేంద్రం

నిజాంపట్నం, న్యూస్‌టుడే తీరప్రాంత రోగులకు ప్రభుత్వ వైద్యం అందని ద్రాక్షగా మారింది. వైద్యం కోసం ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా రోగుల దరి చేరడం లేదు. తీరంలో వైద్యులు లేని వైద్యశాలలు ఉన్నాయి. దీతో రోగులు చేసేది లేక పట్టణ బాట పట్టి ప్రైవేటు వైద్యశాలలను ఆశ్రయిస్తున్నారు. తద్వారా అధిక వ్యయ, ప్రయాసలు భరిస్తున్నారు.

 తీరంలో రేపల్లె, నిజాంపట్నం, నగరం ప్రాంతాల్లో సామాజిక వైద్యశాలలున్నాయి. కానీ వాటిలో తగినంతమంది వైద్యులు లేరు. గతంలో రేపల్లెలో 400 ఉన్న ఓపీ ప్రస్తుతం 200 లోపు పడిపోయింది. నియోజకవర్గానికి పెద్దాసుపత్రిగా చెప్పుకోవడం తప్ప పేదలు ఆశించిన స్థాయిలో సేవలు అందడం లేదు. కారణం.. ఇక్కడ కొందరికి ప్రైవేటు ప్రాక్టీసులు ఉండటం లేక వారు ప్రైవేటు వైద్యశాలల్లో పని చేయడమే. ఈ కారణంగా వైద్యశాలకు వచ్చే వారికి మెరుగైన సేవలు అందడం లేదు.

వంతుల వారీగా విధులు

తీరప్రాంతంలో ఉన్న మరొక సామాజిక ఆరోగ్య కేంద్రం నిజాంపట్నంలో ఉంది. ఇక్కడ వైద్యశాలకు రూ.కోట్లు వెచ్చించి పక్కా భవనాలు నిర్మించారు కానీ వైద్యులను కేటాయించలేదు. ఇక్కడ ప్రసూతి వైద్యురాలు లేకపోవడం గర్భిణులకు శాపంగా మారింది. ఇటీవల ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నరనే ఆరోపణలు రావడంతో ముగ్గురు స్టాఫు నర్సులను బదిలీ చేయించారు. తన స్వగ్రామంలో ఉన్న వైద్య శాలకు ఉన్న వైద్యులు మంచి సేవలు అందించాలని, కాన్పులు, కు.ని. శస్త్ర చికిత్సల్లో జిల్లాలో వెనుకంజలో ఉందని మొదటి స్థానంలోకి తీసుకు రావాలని చెప్పారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించబోనని స్పష్టం చేశారు. ఏరోజుకారోజు ప్రగతి నివేదికలు తన చరవాణికి పంపాలని ఆదేశించారు. నెల పాటు మమ అనిపించిన వైద్యులు తర్వాత వంతుల వారీగా విధులకు హాజరవుతున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం జనరల్‌, మత్తు, చిన్నపిల్లల, దంత వైద్యులున్నారు. వారు నిత్యం రావాల్సి ఉన్నా వంతుల వారీగా వస్తున్నారని ఆరోపణలున్నాయి. గురు, శుక్రవారాల్లో గర్భిణులకు పరీక్షించేందుకు వైద్యులు నగరం, పిట్టలవానిపాలెం ప్రాంతాల నుంచి వచ్చి వెళుతున్నారు. వారంలో రెండు రోజులు మాత్రమే సేవలు. మిగిలిన రోజుల్లో లేవు. శస్త్రచికిత్సలు, ప్రసవాల్లో ఆశించిన పురోగతి లేదు. ఈనెల 15 వరకు కొవిడ్‌ విధులకు వచ్చిన స్టాఫు నర్సులతో పని చేయించారు. సామాజిక వైద్యశాలకు అవసరం అయిన సిబ్బంది లేరు. ఓపీ గతం కంటే తగ్గింది. ఉన్నతాధికారుల మెప్పు కోసం ఓపీ రోగులను ఇన్‌ పేషంట్సుగా చూపుతున్నారనే విమర్శలున్నాయి. రెగ్యులర్‌ గైనకాలజిస్టుని నియమించాలని గర్భిణులు కోరుతున్నారు. తీరంలో ఉన్న మరొక సామాజిక ఆరోగ్య కేంద్రం నగరంలో ఉంది. ఇక్కడ మత్తు, దంత వైద్యులు లేరు. గతంలో వంద ఉన్న ఓపీ ప్రస్తుతం సగానికి తగ్గింది.

సమస్య పరిష్కరిస్తాం

సామాజిక వైద్యశాలల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తాం. సరిపడా వైద్యులను నియమించి రోగులకు ఇబ్బంది లేకుండా చూస్తాం. నిజాంపట్నంలో గైనకాలజిస్టును నియమిస్తాం. పని చేస్తున్న వైద్యులు రోజు వచ్చేలా చర్యలు తీసుకుంటా.-హనుమంతరావు, సామాజిక వైద్యశాలల జిల్లా సమన్వయకర్త

ఇక్కడ వైద్యులు లేకే బయటకు

నిజాంపట్నం లో ప్రభుత్వ వైద్యశాలకు మంచి వసతులతో కూడిన పక్కా భవనాలు నిర్మించారు. వైద్యులు లేకపోవడం శాపంగా మారింది. వైద్యులు ఎప్పుడు వస్తారో, చూస్తారో తెలియదు. చెరుకుపల్లిలో చూపించుకుంటున్నా.

-ఎస్‌ గౌతమి, గర్భిణి, నిజాంపట్నం

ఎప్పుడొస్తారో తెలియదు

నిజాంపట్నం సామాజిక ఆరోగ్య కేంద్రానికి గర్భిణులను పరీక్షించేందుకు వైద్యులు ఎప్పుడు వస్తారో తెలియదు. చేసేది లేక రేపల్లె ఓ ప్రైవేటు వైద్యశాలలో చూపిస్తున్నా. మాది పేద కుటుంబం అయినా బయటకు వెళ్లి చూపించాల్సిన పరిస్థితి. ప్రభుత్వ వైద్యశాలల్లో గైనకాలజిస్టులను నియమించాలి.

-కె శ్రావణి, గర్భిణి, నిజాంపట్నం


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని