వరుణుడి ఆటంకం
eenadu telugu news
Published : 22/10/2021 05:24 IST

వరుణుడి ఆటంకం

నిర్మాణంలో వైద్య కళాశాల భవనాలు  

పిడుగురాళ్ల, న్యూస్‌టుడే : పల్నాడు ప్రాంతానికి మణిహారమైన వైద్య కళాశాల భవన నిర్మాణ పనులు ప్రస్తుతం మందకొడిగా సాగుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలు నిర్మాణ పనులకు అడ్డంకిగా మారాయి. పునాదుల్లో నీరు చేరి పనులు నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. కింది అంతస్తు నిర్మాణంలో భాగంగా సుమారు మూడున్నర మీటర్లు లోతు మట్టి తవ్వి తీయడంతో పునాదుల్లోకి వర్షపు నీరు చేరింది. దీనికి తోడు కళాశాలకు ఎగువన ఆకురాజుపల్లి మేజరు కాల్వ ఉండటంతో పునాదుల్లోకి నీరు ఊరుతోంది. ఈనీరు కూడా నిర్మాణ పనులకు కొంత అంతరాయం కలిగిస్తుంది. వాస్తవంగా భవన నిర్మాణాన్ని 30 నెలల్లో పూర్తిచేయాలని గుత్తేదారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఏడాది జులైలో నిర్మాణ పనులు ప్రారంభించినప్పటికి ఇప్పటికీ పునాది దశలోనే ఉన్నాయి. వైద్య కళాశాల నిర్మాణంలో మొదటగా ఆసుపత్రి భవనం, నర్సింగ్‌ కళాశాల భవనాలు నిర్మాణాలు ప్రారంభించారు. ఆసుపత్రి భవనం ఆరు బ్లాకులు విభజించి నిర్మాణం చేస్తున్నారు. ప్రస్తుతం నాలుగు బ్లాకులకు పునాది వరకు నిర్మాణం చేశారు. మరోవైపు నర్సింగ్‌ కళాశాల భవన నిర్మాణ పనులు కూడా ప్రారంభించారు. వర్షాలు తగ్గినందున ఇక నుంచి నిర్మాణ పనులు వేగంగా జరుగుతాయని గుత్తేదారు సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.

పునాది దశలో పనులు: పిడుగురాళ్ల మండలం కామేపల్లి సమీపంలో వైద్య కళాశాల నిర్మాణానికి రూ.500 కోట్లు కేటాయించారు. ఈ కళాశాల నిర్మాణానికి 48 ఎకరాలు భూమిని సేకరించారు. ఈ కళాశాల భవనం 13.5 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణం చేయనున్నారు. వైద్య కళాశాలకు మే 31న ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణానికి భూమిపూజను జులై ఒకటో తేదీన స్థానిక ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి చేశారు. నిర్మాణ పనులు దక్కించుకున్న గుత్తేదారు సంస్థ నిర్మాణ పనులను జులై ఆఖరుకు ప్రారంభించింది. మొదటి ఆసుపత్రి భవన నిర్మాణం జరిగే ప్రాంతంలో సుమారు 3.5 మీటర్లు లోతు మట్టి తవ్వి, అక్కడ పునాది నిర్మాణం చేస్తున్నారు. వైద్య కళాశాల భవన నిర్మాణ పనులకు ప్రధాన అడ్డంకిగా మారిన పునాదుల్లో చేరిన నీటిని తోడేందుకు గుత్తేదారులు ఐదు విద్యుత్తు మోటార్లను వినియోగిస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని