తల్లడిల్లుతున్న క్యాన్సర్‌ రోగులు
eenadu telugu news
Published : 22/10/2021 05:24 IST

తల్లడిల్లుతున్న క్యాన్సర్‌ రోగులు

జీజీహెచ్‌లో మందుల కొరత

ఈనాడు-ఈటీవీ పరిశీలనలో వెల్లడి

జీజీహెచ్‌ క్యాన్సర్‌ విభాగంలో చికిత్సకు వచ్చిన బాధితులు

సరఫరా చేయాలని కోరినవి కీమోథెరపీ ఔషధాలు. ఇవి గుంటూరు జీజీహెచ్‌ నాట్కో క్యాన్సర్‌ ఆస్పత్రిలో లేవు. గత కొద్ది రోజులుగా వాటిని బయట కొనుగోలు చేసుకోవాలని రోగులకు చెబుతున్నారు. ఇవి ఖరీదైనవి కావడంతో అంత ఆర్థిక స్థోమత లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఔషధాలు స్పెషలైజ్డ్‌ మెడికల్‌ షాపుల్లోనే దొరుకుతాయి. బయట ఎక్కడా లేవు. నిర్దేశిత సమయానికి ఆ మందులు వేసుకోకపోతే తిరిగి క్యాన్సర్‌ ముదురుతోందని, నీరసం వస్తోందని, నొప్పులు భరించలేకపోతున్నామని రోగులు ‘ఈనాడు-ఈటీవీ’కి ఏకరువు పెట్టుకున్నారు. రెండు రోజుల క్రితం వారు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. క్యాన్సర్‌ విభాగం వైద్యులు కీమోథెరఫి డ్రగ్స్‌ సరఫరా చేయాలని సూపరింటెండెంట్‌కు ప్రతిపాదనలు పంపారు.

నిర్దేశిత బడ్జెట్‌ అయిపోయిందని...

రాష్ట్రంలో క్యాన్సర్‌ వైద్యానికి జీజీహెచ్‌లో సదుపాయాలు ఉండడంతో ఆయా జిల్లాల నుంచి రోగుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. దీంతో నిర్దేశిత మందుల బడ్జెట్‌ అయిపోయిందని, అదనపు బడ్జెట్‌ కోరితే తప్ప ఉచిత మందులు రావని వైద్యులు అంటున్నారు. డాక్సోరుబిసిన్‌ 10ఎంజీ, 5 ఎంఎల్‌ ఇంజక్షన్లు, పాస్లిటాక్సెల్‌ ఇంజెక్షన్‌ 30 ఎంజీ, 5 ఎంఎల్‌ ఇంజక్షన్లు లేక కొందరు రోగులకు రేడియేషన్‌ ఇచ్చి సరిపుచ్చుతున్నామని చెబుతున్నారు. ఇవి బయట తెచ్చుకోవాలని చెబుతున్నారని రోగులు తెలిపారు. ఇప్పటికే కొన్నిమందులు సీడీఎస్‌లో లేకపోతే వాటిని బయట కొనుగోలు చేశారు. ప్రస్తుతం రూ.కోటి దాకా బకాయిలు పేరుకుపోవడంతో ఆసుపత్రికి ఎవరూ మందులు సరఫరా చేయడానికి ఆసక్తి చూపడం లేదని, అందువల్లే వాటిని బయట తెచ్చుకోవాలని కోరుతున్నామని వైద్యులు అంటున్నారు. నిత్యం 20-30 మంది కొత్త రోగులు, వైద్య చికిత్సలో ఉన్నవారు మరో 50-60 మంది వస్తుంటారు. మొత్తంగా క్యాన్సర్‌ బ్లాక్‌ ఎప్పుడు చూసినా రోగులతో కిటకిటలాడుతుంది. ఇవే మందులు అనంతపురం, కర్నూలు, కాకినాడ, విశాఖపట్నం ఆస్పత్రుల్లోనూ ఉన్నాయి. కనీసం వాటిని డైవర్షన్‌ పెట్టించి ఇచ్చినా జీజీహెచ్‌కు సమస్య తీరేది. - ఈనాడు, అమరావతి

రూ.5 వేలు వెచ్చించా

నోటికేన్సర్‌తో బాధపడుతున్నా. రెండు రకాల మందులు వైద్యులు రాశారు. అవీ బలానికి, నొప్పుల నివారణకు వేసుకునే సాధారణ మాత్రలే. కీలకమైన కీమోథెరపీ మందులు ఒక్కటీ ఇవ్వలేదు. వాటిని రూ.5 వేలు వెచ్చించి ఒకటి రెండుసార్లు తెచ్చుకుని వేసుకున్నా. ఇప్పుడు ఆర్థిక స్థోమత లేక ఉచిత మందుల కోసం వేచి చూస్తున్నా. - కె.మట్టారెడ్డి, నోటి క్యాన్సర్‌ వ్యాధిగ్రస్థుడు, దాచేపల్లి

ఇంజక్షన్లు ఇవ్వటం లేదు

మాది రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం. తల్లి పారిజాతంతో కలిసి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా. 10 రోజుల నుంచి ఇంజక్షన్లు లేవు. దీంతో రేడియేషన్‌ ఇవ్వడం లేదు. కీమోథెరపీ చేయడం లేదు. మందులు వేసుకోకుండా అవి చేయకూడదని వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వమే సకాలంలో మందులు సరఫరా చేయాలి. - ఆరేపల్లి మధుసూదనరావు, గుంటూరు

మందుల కొరత నిజమే

మందుల కొరత ఉన్న మాట వాస్తవం. ఉన్నంత వరకు ఇచ్చి రోగులకు వైద్యసేవలు అందిస్తున్నాం. రెండు రోజుల క్రితం రోగులు వచ్చి మందులు అడిగారు. వెంటనే ఈ విషయం డీఎంఈ దృష్టికి తీసుకెళ్లాం. ఇతర జిల్లాల నుంచి డైవర్షన్‌ పెట్టి సర్దుబాటు చేస్తామన్నారు. ఇతర జిల్లాల నుంచి రోగుల తాకిడి ఉంది. ఇప్పటికే కోటా మేరకు మందులు వాడేశాం. అదనపు బడ్జెట్‌ కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపుతాం. - ఆచార్య నీలం ప్రభావతి, సూపరింటెండెంట్‌, జీజీహెచ్‌


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని