కారుణ్య నియామకాలు, స్థలాల రిజిస్ట్రేషన్‌కు కృషి
eenadu telugu news
Published : 22/10/2021 05:24 IST

కారుణ్య నియామకాలు, స్థలాల రిజిస్ట్రేషన్‌కు కృషి

కొవిడ్‌తో మృతి చెందిన పోలీసుల కుటుంబ సభ్యులకు చెక్కు

అందజేస్తున్న కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌, రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యుల కారుణ్య నియామకాలకు కృషి చేస్తానని కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ అన్నారు. గురువారం పోలీసు కార్యాలయంలో జిల్లాలోని అమరవీరుల కుటుంబ సభ్యులతో జిల్లా కలెక్టర్‌తోపాటు రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ ముఖాముఖి సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం స్థలాలు కేటాయించిందని, వాటికి ఇప్పటివరకు రిజిస్ట్రేషన్‌ చేయకపోవడంతో ఇల్లు నిర్మించుకోవడానికి, బ్యాంకుల్లో రుణాలు పొందటానికి ఇబ్బందులు పడుతున్నారని, వాటికి రిజిస్ట్రేషన్‌ చేసేలా ఆదేశించాలని కలెక్టర్‌ను రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ కోరారు. ఆ మేరకు పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు మాణిక్యాలరావు ద్వారా ఆయా కుటుంబ సభ్యులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా కారుణ్య నియామకాలు నిర్ణీత సమయంలో పూర్తిచేయాలని ఎస్పీ కోరారు. స్పందించిన కలెక్టర్‌ వెంటనే కారుణ్య నియామకాలతోపాటు స్థలాల రిజిస్ట్రేషన్‌కు చర్యలు తీసుకుంటానని తెలిపారు. అంతకుముందు అమరవీరుల కుటుంబ సభ్యులకు బహుమతులు, కొవిడ్‌తో మృతి చెందిన పోలీసుల కుటుంబ సభ్యులకు చెక్కులను అందజేశారు.

భవన నిర్మాణాలు వేగవంతం చేయండి..

గుంటూరు, న్యూస్‌టుడే: ప్రభుత్వ భవనాల నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో గురువారం అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అన్ని భవనాల బేస్‌మెంట్‌ స్థాయికి తీసుకురావాలన్నారు. టిడ్కో గృహాల లబ్ధిదారులందరు వారి వాటాను వెంటనే చెల్లించేలా మెప్మా, మున్సిపల్‌ అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న వాలంటీర్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. పేదలందరికీ ఇళ్ల పథకం లబ్ధిదారులందరినీ డ్వాక్రా సంఘాల్లో చేర్పించేలా చూడాలన్నారు. సమావేశంలో డీఆర్‌వో పి.కొండయ్య, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ బ్రహ్మయ్య, డ్వామా పీడీ శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ జేడీ విజయభారతి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని