విస్మరిస్తే.. విపత్తే
eenadu telugu news
Published : 22/10/2021 05:24 IST

విస్మరిస్తే.. విపత్తే

తీరానికి సహజ రక్షణ కవచం మడ అడవులు

విస్తీర్ణం పెంచడంపై దృష్టి అవసరం

తీరంలో మడ అడవి

తీర ప్రాంతానికి మడ అడవులు సహజ రక్షణ కవచాలుగా ఉన్నాయి. సునామీ, తుపాన్లు తదితర ప్రకృతి విపత్తుల సమయంలో రాకాసి అలలు తీరంపై విరుచుకుపడకుండా రక్షణ కల్పిస్తున్నాయి. తీర ప్రాంతం కోతకు గురికాకుండా ఆపుతున్నాయి. పెనుగాలుల తీవ్రతను తగ్గించి నష్టాన్ని పరిమితం చేస్తున్నాయి. వీటి విస్తీర్ణం పెంచాల్సి ఉందని పర్యావరణవేత్తలు కోరుతున్నారు.

బాపట్ల, న్యూస్‌టుడే : బాపట్ల మండలం అడవిపల్లెపాలెం నుంచి రేపల్లె మండలం లంకెవానిదిబ్బ వరకు 43 కి.మీ. పొడవునా తీర ప్రాంతం విస్తరించి ఉంది. గతంలో పదివేల హెక్టార్లలో మడ అడవులు ఉండేవి. ఉప్పు, మంచినీరు కలిసే బురద ప్రాంతాల్లో ఈ చెట్లు ఎక్కువగా పెరుగుతాయి. ఎన్నో అరుదైన జీవులకు ఆవాసాలుగా ఉన్నాయి. సూర్యలంక, పేరలి, నిజాంపట్నం, నక్షత్రనగర్‌, దిండి, అడవులదీవి, లంకెవానిదిబ్బ ప్రాంతాల్లో మడ అడవులు విస్తరించి ఉన్నాయి. పర్యాటకులకు సైతం బాగా ఆకర్షిస్తున్నాయి. పడవల్లో వెళ్లి వీటిని చూస్తున్నారు.

పెనుగాలుల నుంచి రక్షణ

* తీరంలో 1990లో మడ అడవులు నరికివేసి వేల ఎకరాలను రొయ్యల చెరువులుగా మార్చారు. ఈ అక్రమాలు ఇప్పుడు కొనసాగుతున్నా అధికారులు అడ్డుకోలేకపోతున్నారు. కలప కోసం వేలాది చెట్లను నరికివేశారు. 1977 దివిసీమ ఉప్పెన సమయంలో రాకాసి అలలు విరుచుకుపడి ఊళ్లకు ఊళ్లను తుడిచి పెట్టేశాయి. జిల్లాలో తీర ప్రాంతంలో మాత్రం ఆ స్థాయిలో నష్టం చోటు చేసుకోలేదు. దీనికి తీరం వెంబడి ఉన్న మడ అడవులే కారణం. పెను తుపాను సమయంలో గంటకు 250 కి.మీ. నుంచి 350 కి.మీ. వేగంతో పెనుగాలులు వీస్తాయి. సముద్ర తీరానికి సమీపంలో దట్టంగా ఉండే మడ అడవులు ఈ గాలుల వేగాన్ని తగ్గిస్తాయి. దీని వల్ల నష్టం చాలా వరకు తగ్గుతుంది. అలల ఉద్ధృతి నియంత్రణలో ఉండి నష్టాన్ని చాలా వరకు తగ్గిస్తాయి. ఈ అడవులు లేని ప్రాంతాల్లో తీరం కోతకు గురవుతోంది. సముద్రపు నీరు ముందుకు చొచ్చుకు వస్తోంది. బాపట్ల, కర్లపాలెం, నిజాంపట్నం, రేపల్లె తీరంలో మడ అడవులను ఆక్రమించి అక్రమంగా నరికివేసి రొయ్యల చెరువులుగా మార్చి సాగు చేస్తున్నారు. దీని వల్ల మడ అడవుల విస్తీర్ణం తగ్గింది. కొందరి స్వార్థం వల్ల తీర రక్షణ కవచానికి తూట్లు పడుతున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. ఆక్రమణలు గుర్తించి ఆ భూములను స్వాధీనం చేసుకుని తిరిగి మడ మొక్కలు నాటి పర్యావరణ సమతుల్యతను కాపాడాలి.

* బాపట్ల, రేపల్లె నియోజకవర్గాల్లో ఐదు మండలాల పరిధిలో 27 పంచాయతీలు సునామీ, తుపానుల వల్ల తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. తీర ప్రాంతం 1990, 1998, 2006, 2008, 2010. 2011, 2013, 2016, 2020లో తుపానులు, వాయుగుండాల ముప్పు ఎదుర్కొంది. 2010 మేలో వచ్చిన లైలా తుపాను సూర్యలంక సమీపంలో తీరం దాటింది. అలలు ఉద్ధృతంగా ఎగిసిపడి తీర వెంబడి భూమి బాగా కోతకు గురైంది. అయితే ఊహించిన విధంగా తుపాను విధ్వంసాన్ని సృష్టించలేదు. 2005 డిసెంబరులో వచ్చిన సునామీ తీర ప్రాంతాన్ని గజగజ వణికించింది. మడ అడవుల వల్ల తీర గ్రామాల్లో పెను నష్టం సంభవించలేదు. పెనుగాలుల తీవ్రతను, అలల ఉద్ధృతిని ఇవి బాగా తగ్గించాయి. మడ అడవుల ప్రాధాన్యం గుర్తించిన అటవీశాఖ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధులతో సామాజిక మడ అడవుల పెంపకం కార్యక్రమాన్ని చేపట్టింది. నిజాంపట్నం వద్ద 75 హెక్టార్లలో మడ అడవుల పెంపకాన్ని చేపట్టారు. ప్రభుత్వం మరిన్ని నిధులు విడుదల చేసి మడ అడవుల విస్తీర్ణాన్ని పెంచాలని పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు. సూర్యలంక, నిజాంపట్నం మండలాల్లో చిత్తడి నేలల్లో రెండు వేల హెక్టార్లలో మడ అడవులు పెంచటానికి అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో మడ అడవుల అభివృద్ధికి రెండేళ్ల క్రితం అటవీశాఖాధికారులు ప్రతిపాదనలు రూపొందించి కేంద్రానికి పంపించారు. ఇంకా ఆమోదం లభించలేదు.

ప్రతిపాదనలు రూపొందిస్తున్నాం

ప్రకృతి విపత్తుల సమయంలో నష్టాన్ని తగ్గించటంలో మడ అడవులు కీలకపాత్ర పోషిస్తాయి. తీరంలో మడ అడవుల అభివృద్ధికి అవకాశం ఉంది. కొత్తగా ప్రతిపాదనలు రూపొందిస్తున్నాం. సర్వే పనులు చేస్తున్నారు. త్వరలో ప్రభుత్వానికి పంపిస్తాం. - శివరామకృష్ణ, అటవీశాఖాధికారి రేపల్లె రేంజ్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని