తెల్ల బంగారమే
eenadu telugu news
Published : 27/10/2021 05:49 IST

తెల్ల బంగారమే

ప్రభుత్వ మద్దతు ధర మించి పత్తి కొనుగోళ్లు

నాదెండ్లలో పత్తి తూకం వేస్తున్న కూలీలు

గణపవరం (నాదెండ్ల), న్యూస్‌టుడే : కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రకటించిన కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ను మించి కొనుగోళ్లు సాగడంతో పత్తి రైతు మోములో సంతోషం వెల్లివిరిస్తోంది. గుంటూరు జిల్లాలో తొలి నుంచి అత్యధిక విస్తీర్ణం పత్తి పంట సాగయ్యేది. మద్దతు ధర దక్కకపోవడం, ఐదేళ్లలో గులాబీ రంగు పురుగు ఉద్ధృతి నిరాశపరిచింది. సాగు మధ్యలోనే పంటను తొలగించారు. ఎకరాకు సగటు దిగుబడి 15 క్వింటాళ్ల నుంచి నాలుగైదు క్వింటాళ్లకు పడిపోవడంతో పెట్టుబడి దక్కడం లేదు. చేదు అనుభవాల దృష్ట్యా ఈ ఏడాది పంట విస్తీర్ణం బాగా తగ్గించారు. ఒకప్పుడు 1.8 లక్షల హెక్టారుల్లో సాగు చేసిన జిల్లాలో ప్రస్తుతం లక్ష హెక్టార్లకు లోపే పరిమితమైంది. ఇతర పంటలు సాగు వేసేందుకు వీలులేని భూముల్లో మాత్రమే పత్తి సాగు చేస్తున్నారు.

అంతర్జాతీయ విపణిలో ధర పెరుగుదల: అంతర్జాతీయ విపణిలో దారం, వస్త్రం ధరలు పెరిగాయి. కొవిడ్‌-19 ప్రభావంతో పత్తి ఆధారిత ఉత్పత్తులు 30 శాతం నుంచి 50 శాతం వరకు ధరలు అధికంగా పలుకుతున్నాయి. అమెరికా, యూరప్‌ తదితర దేశాలు దుస్తుల కోసం మనదేశం వైపు చూస్తున్నాయి. చైనా, బంగ్లాదేశ్‌కు దారం(నూలు) ఎగుమతి చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం దూది క్యాండి (365కిలోలు) ధర గరిష్ఠంగా రూ.62వేలకు చేరింది. గతేడాది కంటే ఇది రూ.22వేలు అధికం. నూనెకు వినియోగించే విత్తనాలు కూడా క్వింటా రూ.3,200 వరకు పలుకుతున్నాయి. ఆయా పరిస్థితుల నేపథ్యంలో పత్తి రేటు ఊపందుకుంది.

మొదలైన కొనుగోళ్లు: దీపావళి తర్వాత జిన్నింగ్‌ పరిశ్రమలు పూర్తిస్థాయిలో పని చేయనున్నాయి. అప్పటికి పత్తి తొలి తీత ముమ్మరం కానుంది. గతంలో పంట చేతికొచ్చే సమయానికి కనీస మద్దతు ధర కోసం రైతులు ఎదురు చూడాల్సి వచ్చేది. అయితే ఈసారి అలాంటిదేమి లేదు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఎంఎస్పీ రూ.6,025 మార్క్‌ని అధిగమించి కొనుగోళ్లు సాగుతున్నాయి. పల్నాడు ప్రాంతంలో ఇప్పటికే లావాదేవీలు ఊపందుకున్నాయి. మాచర్ల, గురజాల, సత్తెనపల్లి, పెద్దకూరపాడు, తాడికొండ నియోజకవర్గాల్లో క్వింటాకు రూ.6,500 బోణి చేశారు. ప్రస్తుతం రూ.6,800 ధర లభిస్తోంది.  రెండో తీతలో తేమ శాతం తగ్గి, దూది నాణ్యత పెరిగితే రేటు కూడా మెరుగ్గానే ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. నెల్లూరు, ప్రకాశంలో వేసవి సాగు చేసిన పత్తికి అత్యధికంగా క్వింటా రూ.8,700 వరకు పలికింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పత్తి తీతలు మొదలైనందున ధర నిలకడగా ఉంటుందనేది చెప్పలేమని గుంటూరుకు చెందిన జిన్నింగ్‌ మిల్లు యజమాని నారాయణరెడ్డి తెలిపారు.

సీసీఐ వెనుకంజ

గడిచిన దశాబ్ద కాలంలో పత్తికి కనీస మద్ధతు ధర లభించడం కష్టమైంది. దీంతో అత్యధిక శాతం భారత ప్రభుత్వ పత్తి కొనుగోలు సంస్థ(సీసీఐ) రంగంలోకి దిగేది. గడిచిన రెండేళ్లుగా తమకు గిట్టుబాటు కాదని జిన్నింగు మిల్లు యజమానులు, వ్యాపారులు లావాదేవీలు అంతగా చేయలేకపోయారు. ఆ సందర్భాల్లో రైతుల నుంచి నేరుగా పత్తి కొని నూలు మిల్లులకు దూదిని విక్రయించడంతో సీసీఐకి లాభాల పంట పండింది. ఇంతగా తమ సంస్థ లాభాలు ఎప్పుడూ చూడలేదని సీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. అయితే ఇప్పుడున్న మార్కెట్‌ ధరకు తాము పత్తి కొనుగోలు చేయలేమని, ఉన్నతాధికారుల ఆదేశాలుంటే నామమాత్రంగా అవకాశం ఉంటుందన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని