మిర్చి ధర నేలచూపు
eenadu telugu news
Published : 27/10/2021 05:49 IST

మిర్చి ధర నేలచూపు

అన్ని రకాలు రూ.500 పైగా పతనం


గుంటూరు యార్డులో మిర్చి క్రయవిక్రయాలు

మిర్చియార్డు, న్యూస్‌టుడే: మిర్చి ధర నేల చూపు చూస్తుంది. గతంలో ఊరించిన ధరలు ఈ వారం ప్రథమార్ధం నుంచే తగ్గుతున్నాయి. గతంతో పోలిస్తే రూ.500 పైగా ధర పతనమైంది. దాదాపు అన్ని రకాలు ఇదే దారి పడుతున్నాయి. ఇంతకుముందు కంటే చైనాలో కరోనా కేసులు పెరగడం, అక్కడ కొన్ని రాష్ట్రాల్లో నిబంధనలు కఠినతరం చేయడం వల్ల ఎగుమతులు చాలా వరకు నిలిచిపోయాయి. బంగ్లాదేశ్‌కు కూడా గతంతో పోలిస్తే ఎగుమతులు తగ్గాయి. శ్రీలంకలో ఆర్థిక పరిస్థితులు తారుమారవడంతో అక్కడకు మిర్చి ఎగుమతి చేస్తే డబ్బు నిలిచిపోయే అవకాశం ఉంటుందని మిర్చి ఎగుమతి చేసేందుకు వ్యాపారులు ఇష్టపడటం లేదని ట్రేడర్స్‌ పేర్కొంటున్నారు.

మధ్యప్రదేశ్‌ పంట రావడం వల్లేనా....: మధ్యప్రదేశ్‌ పంట మిర్చి మార్కెట్లోకి అందుబాటులోకి వస్తోంది. ఇక్కడతో పోలిస్తే అక్కడ మిర్చి ధర తక్కువగా ఉండటంతో ఎగుమతిదారులు మధ్యప్రదేశ్‌ మిర్చి వైపు మొగ్గు చూపుతున్నారని వ్యాపార వర్గాలు వెల్లడించాయి. హైబ్రిడ్‌ రకాల మిర్చి అక్కడ తక్కువ ధరలకు లభిస్తుంది. రూ.4,000 వరకు అక్కడకు, ఇక్కడకు వ్యత్యాసం ఉంది. పైగా అక్కడి పంట కొత్తది కావడంతో ట్రేడర్లు అటువైపు మొగ్గు చూపుతున్నారని వ్యాపార వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా విదేశాలకు ఆర్డర్లు బాగా తగ్గాయి. చైనాకు గతంలో 100 కంటైనర్లు మిర్చి వెళ్తుండేది. ప్రస్తుతం అందులో సగం కూడా పోవడంలేదు. బంగ్లాదేశ్‌కు 20 నుంచి 25 కంటైనర్లు వెళ్తుంటాయి. ఇప్పుడది అయిదు కంటైనర్లకు పడిపోయింది. శ్రీలంకకు గతంలో 15 కంటైనర్ల మిర్చి ఎగుమతి అవుతుండేది. అక్కడ ఆర్థిక సంక్షోభం కారణంగా పూర్తిగా ఎగుమతులు నిలిచిపోయాయి. ఈ కారణాల దృష్ట్యా ధరలు తగ్గుతున్నాయని వ్యాపారులు అంటున్నారు. ధరలు తగ్గుతున్నందున రైతుల్లో ఆందోళన నెలకొంటుంది. ఇప్పటి వరకు ధర పెరుగుతుందని ఆశించిన రైతులు రోజులు గడిచే కొద్దీ తగ్గుతుండటం, ప్రస్తుతం పెట్టుబడులకు అవసరం కావడం వల్ల మిర్చిని విక్రయించుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని అధికారులు అంటున్నారు.

నాణ్యమైన సరకు ఏదీ: గుంటూరు మిర్చియార్డు పరిధిలో ఉన్న కోల్డ్‌స్టోరేజ్‌లతో పాటు జిల్లాలోని వివిధ శీతలగిడ్డంగుల నుంచి మిర్చి బస్తాలు యార్డుకు వస్తున్నాయి. నాణ్యత ఉన్న సరకు లేకపోవడమూ ధర తగ్గడానికి మరో కారణం. 577, ఆర్మూరు రకాల మిర్చి నాణ్యతగా లేవు. డీలక్స్‌ రకాలు తక్కువగా వచ్చాయి. సూపర్‌ 10 రకాల మిర్చి ధరలు మాత్రమే నిలకడగా ఉన్నాయి. ఇతర రకాల మిర్చి ధరలు తగ్గుతున్నాయి. యార్డుకు రైతులు మంగళవారం 57,661 మిర్చి బస్తాలను తరలించారు. ఈ-నామ్‌ ద్వారా 61,115 బస్తాలు విక్రయాలు జరిగాయి. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో 15,527 బస్తాలు నిల్వ ఉన్నాయి. కామన్‌ వెరైటీ 334, నెంబర్‌ 5, 273, 341, 4884, సూపర్‌ 10 రకాల మిర్చి సగటు ధర రూ.7,000 నుంచి రూ.13,000 ఉండగా, తేజ రకానికి రూ.7,000 నుంచి 15,000, బాడిగ రకానికి రూ.7,000 నుంచి రూ.16,000, తాలు మిర్చికి రూ.4,000 నుంచి రూ.8,300 ధర లభించింది. ఇంతకుముందుతో పోలిస్తే కామన్‌ వెరైటీ రకాలపై రూ.500, స్పెషల్‌ వెరైటీ రకాలపై రూ. 700 వరకు తగ్గిందని వ్యాపారవర్గాలు వెల్లడించాయి.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని