బొబ్బర తెగులు.. గుబులు
eenadu telugu news
Published : 28/10/2021 02:39 IST

బొబ్బర తెగులు.. గుబులు


తెగులు సోకిన మిరప పంట

ఈనాడు, గుంటూరు మిరప పంట ఇప్పుడిప్పుడే వేళ్లూనుకుంటుండగా వైరస్‌ వెంటాడం రైతులను ఆందోళనకు గురిచేస్తుంది. సాధారణంగా మిరప మొక్కలకు ముడత సమస్య వ్యాపిస్తోంది. ప్రారంభంలోనే బొబ్బర తెగులు విస్తరిస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వాతావరణ మార్పులు కొంతమేరకు కారణమై ఉండవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

గతేడాది మిర్చి ధరలు ఆశాజనకంగా ఉండటం, పత్తి దిగుబడులు ఆశించిన మేర లేకపోవడంతో రైతులు ఈసారి మిర్చి సాగుకు మొగ్గుచూపారు. ప్రారంభంలో అధిక వర్షాలు పడటంతో మిరప సాగు ఆలస్యమైంది. ప్రస్తుతం 60 రోజుల వ్యవధిలో ఉన్న మిర్చి పంటకు ప్రతికూల వాతావరణంతో బెట్టకు వచ్చి ఎదుగుదల తగ్గిపోయింది. బొబ్బర తెగులు విస్తరించడం, వైరస్‌ వ్యాప్తిచెందడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. 40 శాతానికిపైగా బొబ్బర తెగులు కనిపిస్తున్నచోట కొంతమంది రైతులు తోటలు తొలగించి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తున్నారు. కొందరైతే పంట తొలగించి మళ్లీ మిరప మొక్కలు నాటుతున్నారు. కొందరు రైతులు రసాయనాలు చల్లుతూ ఆశాభావంతో ముందుకెళ్తున్నారు. బొబ్బర తెగులు విస్తరిస్తే దిగుబడులపై తీవ్ర ప్రభావం పడుతుందని, కాయలు ఎదుగుదల లేక బరువు ఉండవని రైతులు చెబుతున్నారు. వరుసగా వర్షాలు కొనసాగడం, ఒక్కసారిగా వర్షాలు లేక బెట్ట పరిస్థితులు ఏర్పడటం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆందోళన చెందకుండా పంటను కాపాడుకోవాలని ఉద్యానశాఖ అధికారులు సూచిస్తున్నారు. వైరస్‌ నివారణకు మందు లేనందున వాటి వ్యాప్తికి దోహదపడే రసం పీల్చే పురుగులను అరికట్టడం ద్వారా వైరస్‌ను సమర్థంగా నిర్మూలించాలి. గట్ల మీద వైరస్‌కు స్థావరాలుగా ఉండే కలుపు మొక్కలను తొలగించాలి. సూక్ష్మపోషక మిశ్రమాన్ని లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయాలి. వైరస్‌ సోకిన మొక్కలు పీకి కాల్చివేయాలి. మిర్చి పంటకు ప్రధానంగా మూడు రకాల వైరస్‌ తెగుళ్లు నష్టపరుస్తున్నాయని, వాటి నివారణకు ఉద్యానశాఖ ఉప సంచాలకురాలు సుజాత పలు సూచనలు చేశారు.

ఆకుముడత (జెమినీ వైరస్‌, బొబ్బర )

లక్షణాలు

* ఈ వైరస్‌ తెల్లదోమ వల్ల వ్యాప్తి చెందుతుంది. * లేత ఆకులు చిన్నవిగా మారి పైకి ముడుచుకుని పడవ ఆకారంలో మారతాయి. * ఆకుల ఈనెలు ఆకుపచ్చగాను, ఈనెల మధ్యభాగం లేత ఆకుపచ్చ రంగుతో కణుపుల మధ్య దూరం తగ్గుతుంది. * ఆకుల మీద బొబ్బలుగా ఏర్పడి పైకి ముడుచుకుంటాయి. * పెరుగుదల లోపించి మొక్కలు గిడసబారిపోతాయి. * పూత, పిందె తక్కువగా వస్తుంది. పూత కాయగా మారకుండా రాలిపోతుంది

నివారణ

5 శాతం వేపగింజల కషాయం లేదా 1.5 గ్రాములు ఎసిఫెట్‌, 1.25 మిల్లీలీటర్ల ట్రైజోఫాస్‌, ఏసిటామిప్రిడ్‌ 0.3 గ్రాములు, థయోమిథాక్సామ్‌ 0.2 గ్రాములు, స్పైరో మెసిఫిన్‌ 1.మి.లీ మందులను మార్చి మార్చి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి.

బంతి ఆకు తెగులు (కుకుంబర్‌ మోజాయిక్‌ వైరస్‌)

లక్షణాలు

* ఇది పేనుబంక ద్వారా వ్యాప్తి చెందుతుంది

* ఆకులలో పత్రహరితం లోపించి ఆకుల కొనలు సాగి ఆకారం కోల్పోయి లేత ఆకుపచ్చ, ముదురు ఆకుపచ్చ రంగులో కనిపిస్తాయి.

* మొక్కల ఎదుగుదల లోపించి గిడసబారిపోతాయి

* పూత, పిందె తక్కువగా ఉంటుంది.

నివారణ

ఎసిఫెట్‌ 1.5 గ్రాములు, మిథైల్‌ డెమటాన్‌ 2 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్‌ 0.25 మి.లీ.ను లీటరు నీటికి కలిపి ఇందులో ఏదో ఒకటి పిచికారీ చేయాలి.

మొవ్వకుళ్లు

లక్షణాలు

ఇది తెగులు తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది * పొలంగట్ల మీద కలుపు మొక్కలైన ఉమ్మెత్త, పిచ్చితులసి, వయ్యారిభామ, తుత్తురు బెండ మొక్కల్లో ఈ వైరస్‌ వృద్ధి చెందుతుంది. * కలుపు మొక్కలను ఆశించిన తామర పురుగులు మిరప పంటపై రసం పీల్చడం ద్వారా ఈవైరస్‌ తెగులు వస్తుంది.

వాతావరణం పొడిగా, బెట్టగా ఉన్నప్పుడు, పగటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు తామర పురుగులు త్వరితంగా వృద్ధి చెంది తద్వారా వైరస్‌ తెగులు ఉద్ధృతి ఎక్కువ కావడానికి దారి తీస్తుంది.

నివారణ

ఫిప్రోనీల్‌ 0.3 శాతం గుళికలు నాటిన 15 రోజులకు, 45 రోజులకు ఎకరానికి 8 కిలోల చొప్పున భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు వేయాలి. ప్రస్తుతం ఎసిఫెట్‌ 1.5 గ్రాములు, ఫిప్రోనీల్‌ 2 మిల్లీలీటరుల, స్పినోపాడ్‌ 0.25, డైఫిన్‌ థయూరాన్‌ 1.5 గ్రాములలో ఏదో ఒకటి లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసి తామర పురుగును నివారించవచ్ఛు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని