సర్కారు బడుల్లోహౌస్ ఫుల్ ..!
eenadu telugu news
Published : 28/10/2021 02:39 IST

సర్కారు బడుల్లోహౌస్ ఫుల్ ..!


పిడుగురాళ్ల జడ్పీ పాఠశాలలో చెట్ల కింద విద్యాబోధన

మాచర్ల, పిడుగురాళ్ల, న్యూస్‌టుడే పల్నాడులోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య చేరిక గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటికీ ప్రభుత్వ బడిలో అడ్మిషన్‌ కావాలని తమ పిల్లలతో తల్లిదండ్రులు వస్తున్నారు. ఎంతమంది పిల్లలు వచ్చినా చేర్చుకోవాలని ఉన్నతాధికారులు చెబుతుండగా.. మరోవైపు పిల్లలు కూర్చొనేందుకు గదులు లేకపోవడంతో ఏం చేయాలో తెలియడం లేదు. పాఠశాల సామర్థ్యానికి మించి పిల్లలు చేరుతుండటంతో పిడుగురాళ్ల జడ్పీ ఉన్నతపాఠశాలలో ‘నో. అడ్మిషన్‌’ అంటూ బోర్డు తగిలించారు. ప్రస్తుతం రోజు మార్చి రోజు పాఠశాలకు రావాలని విద్యార్థులకు సూచిస్తున్నారు. పూర్తిస్థాయిలో తరగతులు నిర్వహిస్తే వారందరిని ఎక్కడ సర్దుబాటు చేస్తారో తెలియక గందరగోళం నెలకొంది.

ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఆలస్యంగా అడ్మిషన్లు ప్రారంభమైనప్పటికీ మాచర్ల పట్టణంలోని నెహ్రూనగర్‌ వీరభద్రాపురం మండల పరిషత్తు ఆదర్శ ప్రాథమిక పాఠశాల, పిడుగురాళ్లలోని మన్నెం పుల్లారెడ్డి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలల్లో ప్రస్తుతం అత్యధికంగా విద్యార్థులు చేరారు. జిల్లాలో పిడుగురాళ్లలోని మన్నెం పుల్లారెడ్డి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో గతేడాది 2100 మంది ఉండగా, ప్రస్తుతం 2420 మంది విద్యార్థులున్నారు. ఈ ఏడాది 320 మంది విద్యార్థులు పాఠశాలల్లో కొత్తగా చేరారు. గతేడాది పదోతరగతి పూర్తిచేసిన 300 మంది విద్యార్థులు బయటకు వెళ్లారు. మాచర్ల పట్టణంలోని వీరభద్రాపురం ప్రాథమిక పాఠశాలలో గతేడాది 469 మంది విద్యార్థులు ఉండగా ప్రస్తుతం 510 దాటింది. నెహ్రూనగర్‌ పరిధిలోని 1, 2, 3, 4 వార్డుల పరిధిలో ఉన్న సర్కారు బడి ఇదొక్కటే. పేదలు, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా నివసించే ఈ ప్రాంతంలో గతంలో ప్రవేటు పాఠశాలలు ఉన్నా మూతపడ్డాయి. చేరిన వారికి అనుగుణంగా గదులు లేకపోవడంతో చెట్లనీడన, వరండాల్లో కూర్చొంటున్నారు.

విద్యార్థులకు తగిన సౌకర్యాలు లేకున్నా..

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు సంఖ్య పెరిగిన నేపథ్యంలో సమస్యలు వెంటాడుతున్నాయి. గదులు కొరత తీవ్రంగా ఉంది. తరగతులను ప్రయోగశాలల్లో, వరండాల్లో, చెట్ల కింద, భోజనం చేసే గదుల్లో, ఖాళీ షెడ్లల్లో నిర్వహిస్తున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం 30 మందికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. మాచర్ల వీరభద్రాపురంలో ఒక తరగతిని 3 సెక్షన్లుగా విభజించి బోధిస్తున్నారు. ఉపాధ్యాయులు సెలవు పెడితే పిల్లలకు బోధన కష్టంగా మారింది. మాచవరం మండలం పిన్నెల్లి ప్రాధమిక పాఠశాలలో 470 విద్యార్థులుండగా అక్కడ 12 గదులు, 13 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. గతేడాది కంటే 70 మంది అదనంగా చేరారు. విద్యా వాలంటీర్లను నియమించాలని ఉన్నతాధికారులకు నివేదించారు.

ఉన్నతాధికారుల ఆదేశాలతో చేర్చుకుంటున్నాం

ప్రస్తుతం అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు పిల్లలను తీసుకొస్తున్నారు. గతేడాది కంటే అదనంగా ఇప్పటికే పిల్లలు అదనంగా వచ్చారు. అధికారుల ఆదేశాల ప్రకారం పిల్లలు ఇక్కడ ఉన్న వసతులకు మించి చేరేందుకు వస్తున్నా చేర్చుకుంటున్నాం.- జి.కిరీటిరెడ్డి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, వీరభద్రాపురం

జిల్లాలో ప్రాథమిక పాఠశాలల్లో అత్యధికంగా చేరిన వారు..

మండలం గ్రామం విద్యార్థులు

మాచర్ల  మాచర్ల 512

మాచవరం  పిన్నెల్లి 470

దుర్గి  అడిగొప్పల 441

ఉన్నత పాఠశాలలో

గ్రామం  పాఠశాల  విద్యార్థులు

దాచేపల్లి  జడ్పీ ఉన్నత  1600

పిడుగురాళ్ల  జడ్పీ ,, 2430

మాచర్ల  జడ్పీ ,,  1200


పిడుగురాళ్లలో జడ్పీ ఉన్నత పాఠశాల గేటుకు పెట్టిన నోఅడ్మిషన్‌ బోర్డు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని