
చికిత్స పొందుతూ విద్యార్థి మృతి
అమీర్‌పేట, హైదరాబాద్ : ప్రిన్సిపల్ బెదిరించాడనే భయంతో పాఠశాల మూడో అంతస్తు నుంచి దూకి తీవ్రంగా గాయపడిన విద్యార్థి చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. ఎస్సార్ నగర్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ కథనం ప్రకారం.. బీకేగూడలోని విశ్వభారతి హైస్కూల్లో స్థానిక ప్రాంతానికి చెందిన మహేష్(14) అనే విద్యార్థి ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. గత నెల 29న తరగతి గదిలో తోటి విద్యార్థినిని ఆటపట్టిస్తున్నాడనే కారణంతో పాఠశాల ప్రిన్సిపల్ మహేష్‌తోపాటు మరో విద్యార్థిని బయట నిలబెట్టారు. అంతటితో ఆగకుండా తల్లిదండ్రులకు విషయాన్ని చెబుతానని మహేష్‌ను బెదిరించాడు. భయపడిన మహేష్ పాఠశాల మూడో అంతస్తు పై నుంచి కిందికి దూకాడు. తీవ్రంగా గాయపడిన మహేష్‌ను చికిత్స నిమిత్తం పొలీసులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతి చెందాడు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకుగాను 304ఏ సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.