ఈ తెరాస కార్పొరేటర్‌ రూటే సెపరేటు!
logo
Updated : 21/11/2020 20:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ తెరాస కార్పొరేటర్‌ రూటే సెపరేటు!

ఇంటర్నెట్‌డెస్క్‌: భాగ్యనగరంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల వేడి క్రమంగా రాజుకుంటోంది. ఇప్పటికే ఆయా పార్టీల అభ్యర్థులంతా దాదాపుగా నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేసుకుని ప్రచారపర్వంలోకి దిగుతున్నారు. సాధారణంగా ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకర్షించుకునేందుకు అభ్యర్థులు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రచారానికి వెళ్లే మార్గంలో ఆరుబయట చిన్నారులకు స్నానం చేయించడం, దుస్తులు ఇస్త్రీ చేయడం, టిఫిన్‌ సెంటర్లల్లో దోశెలు వేయడం.. ఇలా తమదైన విన్యాసాలు ప్రదర్శిస్తుంటారు. ఇదంతా ఎన్నికల సమయంలో సహజమే అయినప్పటికీ హైదరాబాద్‌లో ఓ కార్పొరేటర్‌ మాత్రం ఇంతకంటే ప్రత్యేకంగా ఉండాలని ఎప్పుడూ ఉవ్విళ్లూరుతుంటారు. తన మార్కు ప్రచారశైలితో ప్రజలతో మమేకమవుతున్నారు. ఆయనెవరో కాదు హయత్‌నగర్‌కు చెందిన తెరాస కార్పొరేటర్‌ సామ తిరుమల్‌రెడ్డి. 

ప్రస్తుతం ఆయన అదే స్థానం నుంచి సిట్టింగ్‌ అభ్యర్థిగా గ్రేటర్‌ ఎన్నికల బరిలో ఉన్నారు. 2016 ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత అధికారుల తీరుపై తనదైన శైలిలో నిరసన తెలుపుతూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. తన డివిజన్‌ పరిధిలో పలుచోట్ల మురుగు నీరు రోడ్లపై నిలిచిపోయినపుడు అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఆ నీటిలోనే పడుకొని నిరసన తెలిపేవారు. హయత్‌నగర్‌ గల్లీల్లో రాత్రివేళల్లో ఇసుక లోడుతో వెళ్తు్న్న లారీలను నిలిపివేయాలని రవాణశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో ఓ సందర్భంలో సంబంధిత అధికారుల కాళ్లు పట్టుకుని మరీ విజ్ఞప్తి చేశారు. ఇటీవల పరిమితికి మించి వెళ్తున్న ఆటోను ఆపి డ్రైవర్‌, ప్రయాణికులతో గుంజీలు తీయించి మరోసారి ఇలా జరగకుండా ఉండేందుకు వారితో ప్రతిజ్ఞ చేయించారు. ఇలా.. తనదైన శైలిలో ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రయత్నించిన ఆయన.. తాజా ఎన్నికల ప్రచారంలోనూ వినూత్నంగా దూసుకెళ్తున్నారు. ఈసారి తన ప్రచారంలో ఒంటెను భాగం చేశారు. ఒంటెపై ఇంటింటికీ తిరిగి తెరాసకు ఓటేయాలని అభ్యర్థించారు. పలుచోట్ల స్థానికులు తమ సమస్యలను తిరుమల్‌రెడ్డికి విన్నవించగా వాటి పరిష్కారానికి ఆయన హామీ ఇచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని