Published : 27/11/2020 03:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బిర్యానీ..త్వరగా రానీ

ఈనాడు డిజిటల్‌, ఈనాడు, హైదరాబాద్‌: బల్దియా ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్న కార్యకర్తల కోసం నగర హోటళ్లలో బిర్యానీకి డిమాండ్‌ పెరిగింది. పార్టీల వారీగా వందల లెక్కన ఆర్డర్లు వస్తున్నాయి. బేగంపేట ప్రాంతంలోని హోటల్‌కి ఓ పార్టీ 800 బిర్యానీలు, మరో పార్టీ 500 బిర్యానీ ప్యాకెట్లకు ఆర్డర్‌ ఇచ్చింది. బంజారాహిల్స్‌లోని మరో ప్రముఖ హోటల్‌కు ఇంకో పార్టీ 100 బిర్యానీలను ఆర్డర్‌ ఇచ్చినట్లు నిర్వాహకులు చెప్పారు. కరోనాతో లాక్‌డౌన్‌ కాలం నుంచీ పూర్తిగా నష్టాల్లో మునిగిన తమకు ప్రస్తుత పరిస్థితులు ఊరటనిస్తున్నాయని వారంతా సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ఎన్నికల కోసమే ప్రత్యేకంగా సిబ్బందిని తిరిగి నియమించుకున్నట్లు సికింద్రాబాద్‌ పరిధిలోని ఓ హోటల్‌ యజమాని తెలిపారు.

ఏం చెప్పాలో తెలియక

డివిజన్ల వారీగా బాధ్యతలు చేపట్టిన నేతలు తమ అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు. తమ సొంత జిల్లాలు, నియోజకవర్గాల నుంచి కార్యకర్తలను తీసుకొస్తున్నారు. వీరికి పార్టీ ప్రచారపత్రాలు, జెండాలు ఇచ్చి కాలనీల్లోకి పంపిస్తున్నారు. ఈ కొత్త ప్రచారకర్తలకు తిప్పలు ఎదురవుతున్నాయి. అల్వాల్‌ పరిధిలో ఓ పార్టీ ప్రధాన నేత తన జిల్లా నుంచి 200 మందిని తీసుకొచ్చారు. వారు కాలనీల్లోకి వెళ్లిన సమయంలో స్థానిక సమస్యల గురించి ప్రజలు ప్రశ్నించడంతో అవగాహన లేక తెల్లముఖం వేయాల్సి వచ్చింది. మరికొన్ని చోట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తుండటంతో ప్రచారం చేసేందుకూ వెనకడుగు వేస్తున్నారు. ఖైరతాబాద్‌, కాప్రా పరిధిలో ఈ సమస్యలు ఎదురయ్యాయి.

అందుకే కినుక.. తప్పదు అలక

యూసుఫ్‌గూడ డివిజన్‌ పరిధి కాలనీలో ప్రధాన పార్టీ తరఫున జోరుగా ప్రచారం సాగుతోంది. పెద్ద సంఖ్యలో మహిళలు జెండాలు పట్టుకుని నడుస్తున్నారు. ఇంతలో ఏమైందో ఏమో నలుగురు మహిళలు అలిగి అక్కడి నుంచి బయటకు వచ్చేశారు. చోటా నాయకులు వారికి సర్దిచెప్పాలని ప్రయత్నించారు. ఇంతకీ అలక వెనుక అసలు కారణం ఏమిటని ఆరా తీశారు. అవతలి గ్రూపునకు బిర్యానీ, నగదు ఎక్కువగా ఇచ్చారని, తమకు మాత్రం సాధారణ భోజనం, తక్కువ డబ్బులు చెల్లించారంటూ సమాధానమిచ్చారు.

అమ్మో! చీకటిపడింది

జూబ్లీహిల్స్‌: ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇప్పుడో లెక్క.. చాలామంది అభ్యర్థులు ఇప్పుడు తెల్లవారుజామునే నిద్రలేవాల్సి వస్తుంది. జెండా చేతపట్టి అనుయాయులతో కలిసి బయటకు వెళ్లాలి. కరోనా లెక్కచేయకుండా నలుగురితో కలిసి అల్పాహారం చేయాలి. ఇక చీకటి పడితే అభ్యర్థుల గుండె గుబేలుమంటోంది. పొద్దంతా కనిపించని మందుబాబులు సాయంత్రం నుంచి ప్రచారంలో హుషారుగా పాల్గొంటున్నారు. దీంతో అభ్యర్థుల్లో కొందరు రాత్రి 8 తర్వాత చరవాణి బంద్‌ చేసుకోవాల్సి వస్తోంది. ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో ఓ డివిజన్‌ అభ్యర్థి పరిస్థితి ఇలానే ఉంది. ఈ కొద్దిరోజులు ఎప్పుడు గడుస్తాయా అని లెక్కలు వేసుకుంటున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని