
‘భాజపా నేతలు పాతబస్తీలో ఎందుకు తిరగరు?’
హైదరాబాద్: భాజపా గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టో విడ్డూరంగా ఉందని.. జీహెచ్ఎంసీ పరిధిలో లేని అంశాలను ఆ పార్టీ నేతలు హామీలుగా ఇస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ఆచరణ సాధ్యం కాని అంశాలు కాబట్టే ముందుజాగ్రత్తగా రాష్ట్రానికి సంబంధం లేని మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌తో విడుదల చేయించారని ఆరోపించారు. బాధితులకు రూ.25వేల వరదసాయం ఎలా ఇస్తారని.. రేపు ప్రధాని వస్తున్నందున ఉత్తర్వులు ఇప్పిస్తారా? అని తలసాని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో మీడియాతో తలసాని మాట్లాడారు.
ఉచిత విద్యుత్, మహిళా పోలీస్స్టేషన్ల ఏర్పాటు, ఎల్ఆర్ఎస్ రద్దు, ఉచిత ట్యాబ్ హామీలు జీహెచ్ఎంసీకి సంబంధం లేని అంశాలని.. అవన్నీ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశాలనే పరిజ్ఞానం కూడా భాజపాకు లేదన్నారు. భాజపా నేతల మధ్యే ఐక్యత లేదని.. ప్రజలు వారినెలా నమ్ముతారన్నారు. ‘‘మజ్లిస్‌పై ఇన్ని ఆరోపణలు చేస్తున్న భాజపా నేతలు పాతబస్తీలో ఎందుకు తిరగడం లేదు? చిన్నపాటి జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికే ఇంతమంది కేంద్రమంత్రులు రావాలా?’’ అని తలసాని ప్రశ్నించారు.