
కూకట్పల్లి ప్రమాదంలో.. నర్సాపూర్ యువకుడి దుర్మరణం
చక్రి
మూసాపేట, నర్సాపూర్, న్యూస్‌టుడే: మద్యం తాగి అర్ధరాత్రి ద్విచక్ర వాహనంపై సరదాగా చక్కర్లు కొడదామని మిత్రుడితో పాటు బయటకొచ్చిన ఆ యువకుడిని రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. హైదరాబాద్ కూకట్పల్లి ఠాణా పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. మెదక్ జిల్లా నర్సాపూర్‌కు చెందిన ఉమారాణి, రమేష్ దంపతుల కుమారుడు అల్వాల్ పృథ్వీరాజ్ అలియాస్ చక్రి (22) ఫ్యాషన్ డిజైనర్‌గా పని చేస్తూ మాదాపూర్‌లోని ఓ అద్దె గదిలో మిత్రులతో కలిసి ఉంటున్నాడు. రమేశ్, ఉమారాణిల వివాహం జరిగి గురువారానికి 25 ఏళ్లు పూర్తయింది. ఈ మేరకు రజతోత్సవ వేడుకను కుమారుడితో కలిసి చేసుకునేందుకు అదే రోజు తల్లిదండ్రులిద్దరూ హైదరాబాద్‌కు వెళ్ల్లారు. చక్రితో కలిసి జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిని సందర్శించి కారులో హైదరాబాద్ అంతా కలియతిరిగారు. అదే రోజు రాత్రి రమేశ్ దంపతులు నర్సాపూర్‌కు వచ్చేశారు. ఆ తర్వాత శుక్రవారం తెల్లవారుజామున చక్రి తన మిత్రుడు అభిషేక్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై చక్కర్లు కొడదామని ద్విచక్ర వాహనంపై బయల్దేరారు. ముందుగా బోరబండ మీదుగా ఎర్రగడ్డ వెళ్లారు. తిరిగొచ్చే క్రమంలో కూకట్పల్లి ఐడీఎల్ చెరువు కట్ట మార్గంలోకి వచ్చారు. ఆ సమయంలో చక్రి వాహనం నడుపుతుండగా.. అభిషేక్ వెనుక కూర్చున్నాడు. ఇక్కడి రంగనాయక ఆలయం వద్దకు వచ్చే సరికి ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడింది. దీంతో చక్రికి బలమైన గాయాలు కాగా స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడు. ఈ సమాచారం అందుకున్న తల్లిదండ్రులు కూకట్‌పల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలివెళ్లారు. వారు వెళ్లేసరికి చేతికొచ్చిన ఒక్కగానొక్క కుమారుడు విగతజీవిగా పడి ఉండటాన్ని చేసి రోదించారు. రమేశ్ కుమార్తె శ్రీనిధి కెనడాలో ఉద్యోగం చేస్తుండగా ఆమె అక్కడి నుంచి రావడానికి రెండు రోజులు పడుతుందని అంత్యక్రియలను ఆదివారానికి వాయిదా వేశారు. మృతుడి మేనమామ విజయ్‌కుమార్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.