
ఫాస్టాగ్ ఉంటే ఆగవిక..!
జనవరి 1 నుంచి అమలుకు అధికారుల నిర్ణయం
అల్లాపూర్ గేట్ వద్ద విస్తృత ప్రచారం
న్యూస్‌టుడే, తూప్రాన్
ఫాస్టాగ్ చిప్‌ను స్కాన్ చేస్తున్న సిబ్బంది
మీ వాహనానికి ఫాస్టాగ్ చిప్ లేకపోతే టోల్గేట్ దాటి ముందుకు వెళ్లలేదు.. ఇది జనవరి 1 నుంచి ప్రతి వాహనానికి తప్పని సరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మెదక్ జిల్లాలో 44వ జాతీయ రహదారిపై తూప్రాన్ మండలం అల్లాపూర్ వద్ద టోల్గేట్ ఉంది. సిద్దిపేట జిల్లాలో దుద్దెడ వద్ద రాజీవ్ రహదారిపై టోల్గేట్ ఉంది.
71 శాతం మాత్రమే..
అల్లాపూర్ వద్ద నిత్యం 8 వేలకు పైగా వాహనాలు వెళ్తున్నాయి. ఇప్పటి వరకు 71 శాతం వాహనదారులు ఫాస్ట్‌టాగ్ చిప్‌లను ఏర్పాటు చేసుకున్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచి తప్పనిసరి కావడంతో ప్రతిఒక్క వాహనదారుడు వీటిని ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. ఈ కొత్త నిబంధనతో నగదు చెల్లించి వెళ్లేందుకు ఇప్పటి వరకూ ఉన్న బూత్‌ను తొలగించనున్నారు. కొత్త నిబంధనలతో మనిషికి ఆధార్ ఎంత ముఖ్యమో వాహనానికి ఫాస్టాగ్ అంత ముఖ్యమని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు అధికారులు వాహనదారులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. అందరికీ ఫాస్టాగ్ ఉండేలా చొరవ చూపుతున్నారు. భవిష్యత్తులో దాని ఆవశ్యకతను వివరిస్తుండటం గమనార్హం.
స్థానికులకు నామమాత్రం
ఇప్పటి వరకు టోల్గేట్లకు 20 కిలో మీటర్ల దగ్గరలో ఉన్న గ్రామాల వాహనదారులకు కొంత మేర టోల్ రుసుములో ఉపశమనం ఉండేది. స్థానిక గుర్తింపు కార్డు ఉంటే వాహనదారులు ఉచితంగా వెళ్లే విధంగా చొరవ తీసుకున్నారు. ఈ కొత్త నిబంధనతో స్థానికంగా ఉన్న వాహనదారులు సైతం రుసుములు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. నామమాత్రంగా నెలకు రూ.270 లోకల్ ఛార్జీలు పడేలా చిప్‌ను సరి చేయనున్నారు. ఇప్పటి వరకు తమకు ఉచితంగా ఉండేదని ఇప్పుడు రుసుములు విధించడం సరికాదని పలువురు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహనదారులు తప్పనిసరిగా ఖాతాలో లేదా ఇతర యాప్‌లలో తప్పనిసరిగా నగదు ఉంచుకోవాల్సి ఉందని అధికారులు తెలిపారు.
అవగాహన కల్పిస్తున్నాం..
- తరుణ్, ఎన్హెచ్ఏఐ పీడీ
44వ జాతీయ రహదారిపై అల్లాపూర్ వద్ద ఫాస్టాగ్ వినియోగంపై వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నాం. స్టిక్కర్ లేకపోతే వాహనం ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. ప్రతి వాహనదారులు వీటిని ఏర్పాటు చేసుకోవాలి. ప్రస్తుతం 71 శాతం వాహనాలకు ఫాస్టాగ్లున్నాయి, జనవరి వరకు 100 శాతం పెట్టుకునేలా చొరవ తీసుకుంటాం.