Published : 05/12/2020 03:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తెమ్మని..తేమని తాలని కొర్రీలు!

ధాన్యం తూకాల్లో తేడాలు

కొనుగోలు కేంద్రాలు, మిల్లుల వద్ద ఇదీ దుస్థితి

నష్టపోతున్న రైతులు

న్యూస్‌టుడే, బొంరాస్‌పేట

41.600 కిలోల తూకంతో ధాన్యం బస్తా

ఆరుగాలం కష్టపడి పండించుకున్న ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. పంట కోతలకు వారం రోజులపైగానే యంత్రాలకోసం పడిగాపులు పడాల్సి వచ్చింది. ఆరబెట్టి విక్రయించేందుకు మరిన్ని కష్టాలు తప్పటంలేదని ఆవేదన చెందుతున్నారు. ఒక్కో కొనుగోలు కేంద్రం వద్ద ఒక్కో విధంగా తూకం వేస్తూ నిర్వాహకులు దోచుకుంటున్నారని వాపోతున్నారు. నిబంధనలను పాటించకుండా అధికంగా తూకం చేస్తున్నారని ఆందోళన చేస్తున్న సంఘటనలు జిల్లాలో జరుగుతున్నాయి. బస్తాకు 40.700 కిలోలు తూకం వేయాలనే నిబంధన పాటించకుండా 41.100 నుంచి 41.600 కిలోల వరకు తూకం వేస్తున్నారు. ధాన్యం బస్తాల లారీ మిల్లుకు వెళ్లగానే తేమ, తాలు పేరుతో కోతలు విధిస్తూ కొర్రీలు పెడుతున్నట్లు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అంటున్నారు. పరోక్షంగా ఈ నష్టం రైతులపై పడుతోంది. వారు ఇదేమని ప్రశ్నిస్తే ధాన్యం తూకం వేయడంలేదు. దీంతో కేంద్రాల వద్దనే ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు. కేంద్రాల్లో అదనపు ధాన్యం తీసుకోవటంతో 50 కిలోల నుంచి క్వింటా వరకు నష్టపోతున్నామంటున్నారు చిన్న రైతులు. జిల్లాలో డీసీసీబీ, మార్కెటింగ్‌, డీసీఎంఎస్‌, ఐకేపీ ఆధ్వర్యంలో 122 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.

చిరిగిన సంచులు.. ఆరబెట్టేందుకు అవస్థలు

బొంరాస్‌పేట మండలంని మద్దిమడుగు తండాకు చెందిన దామ్లానాయక్‌ పండించిన 200 బస్తాల ధాన్యం 12 రోజులు ఆరబెట్టారు. ఎండల తీవ్రత లేకపోవటంతో టార్పాలిన్లల్లో ధాన్యం ఆరడంలేదు. తేమ 17 శాతం రావటానికి వారం రోజుల వరకు ఆరబెట్టాల్సి వస్తోంది. కల్లాలు లేకపోవటంతో రోడ్లపై ఆరబెడుతున్నారు. పంట చేతికొస్తున్న తరుణంలో ఎక్కువ వర్షాలతో గింజలు గట్టిపడకుండా తాలుగా మారిందని అంటున్నారు. ఉపాధి నిధులతో కల్లాల నిర్మాణానికి అవకాశాలున్నా, అవగాహన లేక కొందరు, అనర్హతతో ఇంకొందరు ఏర్పాటు చేసుకోవటంలేదు. బస్తాలు చిరిగినవి సరఫరా చేయటంతో తూకం వేస్తున్న సమయంలో రంధ్రాల్లోంచి ధాన్యం పోతోందని, వాటిని సరి చేసుకోవటానికి తూకాల్లో మోసం చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. బొంరాస్‌పేట ఐకేపీ కొనుగోలు కేంద్రంలో బస్తాకు కిలో ధాన్యం అధికంగా తూకం చేస్తున్నారని రైతులు ఆందోళన చేయగా తహసీల్దారు షాహెదాబేగం, వ్యవసాయాధికారి రాజేష్‌ అక్కడికొచ్చారు. రైతులు, నిర్వాహకులతో మాట్లాడి అందరి సమక్షంలో బస్తాలను తూకం చేయగా 41.600గా గుర్తించగా ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తామని భరోసా ఇచ్చారు.

అన్యాయం జరగకుండా చూస్తాం: వీరయ్య, ఐకేపీ డీపీఎం, వికారాబాద్‌

ధాన్యం కొనుగోలు కేంద్రాలతో రైతులకు అన్యాయం జరగకుండా చూస్తాం. కేంద్రాల ప్రారంభానికి ముందు అవగాహన కల్పించాం. మిల్లు వద్ద ఒక్క బస్తా 40 కిలోలకు పైగా ఉండాలని అంటున్నారు. నిర్ణీత తేమ శాతం లేకపోవటం, పండిన పంటలో తాలు ఉండటంతో కొంతమేర వ్యత్యాసం ఉంటుంది. ఈ ఏడాదిలో పాత బస్తాలు సరఫరా చేయటంతో నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. తూకాల్లో తేడాలు లేకుండా తగిన చర్యలు తీసుకుంటాం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని