
ఆస్తుల అమ్మకానికి అవస్థలు!
మూడు నెలలుగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు బంద్
సామాన్యులకు తప్పని ఇబ్బందులు
ఈనాడు డిజిటల్, వికారాబాద్
వికారాబాద్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం
వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో క్రయ, విక్రయాలు ఆగిపోయాయి. ఇండ్ల నిర్మాణం, వివాహం, ఇతర శుభ కార్యాలయాలకు ఏదైనా స్థిరాస్థిని అమ్ముకుందామంటే చేతికి సొమ్ము వచ్చే దారి కనిపించడం లేదు. గతంలో నిర్ణీత సమయంలోగా డబ్బు చెల్లించి ఇంటి స్థలం, ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకుంటామని ఒప్పందం చేసుకున్న వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రధానంగా మధ్య తరగతి కుటుంబాలకు ఈ పరిస్థితులు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. జిల్లాలోని నాలుగు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో రోజుకు సరాసరిన 120 నుంచి 160 దస్త్రాలు రిజిస్ట్రేషన్ అయ్యేవి. ప్రస్తుతం వ్యవసాయ భూములకు సంబంధించి ధరణి పోర్టల్‌లో తహసీల్దార్ రిజిస్టర్ చేస్తున్నారు. 18 మండలాల పరిధిలో ప్రస్తుతం 80 నుంచి వంద డాక్యుమెంట్లు రిజిస్టర్ అవుతున్నాయి. వ్యవసాయేతర భూములకు సంబంధించిన డాక్యుమెంట్లకు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్స్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మూడు నెలలుగా కొన్ని వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు, స్థిరాస్తి వ్యాపారులు చెబుతున్నారు. క్రయ విక్రయాలు, మ్యుటేషన్లు, బహుమతి, తదితర వాటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితులు తమకు ఆర్థికంగా నష్టం చేకూర్చుతున్నాయని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు రిజిస్ట్రేషన్లు తెరిచినా కనీసం రెండు నుంచి మూడు నెలల పాటు స్లాట్ దొరకడం కష్టమవుతోందని, మరికొంత కాలం ఇబ్బందులు పడక తప్పదని అధికారులు చెబుతున్నారు. ప్లాట్ రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో స్థిరాస్తి వ్యాపారం నెమ్మదించింది. ప్రస్తుతం మాటలు, ఒప్పందాలతో సరిపెట్టుకుంటున్నారు. వ్యవసాయేతర భూములకు రిజిస్ట్రేషన్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న సాఫ్ట్వేర్, ఇతర సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ తీసుకుంటున్నారు.
సిద్ధంగా ఉన్నాం
- అన్వర్, వికారాబాద్ సబ్ రిజిస్ట్రార్
వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ధరణి పోర్టల్‌లో ట్రైల్ రన్ చేస్తున్నాం. ప్రభుత్వం ఏ క్షణంలో ఆదేశాలు జారీ చేసినా పనిచేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం.
సామాన్యులు నష్టపోతున్నారు..
- కృష్ణ, వికారాబాద్
రెండేళ్ల కిందట ప్లాట్ కొనుగోలు చేశా. ఇప్పుడు డబ్బులు అవసరమై అమ్ముకుందామని రెండు నెలల క్రితం వేరొకరికి ఒప్పంద పత్రం రాసిచ్ఛా టోకెన్ మొత్తంగా రూ.5 లక్షలు ఇచ్చారు. మరో రూ.16 లక్షలు రావాల్సి ఉంది. రిజిస్ట్రేషన్ చేస్తేనే డబ్బులు ఇస్తామంటున్నారు. ఏం చేయాలో తోచని స్థితిలో రెండు రూపాయల మిత్తికి అప్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. వెంటనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభించాలి.
కూతురు పెళ్లి దగ్గర పడుతోంది
- వికారాబాద్ మండలానికి చెందిన ఓ తండ్రి ఆవేదన
కూతురు పెళ్లి ఉందని ఉన్న భూమిని అమ్ముదామనుకున్నా. మొదట 35 శాతం సొమ్ము ఇవ్వాలని, రిజిస్ట్రేషన్ రోజు మిగతా మొత్తం చెల్లించేందుకు అంగీకారంతో ఒప్పందం కుదిరి రెరడు నెలలు కావస్తోంది. రిజిస్ట్రేషన్ పోర్టల్ తెరుచుకోవడం లేదు. పెళ్లి దగ్గరపడుతోంది. ఖర్చులకు డబ్బులు అవసరమై మిగతా సొమ్ము ఇవ్వాలని అడిగితే 15 శాతం ఇస్తామంటున్నారు. ●