Published : 05/12/2020 03:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చిరు మోముల్లో.. చదువుల వెలుగు

బాలకార్మికుల బడిబాట

వ్యవస్థ నిర్మూలనకు చర్యలు

ఎన్‌సీఎల్‌పీలో ప్రత్యేక పాఠశాలలు

న్యూస్‌టుడే, వికారాబాద్‌టౌన్‌

చైతన్య నగర్‌లో ప్రత్యేక పాఠశాలలో బాలకార్మికులు

నిరుపేద ప్రజల సామాజిక స్థితిగతులు, ఆర్థికంగా వెనుకబాటు, సంచారజీవనం పరిస్థితుల ప్రభావం తదితర కారణాల వల్ల పిల్లలు బాలకార్మికులుగా మారుతున్నారు. బాల్యం మట్టికుప్పల్లో, వివిధ పరిశ్రమల్లో గడిచిపోతోంది. పలకాబలపం పట్టాల్సిన చిట్టి చేతులు పలుగుపార పట్టి చదువుకు దూరమవుతున్నాయి. బంగారు భవిష్యత్తు బీటలు వారుతోంది. ఈ దుస్థితి నుంచి చిన్నారులను తప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం గతేడాది నుంచి ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జాతీయ బాల కార్మికుల ప్రాజెక్టు (ఎన్‌సీఎల్‌పీ) ద్వారా చిన్నారులతో అక్షరాలు దిద్దించేందుకు ప్రత్యేక పాఠశాలలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే జిల్లాకు 39 ప్రత్యేక పాఠశాలలు మంజూరయ్యాయి. వీటిలో 16 ప్రారంభించారు. కరోనా ప్రభావంతో ప్రస్తుతం కొనసాగడంలేదు. వీటిని తెరిచి చిన్నారులకు చదువు చెప్పాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

జిల్లాలో అత్యధికులకు కూలీ పనులే ఆధారం. కుటుంబ సభ్యులు పనులకు వెళ్లే క్రమంలో పిల్లలు కూడా వారితోపాటే వెళ్లాల్సి రావడంతో బాలకార్మికులు అధికమవుతున్నారు. బడిమానేసిన ఇటువంటి వారికి ఎన్‌సీఎల్‌పీ ద్వారా గతేడాది జిల్లాలో 16 ప్రత్యేక పాఠశాలలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ సర్వే ఆధారంగా వీటిని ఎంపిక చేశారు. అత్యధికంగా మల్‌శెట్టిపల్లి తండాలో 42, తక్కువగా నాగారంలో 16 మంది బాలకార్మికులు ఉన్నారు. ప్రత్యేక పాఠశాలలు తండాల్లోనే ఎక్కువగా ఏర్పాటయ్యాయి. తండాలకు చెందిన వారు వివిధ ప్రాంతాల్లో కూలీ పనులకు వెళ్తుండటం, పిల్లలు ఇంటి వద్దనే ఉండటంతో విద్యకు దూరమవుతున్నారని గుర్తించారు. జిల్లా కేంద్రంలో రెండు ఏర్పాటు చేశారు. మొత్తం జిల్లాలో 487 మందికి విద్యను అందిస్తున్నారు. బాలకార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు ఈ బడులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

తల్లిదండ్రులకు అవగాహన

చదువుకు దూరమైన వారిని ప్రత్యేక పాఠశాల్లో చేర్పించి విద్యా బుద్దులు నేర్పిస్తారు. నేరుగా పాఠశాల్లో చేర్పించే అవకాశం ఉన్నప్పటికీ, వీటిల్లోనే పిల్లలకు అవగాహన కల్పిస్తున్నారు. విద్యారంగం, ఆధునిక పరిజ్ఞానం, ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్తు ఉన్నత లక్ష్యాలు చదువుకుంటే కలిగే ప్రయోజనం తదితర అంశాల గురించి వివరిస్తున్నారు.

భవిష్యత్తుకు బాటలు

బాలలతో పనులు చేయించడం వల్ల వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీని వల్ల విద్యతో పాటు ఆటపాటలకు దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్‌సీఎల్‌పీ ద్వారా పిల్లల జీవితాల్లో కొత్త వెలుగులు రానున్నాయి. వీటిని కార్మికశాఖ పర్యవేక్షిస్తుంది. ప్రత్యేక పాఠశాలల నిర్వహణకు అర్హతలున్న ఎన్‌జీఓకు అప్పగించారు. రీడ్స్‌, జాగృతి, షేర్‌ ఎన్‌జీఓల ఆధ్వర్యంలో కొనసాగించారు.

బడిఈడు పిల్లలు బడిలో ఉండాలి

హనుమంత్‌రావు, జిల్లా ప్రాజెక్టు అధికారి

బడిఈడు పిల్లలందరూ పాఠశాల్లోనే ఉండాలి. బాలకార్మికులకు ప్రత్యేక పాఠశాలలు మంజూరు అయ్యాయి. వీటి నిర్వహణను ఎన్‌జీఓలకు అప్పగించాం. ఇక్కడ కొన్ని రోజులు చదివించి రెగ్యులర్‌ పాఠశాల్లో చేర్పిస్తాం. బాలకార్మిక వ్యవస్థను రూపుమాపడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం ప్రత్యేక పాఠశాలలు కొనసాగడం లేదు, ప్రారంభం కాగానే కార్యాచరణ ఉంటుంది. చిన్నారుల తల్లిదండ్రులు సహకరించాలి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని