
సత్తా చూపని స్వతంత్రులు
415 మందిలో ఒక్కరూ గెలవలె!
ఈనాడు డిజిటల్, హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో ఒక్కరంటే ఒక్క స్వతంత్రుడూ సత్తాచాటలేకపోయారు. మొత్తం 150లో 132 డివిజన్ల నుంచి 415 మంది స్వతంత్రులు బరిలో నిలిచారు. వీరిలో అధికులు ప్రధాన పార్టీల టిక్కెట్లు ఆశించి భంగపడిన వారే. కొన్ని డివిజన్లలో తమకు మొండిచేయి చూపిన పార్టీ అభ్యర్థుల ఓటమే లక్ష్యంగా ప్రచారం చేసినవారూ ఉన్నారు. అయినా వీరి ప్రభావం ఎక్కడా కనిపించలేదు. అత్యధికంగా స్వతంత్రులు బరిలో ఉన్న స్థానాల్లోనూ ఒక్కొక్కరికీ కనీసం వంద ఓట్లు దాటకపోవడం గమనార్హం. సనత్నగర్ డివిజన్ నుంచి పోటీలో ఉన్న స్వతంత్ర అభ్యర్థి పెరుమాళ్ల వైష్ణవి అత్యధికంగా 219 ఓట్లు సాధించారు. 2009 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 600 మంది స్వతంత్రులు పోటీ చేయగా ముగ్గురు గెలిచారు. 2016లో ఏకంగా 1333 మంది పోటీలో ఉన్నా ఒక్కరూ దీటైన పోటీ ఇవ్వలేదు. ఈసారీ అదే తీరు కొనసాగింది.
కౌన్సిల్లోకి కొత్త రక్తం
81 మందికి తొలి గెలుపు
ఈనాడు డిజిటల్, హైదరాబాద్: హోరాహోరీగా సాగిన గ్రేటర్ పోరులో నగర ఓటర్లు విలక్షణ తీర్పునిచ్చారు. ఈ ఎన్నికల్లో కొత్త అభ్యర్థుల వైపు మొగ్గు చూపారు. నాలుగు ప్రధాన పార్టీల నుంచి బరిలో నిలిచిన 81 మంది కొత్త నేతలకు పట్టం కట్టారు. వీరిలో దాదాపు 90 శాతం తొలిసారి అదృష్టాన్ని పరీక్షించుకున్నవారే కావడం విశేషం. గత ఎన్నికల్లో 60 శాతం కొత్త అభ్యర్థులు గెలుపొందగా.. ఈ ఎన్నికల్లోనూ దాదాపు అంతేమంది బల్దియాలో అడుగుపెట్టబోతున్నారు. అధికార తెరాస 26 మంది సిట్టింగ్ అభ్యర్థులను మార్చగా, 21 మంది విజయం సాధించారు. 149 చోట్ల పోటీ చేసిన భాజపా అభ్యర్థుల్లో 49 మంది విజయబావుటా ఎగరేశారు. వీరిలో 46 మంది తొలిసారి గెలిచినవారే. ఎంఐఎం పార్టీ 14 మంది అభ్యర్థులను మార్చగా వారిలో 11 మంది గెలిచారు. రెండు స్థానాల్లో గెలిచి కాంగ్రెస్ ఉనికి చాటుకోగా.. ఆ ఇద్దరూ రాజకీయాల్లోకి ఈ ఎన్నికలతోనే అరంగేట్రం చేశారు. కొత్త పాలకవర్గంలో మహిళా నేతల ఆధిక్యం కనిపించనుండగా అందులో 90 శాతం తొలిసారి గెలిచినవారే.