
ఎవరు సఫలం.. ఎవరు విఫలం ?
ఈనాడు, హైదరాబాద్
గ్రేటర్ పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు బల్దియా ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని చెమటోడ్చారు. ఫలితాలు కొందరికి నిరాశను మిగిల్చగా.. మరికొందరికి సంతృప్తినిచ్చాయి.
ముగ్గురు ఎంపీలకు...
2018 అసెంబ్లీ ఎన్నికల్లో కిషన్‌రెడ్డి అంబర్‌పేట నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి గెలుపొంది.. కేంద్ర సహాయ మంత్రి బెర్తు దక్కించుకున్నారు. భాజపా గ్రేటర్ ఎన్నికల కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరించారు. ఆయనకు ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారాయి. తాజా ఫలితాలను పరిశీలిస్తే సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో కమలం వికసించింది. ముషీరాబాద్, సనత్‌నగర్, అంబర్‌పేట, ఖైరతాబాద్ తదితర నియోజకవర్గాల్లో ప్రభావం చూపించింది. ఈ ఎన్నికల్లో సత్తాచాటి రాజకీయ భవిష్యత్తును పటిష్ఠం చేసుకోవాలనే పట్టుదలతో మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి శ్రమించారు. కానీ.. రెండు డివిజన్లలో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. ఎంఐఎం తరఫున ఆపార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నీ తానై వ్యవహరించారు. సిట్టింగ్ స్థానాలను కాపాడుకుంటూనే.. మరికొన్ని చోట్ల పాగా వేయాలనుకున్నా గత స్థానాలకంటే మించలేదు.
ఒక్కటంటే ఒక్కటి కూడా... కాంగ్రెస్ తరఫున గెలిచి తెరాసలో చేరిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి తీవ్ర నిరాశ మిగిలింది. 11 డివిజన్లలో ఒక్క చోట కూడా గులాబీ జెండా ఎగరలేదు.
మహేశ్వరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ది అదే పరిస్థితి. మహేశ్వరంలో రెండు డివిజన్లలోనూ ఒక్క చోట కూడా తెరాస గెలవలేదు. ముషీరాబాద్‌లో ఆరింటిలో అయిదు చోట్ల భాజపా, ఒక్క చోట ఎంఐఎం విజయం సాధించాయి. రాజేంద్రనగర్‌లోని అయిదు డివిజన్లలో రెండు ఎంఐఎం, వడింట భాజపా గెలుపొందాయి.
ప్రభావం చూపని అధిక శాతం ఎమ్మెల్యేలు
ముషీరాబాద్ నియోజకవర్గంపై ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక దృష్టి సారించారు. ఇక్కడ ఆరు డివిజన్లలో భాజపా అయిదు చోట్ల, ఎంఐఎం మరో చోట విజయం సాధించింది. అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌కు నిరాశే మిగిలింది. అయిదింటిలో రెండు చోట్లనే తెరాస గెలుపొందింది. ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్రెడ్డిదీ అదే పరిస్థితి. పదింటిలో ఆరు చోట్ల తెరాస గెలుపొందింది. హబ్సిగూడ నుంచి బరిలోకి దించిన భార్యను గెలిపించుకోలేకపోయారు. మల్కాజ్‌గిరిలోనూ మైనంపల్లి హన్మంతరావుకు కాస్త షాక్ తగిలింది. తొమ్మిది డివిజన్లకు గాను వడు చోట్ల భాజపా విజయం సాధించింది.