
అనుకున్నదొకటి.. అయిందొకటి
బీఎన్‌రెడ్డి నగర్ తెరాస అభ్యర్థికి షాక్
ఎల్బీనగర్, న్యూస్‌టుడే: ముందుచూపుతో చేసిన ఓ చిన్న పనే గ్రహపాటుగా మారితే.. ఎల్బీనగర్ నియోజకవర్గం బి.ఎన్.రెడ్డినగర్ డివిజన్లో అదే జరిగింది. కన్నతల్లి విజయానికి అహర్నిశలు శ్రమించిన తనయుడే.. చివరకు పరోక్షంగా ఆమె ఓటమికీ కారణమైన పరిస్థితి ఇది. ఇక్కడి సిట్టింగ్ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మీ ప్రసన్న మరోసారి తెరాస అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆమె తరపున డమ్మీ అభ్యర్థిగా కుమారుడు రంజిత్‌గౌడ్ కూడా నామినేషన్ వేశారు. ఫలితాల రోజు లెక్కింపునకు ఏజెంట్‌గా ఉంటాడనే ఉద్దేశంతో ఆయన నామినేషన్ ఉపసంహరించుకోలేదు. ఇక ఓట్ల లెక్కింపులో భాజపా అభ్యర్థి లచ్చిరెడ్డికి 11,438 ఓట్లు, లక్ష్మీప్రసన్న 11,406 ఓట్లు సాధించినట్టు అధికారులు ప్రకటించారు. 32 ఓట్ల తేడాతో ఆమె ఓడినట్టు వెల్లడించారు. రంజిత్‌గౌడ్‌కు (టార్చిలైట్ గుర్తు) 39 ఓట్లు రావడం గమనార్హం. తల్లీకుమారులు ఇద్దరూ ఒక్కటే అనే భావనతో ఓటర్లు రంజిత్‌గౌడ్‌కు ఓట్లేయడంతో ఈ పొరపాటు జరిగినట్టు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఏజెంట్ గుర్తింపుకార్డు కోసం చేసిన పని చేతి వరకు వచ్చిన విజయాన్ని చేజార్చిందంటున్నారు. రీకౌంటింగ్ జరపాంటూ లక్ష్మీప్రసన్న నిరసనకు దిగారు. అధికారులు కుదరదని చెప్పడంతో ఆమె వెళ్లిపోయారు.
ఇవీ చదవండి: