
ఇతర ముద్రల అంశంపై హైకోర్టులో విచారణ
సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమన్న ధర్మాసనం
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇతర ముద్రల ఓట్లపై సింగిల్జడ్జి జారీ చేసిన ఉత్తర్వులపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ హైకోర్టులో అప్పీల్ చేసింది. దీని కారణంగా నేరేడ్మెట్లో ఫలితం నిలిచిపోయిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది. మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. సిబ్బందికి శిక్షణ లోపం కారణంగానే ఇలా జరిగిందని హైకోర్టు అభిప్రాయపడింది. దీనిపై సోమవారం సింగిల్ జడ్జి విచారణ చేపట్టనున్న నేపథ్యంలో అత్యవసరంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. సింగిల్ జడ్జి విచారణ పూర్తయ్యాక అభ్యంతరం ఉంటే అప్పీలు చేయాలని తెలిపింది. సోమవారం ఉదయం మొదట ఈ అంశాన్ని విచారించాలని సింగిల్ జడ్జిని ఆదేశించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లపై స్వస్తిక్ ముద్ర కాకుండా ఇతర ఏముద్రలున్నా ఆ ఓట్లను పరిగణనలోకి తీసుకోవాలని గురువారం అర్ధరాత్రి ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులపై రాజకీయ పార్టీలు హైకోర్టును ఆశ్రయించడంతో ఆ నిర్ణయాన్ని నిలుపుదల చేయాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.