Published : 20/01/2021 04:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాళ్లపై రాస్తోన్న.. రాజధానికో ప్రేమలేఖ..!

నగరంలో పరిశోధక దర్శకురాలు ఉమా మగల్‌ చిత్రం

దక్కన్‌ కళలు, సంస్కృతికి దర్పణంగా ‘అదర్‌ కోహినూర్స్‌’

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌

‘ఈ నల్లని రాళ్లలో.. ఏ కన్నులు దాగెనో.. ఈ బండల మాటున.. ఏ గుండెలు మోగెనో..!!’ అంటూ అమరశిల్పి జక్కన్న చిత్రంలో ఘంటసాల పాడిన పాట దక్కన్‌ ప్రేమికుల గుండెల్లో ఎప్పటికీ మారుమోగుతూ ఉంటుంది. 400 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ దక్కన్‌ నగరి ప్రత్యేకతే రాళ్లు. అవే ఈ నగరానికి దేశ రాతి రాజధానిగా గుర్తింపునిచ్చాయి. పాత హైదరాబాదీలకు ఎన్నో మరిచిపోలేని జ్ఞాపకాలనిచ్చాయి. అభివృద్ధి దారిలో ఇప్పుడా రాతి కొండలన్నీ పిండవుతున్నాయి. దక్కన్‌ సంస్కృతి కాలగర్భంలో కలిసిపోతోంది. వాటిని కాపాడేందుకు.. అప్పుడు వాటితో ఆడుకున్న పిల్లలు.. ఇప్పటి మేధావులు.. వివిధ రూపాల్లో పోరాటాలు చేస్తున్నారు. ఆ కళని, విలువని ప్రపంచానికి చాటిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ‘అదర్‌ కోహినూర్స్‌.. ది రాక్స్‌ ఆఫ్‌ హైదరాబాద్‌’ పేరిట చిత్రాన్ని నిర్మించారు ప్రముఖ పరిశోధక దర్శకురాలు ఉమా మగల్‌. నగరంలో పుట్టిపెరిగిన ఆమె దిల్లీలోని జామియా మిలియా వర్సిటీలో ఉన్నత చదువు, అమెరికాలో ఫిల్మ్‌ మేకింగ్‌ కోర్సులు చేశారు. నగరానికే చెందిన ప్రకృతి ప్రేమికురాలు మహనూర్‌ ఖాన్‌తో కలిసి ఈ చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.


మహనూర్‌ ఖాన్‌

ఏళ్ల పరిశోధన.. ఉచిత ప్రదర్శన..!

2013 నుంచి దక్కన్‌ సంస్కృతిపై చేసిన పరిశోధనతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్ర బృందమంతా స్వచ్ఛందంగా సేవలందిస్తున్నవారే. ఇఫ్లూ, హెచ్‌సీయూలకు చెందిన పలువురు విద్యార్థులు ప్రచారకర్తలుగా, చిత్ర నిర్మాణంలోనూ స్వచ్ఛందంగా భాగమయ్యారు. ఈ నెలాఖరులో విడుదల చేయనున్న ఈ చిత్రాన్ని, ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్‌ హాళ్లలో ఉచితంగా ప్రదర్శించనున్నట్లు చెప్పారు.

‘‘ఉల్లాసమంటే.. ఆనందమంటే మా చిన్నతనంలో అన్నీ ఈ రాళ్లే. సెలవుల్లో అక్కడికెళ్లి సమయమంతా ప్రకృతికి కేటాయించడమే మాతరానికి తెలిసిన విషయం. అందులో ఎంత సంబరముందో.. దాని విలువేంటో ఈ తరానికి, నగరానికి ప్రేమలేఖగా అందిస్తున్నాం.’’

- ఉమా మగల్‌, చిత్ర దర్శకురాలు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని