
రైతులే లైన్మెన్లు!
తాండూరు గ్రామీణ: తాండూరు మండలం మిట్టబాస్పల్లి పొలాల్లో నియంత్రిక వద్ద తరచూ సరఫరా నిలిచిపోతోంది. సమస్య పరిష్కరించాలంటూ లైన్‌మన్ పద్మారెడ్డికి రైతులు నెల రోజులుగా చెబుతున్నారు. గురువారం మరోసారి సరఫరా నిలిచిపోవడంతో అక్కడికి చేరుకున్న లైన్‌మన్ నియంత్రికలో నూనె పోయాలని సూచించి నిష్క్రమించాడు. చేసేది లేక రైతులే ఇలా మరమ్మతులు చేసుకోవాల్సి వచ్చింది.
విద్యుత్ లేక రైతుల అవస్థలు
పెద్దేముల్, న్యూస్‌టుడే: విద్యుత్తు సరఫరా లేక రైతులు అవస్థలకు గురయ్యారు. గురువారం విద్యుత్తు అధికారులు ఎలాంటి సమాచారం లేకుండా సరఫరాను నిలిపివేశారు. చెరకు పంటను నాటేందుకు సిద్ధమైన రైతులు విషయం తెలియక ఇబ్బందులు పడ్డారు. పంట సాగుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుని రోజంతా విద్యుత్తు కోసం ఎదురు చూశారు. నాట్లు వేసేందుకు వచ్చిన కూలీలకు ముందు మాట ప్రకారం డబ్బులు చెల్లించాల్సి వచ్చిందని రైతు చిట్టేపు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.
విద్యుద్దీకరణ పనులు ప్రారంభం
తాండూరు గ్రామీణ: తాండూరు మండల పరిధి బెల్కటూరులోని పెన్నా సిమెంట్స్ కర్మాగారం నుంచి సంగెంకలాన్ శివారు కర్ణాటక సరిహద్దులోని చెట్టినాడ్ సిమెంటు కర్మాగారం వరకు నిర్మించిన రైలు మార్గంలో తాజాగా విద్యుద్దీకరణ పనులు చేపట్టారు. పనులు పూర్తయితే గూడ్సు రైళ్ల రాకపోకలు మరింత వేగవంతం అవుతాయని నిర్వాహకులు తెలిపారు. సిమెంటు ఎగుమతులకు, ముడి సరకు దిగుమతులకు విద్యుత్ రైలు మార్గం సౌకర్యంగా ఉంటుందన్నారు.