
జల విహారం.. జర జాగ్రత్త!
‘కోట్‌పల్లి’ వద్ద సౌకర్యాలు కరవు
అధికారులు దృష్టి సారిస్తేనే మేలు
కోట్‌పల్లి ప్రాజెక్టు అలుగు నీటిలో పర్యాటకులు
న్యూస్‌టుడే, ధారూర్: కోట్‌పల్లి జలశయానికి రోజు రోజుకు పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. పచ్చని చెట్లు.. ఆహ్లాదకరమైన వాతావరణం.. అలుగు నుంచి ప్రవహించే నీరు కనువిందు చేస్తుండడంతో కుటుంబ సమేతంగా సందర్శకులు ఇక్కడికి వస్తున్నారు. ప్రాజెక్టు నీటిలో దిగి జలకాలాడుతూ ఉల్లాసంగా..ఉత్సాహంగా గడుపుతున్నారు.తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఈ జలాశయం వద్ద ప్రమాదాలు సంభవిస్తున్నాయి. సరదాగా గడుపుతున్న క్రమంలో కొందరు చెరువులో పడి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. ఇటీవల ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మునిగి పోతుండగా, ముగ్గురిని బోటింగ్ సిబ్బంది కాపాడారు. మరొకరు నీటమునిగి మరణించారు. భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని, సంబంధిత శాఖ అధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా గుర్తించినా, తగిన వసతులు కల్పించకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
భారీ వర్షాల కారణంగా కోట్‌పల్లి ప్రాజెక్టు నీటి సామర్థ్యం 24 అడుగులు ఉండడంతో పూర్తిగా నిండి అలుగు పారుతోంది. ఇక్కడికి జంట నగరాలనుంచే కాకుండా కర్ణాటక నుంచి అధిక సంఖ్యలో వస్తున్నారు. వారాంతం, సెలవు రోజుల్లో వెయ్యి నుంచి 2 వేల వరకు, మిగతా రోజుల్లో వంద నుంచి రెండు వందల వరకు ఉంటున్నారు. వీరికి సరైన సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జలాశయం లోతు ఎంత? ఏఏ ప్రాంతాల వద్ద జాగ్రత్తగా ఉండాలన్న అంశాలతో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. సూచికలు లేకపోవడంతో కొందరు నీటిలో దిగి ప్రమాదాల భారిన పడుతున్నారు. నీటిలోకి వెళ్లకుండా కంచె ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉంటుంది.
బోటింగ్ చేసేవారికే రక్షణ
ప్రొగ్రెసివ్ ఇన్ తెలంగాణ ఆధ్వర్యంలో కోట్‌పల్లి ప్రాజెక్టులో బోటింగ్ కొనసాగుతోంది. అందులో 35 మంది లైఫ్‌గార్డులు పనిచేస్తున్నారు. మొత్తం 20 బోట్లు ఉన్నాయి. పడవ షికారు చేసేవారికి మాత్రమే రక్షణ చర్యలు చేపట్టి, వారి పర్యవేక్షణలో పడవ నడుపుతున్నారు. వందల సంఖ్యలో వచ్చే పర్యాటకులు చెరువులో ఎక్కడ పడితే దిగి ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోక ప్రమాదాలకు గురవుతున్నారు.
రెండు చోట్లా చెక్‌పోస్టులు
వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం రెండు చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటుచేశారు. వాహనాలకు రుసుం తీసుకుని లోపలికి పంపిస్తున్నారు. ప్రత్యేకంగా పార్కింగ్ స్థలం లేకపోవడంతో ఎక్కడపడితే అక్కడ నిలుపుతున్నారు. కొందరు చెరువు కట్టపైకి తీసుకెళుతున్నారు. కట్టపైకి వాహనాలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు చోటుచేసుకోకుండా ఉంటాయి. స్థలాన్ని ఏర్పాటుచేసి అక్కడే నిలిపేలా జాగ్రత్తలు తీసుకోవాలి.