
పాతకక్షతో నడిరోడ్డుపై వ్యక్తి హత్య
పోలీసుల అదుపులో నిందితుడు
బంట్వారం, న్యూస్‌టుడే: కన్నతల్లి విషయంలో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని నడిరోడ్డు మీద హత్య చేసిన సంఘటన బంట్వారం పోలీస్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. బంట్వారం గ్రామానికి చెందిన ఎర్రోళ్ల మల్లేశాన్ని(45) పత్తిపంటకు రసాయన మందులు పిచికారీ పనికి, సందపురం రాజు తల్లి గతేడాది తీసుకెళ్లారు. పొలానికి వెళ్లిన మల్లేశం ఆమె పట్ల ఇబ్బందికరంగా వ్యవహరించడవంతో ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులకు తెలిపారు. ఈ సంఘటనపై గ్రామంలో పెద్దమనుషుల సమక్షంలో అదే రోజు పంచాయతీ నిర్వహించారు. గొడవలు పడితే మంచిది కాదని ఇరువురికి సూచించారు. అదే సమయంలో రాజు ఎప్పటికైనా వదిలిపెట్టనని మల్లేశాన్ని హెచ్చరించాడు. భయాందోళనకు గురైన మల్లేశం, భార్య బిడ్డలతో నవాబ్‌పేట్ మండలం మాదారానికి వెళ్లాడు. అక్కడే సేద్యం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ గొడవ సద్దుమణిగిందని గ్రామస్థులు భావించారు. ఈ నేపథ్యంలోనే తన ఇంటిని అమ్మి డబ్బులు తీసుకెల్దామని భార్య పిల్లలతో మల్లేశ్ గురువారం ఉదయం గ్రామానికి వచ్చి నడుచుకుంటూ వెళుతుండగా రాజు కత్తితో దాడి చేశాడు. ముందు వెళుతున్న కుటుంబ సభ్యులు గమనించి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చి, 108కి సమాచారం ఇచ్చారు. క్షతగాత్రుడిని తాండూరు జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మల్లేశ్‌కు భార్య స్వరూప, కుమారుడు బల్వంత్, కూతురు పావని ఉన్నారు. రాజు పోలీసుల అదుపులో ఉన్నాడు. భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, తాండూరు జిల్లా ఆసుపత్రిలో శవ పంచనామా నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించామని ఎస్సై ప్రవీణ్‌రెడ్డి తెలిపారు.