
నగర కాంగ్రెస్ కమిటీ స్థానంలో జోన్లు!
గాంధీభవన్, న్యూస్‌టుడే: హైదరాబాద్‌లో బలోపేతంపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. నగర కాంగ్రెస్ కమిటీలో సమూల మార్పులకు కసరత్తు ప్రారంభించింది. ఇప్పటి వరకు హైదరాబాద్ రెవెన్యూ జిల్లా కమిటీ.. దానికి అధ్యక్షుడు, కార్యవర్గం ఉండగా, ఇందులో మార్పులు చేయాలని భావిస్తోంది. భాజపా తరహాలోనే హైదరాబాద్ రెవెన్యూ జిల్లా పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలను మూడు లేదా నాలుగు జోన్లుగా విభజించి.. వాటికి కమిటీలు వేయాలని చూస్తోంది. ఇందులో భాగంగా ఏఐసీసీ ఇన్‌ఛార్జి కార్యదర్శి బోస్‌రాజు, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్ఢి. గురువారం నగర కాంగ్రెస్ ముఖ్యనాయకులతో గాంధీభవన్‌లో సమావేశమయ్యారు. కాంగ్రెస్ నగర అధ్యక్షుడు అంజన్‌కుమార్‌యాదవ్, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి, యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్, పీసీసీ ప్రధాన కార్యదర్శులు కిషన్, జగదీష్, సంతోష్, అధికార ప్రతినిధి జి.నిరంజన్ తదితరులు హాజరయ్యారు. నియోజకవర్గాల వారీగా జోన్లు చేద్దామా? లేదా పార్లమెంట్ స్థానాల వారీగా చేద్దామా అని తెలుసుకున్నారు. అయితే మెజార్టీ నాయకులు మాత్రం ప్రస్తుతం ఉన్నట్లుగానే హైదరాబాద్ రెవెన్యూ జిల్లాతోనే నగర కమిటీ కొనసాగించాలని సూచించినట్లు తెలిసింది. జోన్లుగా విభజిస్తే నాయకుల మధ్య ఐక్యత కుదరడం కష్టమవుతుందని.. దీంతో పార్టీకి లాభం కన్నా నష్టం జరిగే ప్రమాదం ఎక్కువ ఉంటుందని చెప్పినట్లు సమాచారం.