Published : 22/01/2021 03:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

యువతిని మోసం చేసిన కానిస్టేబుల్‌


అభిలాష్‌కుమార్‌

నాగోలు, న్యూస్‌టుడే: ఓ యువతిని ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానంటూ మభ్యపెట్టి ఆమెను గర్భవతిని చేసిన కేసులో ఓ ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌ను ఎల్బీనగర్‌ పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. పోలీసుల కథనం ప్రకారం... ఛాదర్‌ఘాట్‌ సమీపంలోని ఆజంపురాకు చెందిన ఆవులగడ్డ అభిలాష్‌కుమార్‌ యాదవ్‌(32) నాగోలు సమీపంలోని జైపురీకాలనీలో ఉంటున్నాడు. స్థానికంగా నివసిస్తున్న ఓ యువతిని ప్రేమిస్తున్నాని చెప్పి లోబరచుకున్నాడు. పెళ్లిచేసుకుంటానని మభ్యపెట్టి గర్భవతిని చేశాడు. ఆపై ఆమెకు గర్భస్రావం చేయించి దూరంగా పెట్టాడు. పెళ్లిచేసుకోవాలంటూ ఆమె వేడుకోగా పట్టించుకోవడం మానేశాడు. బాధితురాలు ఎల్బీనగర్‌ ఠాణాలో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం అభిలాష్‌ను అరెస్టు చేశారు.


టోల్‌ఫ్రీ నంబరుతో రూ.84 వేలకు టోకరా

నారాయణగూడ: టోల్‌ఫ్రీ నంబర్‌తో ఫోన్‌ చేసి రూ.84 వేలు కాజేశాడో సైబర్‌ నిందితుడు. వెస్ట్‌ మారెడ్‌పల్లికి చెందిన ఘన్‌శ్యామ్‌కు ఇంట్లో ‘బీమ్‌’ సంస్థ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉంది. నెట్‌ రావడం లేదని ఆయన 1800తో మొదలయ్యే సంస్థ టోల్‌ఫ్రీ నరబరుకు సంప్రదించగా స్పందన రాలేదు. అరగంట తర్వాతా అదే టోల్‌ఫ్రీ నంబర్‌తో ఓ వ్యక్తి ఫోన్‌ చేసి ఒక యాప్‌ డౌన్‌లోడ్‌ చేయించాడు. బ్యాంకు ఖాతా, డెబిట్‌ కార్డు వివరాలు తెలుసుకొని, బాధితుడి ఖాతాలోంచి రూ.84 వేలు కొట్టేశాడు. విషయం తెలుసుకొని బాధితుడు సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


బకాయి కట్టలేదని వారు.. రుసుం చెల్లించలేదని వీరు

రామచంద్రాపురం రూరల్‌: ఐదేళ్లుగా బకాయి ఉన్నందుకు విద్యుత్తు కనెక్షన్‌ కట్‌ చేసినందుకు ప్రతీకారంగా రెవెన్యూ అధికారులు ట్రాన్స్‌కో కార్యాలయానికి తాళం వేసిన ఘటన రామచంద్రాపురంలో చోటుచేసుకుంది. రామచంద్రాపురం తహసీల్దార్‌ కార్యాలయం ఐదేళ్లుగా విద్యుత్తు బిల్లులు చెల్లించడం లేదు. దాదాపు రూ.6.50 లక్షలు బకాయి పడింది. ట్రాన్స్‌కో అధికారులు ఎప్పటికప్పుడు ఆ శాఖకు నోటీసులు పంపుతున్నారు. స్పందన రాకపోవడంతో గురువారం మధ్యాహ్నం విద్యుత్తు సరఫరా తొలగించారు. ఆగ్రహించిన రెవెన్యూ అధికారులు.. ట్రాన్స్‌కో కార్యాలయం ఏర్పాటుకు భూకేటాయింపులు జరిపాం.. సంబంధిత రుసుములు చెల్లించలేదంటూ అశోక్‌నగర్‌ ఏఈ కార్యాలయం గేటుకు తాళం వేశారు. అప్పటికే కార్యాలయంలో సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. వారందరినీ లోపలే ఉంచి తాళం వేయడం గమనార్హం. ఇదిలాఉంటే భూకేటాయింపునకు చెందిన ఎటువంటి నోటీసు తమకు ఇవ్వలేదని విద్యుత్తు ఏఈ మణికంఠ చెప్పారు. 30 ఏళ్లుగా భూకేటాయింపుల శిస్తు బకాయిలు ఉన్నాయని ఎటువంటి బిల్లులు చెల్లించడం లేదని తహసీల్దార్‌ శివకుమార్‌ చెప్పారు. అనంతరం కొద్ది సమయానికి గేటు తాళం తెరిచారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని