
సమాజ సేవలో భాగస్వాములు కావాలి
హైసియా సీఎస్ఆర్ సమ్మిట్లో పుల్లెల గోపిచంద్
మాదాపూర్, న్యూస్టుడే: సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని బ్యాడ్మింటన్ కోచ్, లీడ్ ఇండియా ఫౌండేషన్ అధ్యక్షులు పుల్లెల గోపిచంద్ అన్నారు. గురువారం హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజేస్ అసోసియేషన్ (హైసియా)4వ ‘‘సీఎస్ఆర్ సమ్మిట్ 2021’’ సమావేశం మాదాపూర్లోని హెచ్ఐసీసీలో నిర్వహించారు. గోపిచంద్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. హెచ్ఎస్బీసీ గ్లోబల్ సర్వీస్ సెంటర్స్ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ పాల్రాడాన్ మాట్లాడుతూ..హెచ్ఎస్బీసీ కార్పొరేట్ సిద్ధాంతాల్లో సమాజానికి తిరిగి ఇవ్వడం అనేది ఎంతో ముఖ్యమైన అంశమన్నారు. హైసియా అధ్యక్షులు భరణి కె.అరోల్ మాట్లాడుతూ.. సీఎస్ఆర్ విషయంలో పదిహేనేళ్లుగా హైసియా ఎంతో నిబద్ధతతో పనిచేస్తోందన్నారు. అనంతరం సీఎస్ఆర్ కింద ఉత్తమ సేవలందిస్తున్న పలు కంపెనీలకు అవార్డులను అందజేశారు. కార్యక్రమంలో యూత్ ఫర్ సేవా వ్యవస్థాపకులు వెంకటేశ్మూర్తి, హైసియా సీఎస్ఆర్ ఫోరం అధ్యక్షురాలు మనీషాసబూ తదితరులున్నారు.