
ఊపిరి కోసం ఉద్యమం!
కేబీఆర్ పార్కు పరిరక్షణకు ఏకమవుతున్న నగరవాసులు
ఎకో సెన్సిటివ్ జోన్ పరిధి తగ్గింపుపై ఆగ్రహం
పైవంతెనలు నిర్మించవద్దంటూ విజ్ఞప్తులు
ఈనాడు డిజిటల్, హైదరాబాద్; న్యూస్‌టుడే, జూబ్లీహిల్స్
పార్కు వద్ద పర్యావరణవేత్తల నిరసన (పాతచిత్రం)
నగరాభివృద్ధిలో భాగంగా మాయమవుతోన్న అడవుల జాబితాలోకి హైదరాబాద్ ‘ఊపిరి’గా ఉన్న కేబీఆర్ ఉద్యానమూ చేరుతోంది. లక్షలాది మంది జనాభాకు ఆక్సిజన్ అందిస్తోన్న ఈ మహావనం ఉనికి ప్రశ్నార్థకమవుతోంది. ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన పైవంతెనల కోసం ఈ పార్కు ఎకో సెన్సిటివ్ జోన్ పరిధి తక్కువున్నట్లు చెబుతున్నారు అధికారులు. కేబీఆర్ పరిరక్షణకు ఐదేళ్ల క్రితం మొదలైన ఉద్యమం.. తాజా పరిణామంతో ఊపందుకుంది.
నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంలో భాగంగా 2015లో ఎస్ఆర్డీపీ ప్రాజెక్టు కింద కేబీఆర్ పార్కు చుట్టూ ఆరు పైవంతెనలు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటితో పార్కు ప్రధాన ద్వారంతో పాటు జీహెచ్ఎంసీ నడకదారి పోతుంది. గతంలో ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిని తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల్ని కేంద్ర పర్యావరణ, అటవీశాఖ ఆమోదించింది. రిజర్వ్ ఫారెస్టు బయట సందర్శకుల ప్రాంతంలో ఉన్న నడకదారి గతంలో 25-30 మీటర్ల వెడల్పుతో ఉండేది. అక్టోబరు 27న విడుదల చేసిన కొత్త ఎకో సెన్సిటివ్ జోన్ నోటిఫికేషన్లో కొన్ని చోట్ల 3 మీటర్లేనని గుర్తించారు.
ప్రజాభిప్రాయాన్ని సేకరించకుండానే..
ఐదేళ్ల క్రితం ప్రకృతి ప్రేమికులు చేపట్టిన ఉద్యమానికి స్పందించిన కేంద్ర అటవీశాఖ పార్కులో చేపట్టే నిర్మాణాలపై ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని సూచించినా ప్రజాభిప్రాయాన్ని సేకరించకుండానే, ఎకో సెన్సిటివ్ జోన్ తగ్గిస్తూ ప్రతిపాదనలు పంపారని పర్యావరణవేత్తలు ఆగ్రహిస్తున్నారు. పార్కులోని చెట్లను తరలిస్తామని(ట్రాన్స్‌లొకేషన్) అధికారులు చెబుతున్నా, సచివాలయం కూల్చివేత సమయంలో 52 వృక్షాలను తరలించకుండా వదలడంతో దానిపైనా నమ్మకం కలగడంలేదు.
ప్రజలకు ఆరోగ్యం కావాలి: పురుషోత్తంరెడ్డి, పర్యావరణవేత్త; లుబ్నా సార్వత్, సామాజిక ఉద్యమకారిణి
కేబీఆర్ పార్కు ప్రాణవాయువునిస్తోంది. నడకదారి తగ్గింపే కాదు, కోర్ రిజర్వ్ ఫారెస్టులోనూ నిర్మాణాలు చేపడుతున్నారు. అభివృద్ధి పేరిట పార్కును హరించాలనుకోవడం దారుణం. మొండిగా ముందుకెళ్తే ఉద్యమం ఉద్ధృతమవుతుంది.