Published : 25/01/2021 02:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మూణ్నాళ్ల ముచ్చటే...!!

అటకెక్కిన ‘ఫీడ్‌ ద నీడ్‌’ కార్యక్రమం

పట్టించుకోని జీహెచ్‌ఎంసీ.. పస్తులతో నిరుపేదలు..


నిర్వహణ లేక పాడయిన జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ దగ్గరి ఫ్రిజ్‌

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో ఆకలితో అలమటించే వారికి ఆహారం అందించాలన్న సదాశయంతో ‘ఫీడ్‌ ద నీడ్‌’ పేరుతో రెండేళ్ల క్రితం ప్రారంభమైన కార్యక్రమం అర్ధంతరంగా నిలిచిపోయింది. ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో జీహెచ్‌ఎంసీ ఈ కార్యక్రమాన్ని గతంలో అట్టహాసంగా ప్రారంభించింది. కొన్నిరోజులపాటు అన్నార్తుల ఆకలి తీర్చినా.. ఇటీవల సంబంధిత కేంద్రాల ఆలనాపాలనా చూసేవారే కరవయ్యారు. దాదాపు 36 ప్రాంతాల్లో ఆహారాన్ని నిల్వ చేసేందుకు ఏర్పాటుచేసిన ఫ్రిజ్‌లు నిరుపయోగంగా మారాయి.

గ్రేటర్‌లో నిత్యం ఎందరో ఆకలితో అలమటిస్తుంటారు. మిగిలిపోయిన ఆహారాన్ని, ఎక్కువగా ఆహారం అందుబాటులో ఉన్న వారు కొన్ని సందర్భాల్లో వృథా చేస్తుంటారు. అలాంటి వారి నుంచి ఆహార పదార్థాలను సేకరించడం లేదా వారే స్వచ్ఛందంగా ఆహారాన్ని నగరంలో అందుబాటులో ఉన్న ఫ్రిజ్‌ల్లో ఉంచితే... అన్నార్తులు తీసుకుని కడుపునింపుకునే విధంగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఇందుకు యాపిల్‌ హోమ్స్‌ స్వచ్ఛంద సంస్థ ముందుకురావడంతో స్పందించిన జీహెచ్‌ఎంసీ యంత్రాంగం.. నగరంలోని రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, ఆటోస్టాండ్లు, నైట్‌షెల్టర్లు, ఆసుపత్రులు, ఇతర రద్దీ ప్రాంతాల్లో కలిపి మొత్తం 36 చోట్ల ఫ్రిజ్‌లను ఏర్పాటు చేసింది. హోటళ్లు, ఫంక్షన్‌ హాళ్లు, వసతిగృహాల నిర్వాహకులతోపాటు శుభకార్యాల సందర్భంగా ఇళ్లలో మిగిలిన ఆహారాన్ని వృథాగా పారేయకుండా సమీపంలోని ఫ్రిజ్‌లలో ఉంచేలా చర్యలు చేపట్టారు. ఆపిల్‌ హోమ్స్‌ ఫ్రిజ్‌లను సేకరించి ఇవ్వగా, వీటిని స్థలం, విద్యుత్తు సరఫరా సమకూర్చే బాధ్యతలను జీహెచ్‌ఎంసీ నిర్వహించింది.

ఆర్నెల్లుగా మూలకు..

ప్రారంభించిన తొలినాళ్లలో వీటి నిర్వహణ బాగానే ఉన్నా అనంతరం బల్దియా పట్టించుకోవడం మానేసింది. గత ఆర్నెల్లుగా ఫీడ్‌ ద నీడ్‌ సెంటర్లు పనిచేయడం లేదు. ఒక్కో కేంద్రం ద్వారా గతంలో రోజుకు 100 మంది వరకు ఆకలి తీరేది. ప్రస్తుతం ఆయా కేంద్రాలు ఉపయోగం లేకుండా పోయాయి. కొన్నిచోట్ల ఫ్రిజ్‌లు పూర్తిగా పనిచేయడం లేదు.

జీహెచ్‌ఎంసీ చొరవ చూపాలి

-నీలిమా ఆర్య, యాపిల్‌ హోమ్స్‌ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు

గ్రేటర్‌వ్యాప్తంగా ప్రతి డివిజన్‌లో రెండుచొప్పున ఫీడ్‌ ద నీడ్‌ సెంటర్ల ఏర్పాటుకు బల్దియా అధికారులు గతంలో హామీ ఇచ్చారు. ప్రస్తుతం వాటి గురించి పట్టించుకోవడమే మానేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లభించకపోవడంతో ఆయా కేంద్రాలు మొత్తానికే మూలన పడ్డాయి. మరోవైపు, షీ నీడ్స్‌ పేరిట రుతురుమ్మాళ్లను ఉచితంగా అందించేందుకు రెండు కేంద్రాలనూ అందుబాటులోకి తీసుకొచ్చాం. ప్రస్తుతం అవీ సక్రమంగా పనిచేయడం లేదు. ఇప్పటికైనా జీహెచ్‌ఎంసీతో పాటు దాతలు ముందుకు వచ్చి ఆయా కార్యక్రమాలు సజావుగా కొనసాగేలా చర్యలు చేపడితే నగరవాసులకు ఉపయుక్తంగా ఉంటుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని