
దాడి కేసులో విచారణకు హాజరుకానున్న ఒవైసీ
ఈనాడు డిజిటల్, హైదరాబాద్: కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీపై దాడి కేసులో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సోమవారం ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుకానున్నారు. ఈ కేసులో పలుమార్లు విచారణకు హాజరుకాకపోవడంతో ప్రత్యేక న్యాయస్థానం 18న నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ సోమవారం(25న) కచ్చితంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో షబ్బీర్ అలీ మరికొందరు కారులో వెళ్తుండగా కొందరు వ్యక్తులు ఆ వాహనం అడ్డుకొని దాడి చేశారు. ఈ ఘటనపై మీర్‌చౌక్ పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు. ఇందులో అసదుద్దీన్ ఒవైసీని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ క్రిమినల్ కేసు నమోదు చేశారు. ప్రత్యక్ష సాక్షులు, వీడియోలు ఉన్నట్లు పోలీసులు ఛార్జీషీట్లో పేర్కొన్నారు. దాడికి సంబంధించి తమ క్లైయింట్‌కు ఎలాంటి సంబంధం లేదంటూ అసదుద్దీన్ ఒవైసీ తరఫు న్యాయవాది అజీం న్యాయస్థానానికి విన్నవిస్తూ డిశ్ఛార్జి పిటిషన్ దాఖలు చేయగా... దీనిపై మీర్‌చౌక్ పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. దాడిలో అసదుద్దీన్ పాత్ర ఉందని న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. దీంతో విచారణకు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది. అయినప్పటికీ పలు కారణాలతో ఐదుసార్లు ఒవైసీ హాజరుకాలేదు. గత సోమవారం ప్రత్యేక న్యాయస్థానం నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.